ఉత్పత్తులకు ప్యా‘కింగ్’ జోష్! | Indian Institute of Packaging director s.c.saha chit chat | Sakshi
Sakshi News home page

ఉత్పత్తులకు ప్యా‘కింగ్’ జోష్!

Jan 12 2016 1:24 AM | Updated on Sep 3 2017 3:29 PM

ఉత్పత్తులకు ప్యా‘కింగ్’ జోష్!

ఉత్పత్తులకు ప్యా‘కింగ్’ జోష్!

కొబ్బరి నీళ్లు కొన్ని గంటలు మాత్రమే నిల్వ చేస్తాం. ఎక్కువ సమయమైతే అవి పాడైపోతాయి.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ డెరైక్టర్ ఎన్.సి. సాహా
జీవిత కాలం పెంచేలా ప్యాకింగ్స్‌ను అభివృద్ధి చేసే సత్తా మాకుంది
* నూతన ప్యాకింగ్‌తో ఉత్పత్తికి విలువ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొబ్బరి నీళ్లు కొన్ని గంటలు మాత్రమే నిల్వ చేస్తాం. ఎక్కువ సమయమైతే అవి పాడైపోతాయి. కానీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) ఒక అడుగు ముందుకేసి ఆరు నెలలపాటు నిల్వ ఉండేలా కొత్త రకం ప్యాకింగ్ విధానాన్ని అభివృద్ధి చేసింది. వేలాది కొబ్బరి రైతులకు కొత్త ఆశలను రేపింది. ఇప్పుడు ఇదే సంస్థ మరిన్ని ఉత్పత్తుల జీవిత కాలం పెంచేలా ప్యాకింగ్ విధానాలను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైంది.

ప్యాకింగ్ ఏదైనా విజయవంతంగా రూపొం దించే సత్తా తమకు ఉందని అంటున్నారు ఐఐపీ డెరైక్టర్ డాక్టర్ ఎన్.సి.సాహా. సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. విశేషాలు ఇవీ..
 
ప్యాకింగ్‌తో ఉత్పత్తులకు విలువ చేకూర్చవచ్చంటున్నారు. కాస్త వివరించండి..

కర్జూర చెట్టు నుంచి వచ్చే ద్రావంతో నాలెన్ గుర్(బెల్లం) తయారు చేస్తారు. నాలెన్ గుర్ ధర కిలోకు రూ.150 ఉంటుంది. శీతాకాలంలో మాత్రమే ఇది లభిస్తుంది. మూడు నెలలు నిల్వ ఉండేలా ట్యూబ్ వంటి ప్యాకింగ్‌ను దీనికోసం అభివృద్ధి చేశాం. దీనికిగాను ఐఐపీకి పేటెంటు ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చెందిన ఖాదీ గ్రామోద్యోగ్ ఈ ప్రాజెక్టును ఐఐపీకి అప్పగించింది. ఈ ఉత్పత్తిని విశ్వ బంగ్లా రిటైల్ ఔట్‌లెట్లలో 100 మిల్లీలీటర్ల ప్యాక్‌ను రూ.100కు విక్రయిస్తున్నారు. ఉత్పాదన ఏదైనా జీవిత కాలం పెరిగితే అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ.
 
ప్రస్తుతం ఐఐపీ చేపట్టిన ప్రాజెక్టులేమిటి?
పశ్చిమ బెంగాల్‌లో జోయనగర్ మోవ అనే లడ్డూకు మంచి పేరుంది. నాలెన్ గుర్, మురమరాలతో మోవ తయారు చేస్తారు. ఈ లడ్డూతోపాటు బర్దోమా జిల్లాలో డిమాండ్ ఉన్న మిహిదానా లడ్డూకు సైతం మూడు నెలలపాటు నిల్వ ఉండేలా ప్యాకింగ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మైనారిటీ శాఖ అప్పగించిన ప్రాజెక్టులో భాగంగా 40 రకాల పట్టు చీరలకు అందమైన డిజైన్లలో ప్యాకింగ్‌ను రూపొందిస్తున్నాం.

మంచి ప్యాకింగ్ ఉంటే అమ్మకాలు అధికమవుతాయన్నది మైనారిటీ శాఖ ఆలోచన. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న టీ పౌడర్‌లో 80 శాతం బల్క్‌గా వెళ్తోంది. ఇలా కాకుండా అందమైన చిన్న ప్యాక్‌లలో వెళితే ఎక్కువ ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా ప్యాక్‌లను డిజైన్ చేయాలని ఐఐపీని కోరింది. లవంగాలు, యాలకుల నుంచి తీసిన నూనె సహజత్వం కోల్పోకుండా ఎక్కువ రోజులు మన్నేలా ప్యాక్‌ను రూపొందిస్తున్నాం.
 
తిరుపతి లడ్డూకు సైతం ప్యాకింగ్‌ను రూపొందిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది?
లడ్డూ జీవిత కాలం రెండు నెలలు ఉండేలా చేయవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) 2013లోనే ప్రతిపాదన పంపాం. ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.10 లక్షలు మాత్రమే. టీటీడీ నుంచి ఎటువంటి స్పందన లేదు. మేం అభివృద్ధి చేసే ప్యాకింగ్‌తో లడ్డూ ధర పెంచి విక్రయించుకోవచ్చు. ఎక్కువ రోజులు మన్నుతుందంటే ప్రీమి యం చెల్లించేందుకూ వినియోగదార్లు సిద్ధంగా ఉంటారు.

మేము రూపొందించిన ప్యాకింగ్‌తో ఉన్న ఏ ఉత్పాదన అయినా రిఫ్రిజిరేటర్లో పెట్టక్కరలేదు. సాధారణ వాతావరణంలో ఉంచితే చాలు. ప్యాక్‌ను తెరిస్తేనే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇక బిర్యానీ 7 రోజుల పాటు నిల్వ చేయవచ్చు. హోటళ్ల నిర్వాహకులు ముందుకు వస్తే టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు మేం సిద్ధం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement