హెచ్‌డీఎఫ్‌సీకి ‘ఐపీఓ’ జోష్‌

IPO income boosts HDFC bottomline by 25% to Rs 2467 cr - Sakshi

25 శాతం వృద్ధితో  రూ.2,467 కోట్లకు నికర లాభం  

రూ.1,000 కోట్ల ఐపీఓ  లాభమే దీనికి ప్రధాన కారణం  

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ నికర లాభం(స్టాండ్‌ అలోన్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 25 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,978 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,467 కోట్లకు పెరిగిందని  హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తెలిపింది. తమ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ వాటా విక్రయం కారణంగా రూ.1,000 కోట్ల లాభం రావడం, 17 శాతం రుణ వృద్ధి  కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వైస్‌ చైర్మన్‌ కేకీ మిస్త్రీ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.9,007 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.11,257 కోట్లకు పెరిగింది.   

రూ.2,649 కోట్ల నికర వడ్డీ ఆదాయం..
రుణాలు 17 శాతం వృద్ధితో రూ.3.79 లక్షల కోట్లకు ఎగిశాయని మిస్త్రీ చెప్పారు. ఫలితంగా నికర వడ్డీ ఆదాయం 16 శాతం పెరిగి రూ.2,649 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్‌ ఎలాంటి మార్పు లేకుండా 3.5% నమోదైందని వివరించారు.  

మెరుగుపడిన రుణ నాణ్యత... 
రుణ నాణ్యత మెరుగుపడిందని మిస్త్రీ పేర్కొన్నారు.  స్థూల మొండి బకాయిలు 1.18 శాతం నుంచి 1.13 శాతానికి తగ్గాయని తెలిపారు. నికర మొండి బకాయిలు నిలకడగా 0.66 శాతంగా ఉన్నాయని వివరించారు. నిబంధనల ప్రకారం రూ.2,951 కోట్ల కేటాయింపులు జరపాల్సి ఉండగా, రూ.5,071 కోట్ల కేటాయింపులు జరిపామని చెప్పారు. చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఎలాంటి రుణాలివ్వలేదని మిస్త్రీ చెప్పారు. తమకు ఎలాంటి లిక్విడిటీ సమస్యలు లేవన్నారు.  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ 0. 4 శాతం నష్టపోయి రూ.1,762 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top