సంస్కరణల బాటలోనే.. | Invitation to foreign investors from Finance Minister Jaitley | Sakshi
Sakshi News home page

సంస్కరణల బాటలోనే..

Sep 22 2015 1:03 AM | Updated on Oct 4 2018 6:57 PM

సంస్కరణల బాటలోనే.. - Sakshi

సంస్కరణల బాటలోనే..

భారత్‌కు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సింగపూర్‌లో పర్యటించిన ఆర్థికమంత్రి తన నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా చివరిరోజు హాంకాంగ్ చేరుకున్నారు...

అధిక వృద్ధిరేటే లక్ష్యం...
- విదేశీ ఇన్వెస్టర్లకు ఆర్థికమంత్రి జైట్లీ ఆహ్వానం
- వ్యాపారాలకు మరింత సానుకూల పరిస్థితులు కల్పిస్తామని హామీ
హాంకాంగ్:
భారత్‌కు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సింగపూర్‌లో పర్యటించిన ఆర్థికమంత్రి తన నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా చివరిరోజు హాంకాంగ్ చేరుకున్నారు.  హాంకాంగ్‌లో సైతం ఆయన ఇన్వెస్టర్ల పెట్టుబడులే లక్ష్యంగా పనిచేశారు. ఈ దిశలో ఆయన ఏపీఐసీ-ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల సదస్సును వినియోగించుకున్నారు. అధిక వృద్ధే లక్ష్యంగా భారత్‌లో సంస్కరణల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

వ్యాపారాలకు తగిన పరిస్థితులను కల్పించడానికి వీలయిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆరు నెలల్లో ఆర్బిట్రేషన్ విధానంలో వివాదాల పరిష్కారానికి కొత్త చట్టాన్ని తీసుకురావడంసహా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను ఆయన ప్రస్తావించారు.  అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నా గత ఆర్థిక సంవత్సరం సాధించిన 7.3 శాతం వృద్ధి కన్నా అధికాభివృద్ధిని సాధిస్తామన్న ధీమానూ వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని క్లుప్తంగా చూస్తే...

- అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో.. భారత్ మాత్రం పెట్టుబడులకు, చక్కటి వృద్ధికి వేదికగా ఉంది. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు వంటి పలు స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయి.
- మౌలిక, తయారీ తదితర రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయి.
- మా ఎగుమతులుసహా పలు అంశాల్లో అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు ఉన్నా.. గత ఏడాదికన్నా మెరుగైన ఆర్థిక అభివృద్ధి సాధన సత్తా ఉంది.
- దేశంలో పన్నుల విధానాన్ని సరళీకరిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా రూపొందించే కసరత్తు జరుగుతోం ది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి వస్తుందన్న విశ్వాసంతో ఉన్నాం.
- వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు అతి తక్కువగా ఉంది. ఇది ఒక సవాలే. మా దేశంలో దాదాపు 55 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇబ్బంది ఉంది. ఈ పరిస్థితుల్లో వృద్ధి స్వల్ప స్థాయిల్లోనే ఉంటోంది. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 15 శాతంగా ఉంది. వ్యవసాయ రంగం మెరుగైన ఫలితాలు ఇస్తే వృద్ధి బాగుంటుంది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా రూ.69,000 కోట్ల సమీకరణ జరుగుతుందన్న విశ్వాసం ఉంది. ఈ దిశలో ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. గత రెండు నెలల్లో మేము ఈ విషయంలో కొంత ముందడుగు వేసినా.. మార్కెట్ ఒడిదుడుకులు ఇబ్బందులు పెడుతున్నాయి.
 
వడ్డీరేట్లు తగ్గాలని కోరిక...
జైట్లీ ఈ సందర్భంగా దేశంలో అధిక వడ్డీరేట్ల అంశాన్నీ పరోక్షంగా ప్రస్తావించారు. దేశీయ ప్రైవేటు రంగం పెట్టుబడులు నెమ్మదిగా ఉన్నాయని అన్నారు. పెట్టుబడులకు సంబంధించి అధిక వ్యయభారం పలు రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement