
ఈ-కామర్స్ డిస్కౌంట్లకు చెక్!
నిన్న మొన్నటి వరకూ ఈ-కామర్స్ అంటే డి స్కౌంట్లు... చౌకధరలు. తమ విలువల్ని పెంచుకోవటానికి, మార్కెట్లో పట్టు సంపాదించటానికి
సెల్లర్ల నుంచి వసూలు చేసే కమిషన్ పెంపు
♦ అమెజాన్ బాటలోనే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్
♦ ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్న పేటీఎం
♦ ఎలక్ట్రానిక్ వస్తువుల రిటర్న్ గడువు కుదింపు
♦ 30 నుంచి 10 రోజులకు తగ్గించిన ఫ్లిప్‌కార్ట్
♦ నష్టాల్ని భరించలేక దిద్దుబాటుకు దిగిన కంపెనీలు
♦ 2015లో మూడు కంపెనీల నష్టం రూ.7వేల కోట్లు
♦ ఇదంతా ఆఫర్లు, డిస్కౌంట్ల వల్లేనంటున్న సంస్థలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిన్న మొన్నటి వరకూ ఈ-కామర్స్ అంటే డి స్కౌంట్లు... చౌకధరలు. తమ విలువల్ని పెంచుకోవటానికి, మార్కెట్లో పట్టు సంపాదించటానికి ఈ-కామర్స్ కంపెనీలు తమ సైట్లలో వస్తువులు విక్రయించే సెల్లర్లకు రాయితీలిచ్చి మరీ దీన్ని కొనసాగించాయి. అగ్రస్థానం కోసం ఒకదానితో ఒకటి పోటీ పడి ఆఫర్లు కురిపించాయి. కొన్ని సందర్భాల్లో కొందరికి ప్రింటర్ల వంటి వస్తువులు కేవలం రూపాయికే వచ్చాయంటే... పోటీని అర్థం చేసుకోవచ్చు.
అయితే అదంతా గతం. ఈ పోటీ ఈ- కామర్స్ కంపెనీలకు వందల కోట్ల నష్టాలు తెచ్చింది. వాటి విలువల్నీ బాగా తగ్గించేసింది. ఫలితం.. వీటిలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు లాభాల కోసం ఒత్తిడి మొదలెట్టారు. దీనికి తలొగ్గిన కంపెనీలు... తాజాగా సెల్లర్ల నుంచి తీసుకునే కమిషన్‌ను పెంచేశాయి. సెల్లర్లు కూడా వస్తువుల ధరల్ని పెంచాల్సిన పరిస్థితి. ఇదీ... ఇప్పటి ఈ-కామర్స్ వెబ్‌సైట్ల పరిస్థితి.
ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, అమెజాన్ వంటి దేశీ అగ్రశ్రేణి ఈ-కామర్స్ కంపెనీలన్నీ సెల్లర్ల నుంచి వసూలు చేస్తున్న కమిషన్‌కు ప్రామాణికత తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలెట్టాయి. అంటే ఇక ఈ సైట్లన్నీ ఒకే మొత్తాన్ని కమిషన్‌గా వసూలు చేస్తాయన్నమాట. తాజాగా ఫ్లిప్‌కార్ట్ సంస్థ అన్ని విభాగాల్లోనూ సెల్లర్ల నుంచి వసూలు చేస్తున్న కమిషన్ శాతాన్ని పెంచింది. అమెజాన్, పేటీఎం, స్నాప్‌డీల్‌తో సమానం చేయటానికే ఇలా పెంచుతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వర్గాలు చెప్పాయి.
‘‘కమిషన్ శాతాన్ని స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే మా సైట్లో వివిధ రకాల వస్తువులుంటాయి. వాటిని బట్టే కమిషన్ ఉంటుంది’’ అని ఆ వర్గాలు చెప్పాయి. కాగా కమిషన్లు పెంచటం వల్ల సెల్లర్లు 9 శాతం వరకూ ధరలు పెంచే అవకాశమున్నట్లు సోమవారం ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. మరోవంక ఫ్లిప్‌కార్ట్ ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ‘జీరో కమిషన్’ స్కీమ్‌ను కూడా ఎత్తేసింది. ఇప్పటిదాకా బాగా ప్రాచుర్యం ఉన్న 350 మంది సెల్లర్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయకుండా... వారి ప్రొడక్ట్‌లను డిస్‌ప్లే చేసేచోట ప్రకటనలు వేస్తూ ఫ్లిప్‌కార్ట్ ఈ స్కీమ్‌ను అమలు చేసింది. అయితే కమిషన్ పెంచటమనేది సెల్లర్లలో పోటీ తత్వాన్ని పెంచటానికేనని, ఇప్పటికీ పోటీ కంపెనీలకన్నా తాము తక్కువే వసూలు చేస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఇప్పటికే పెంచిన అమెజాన్...
ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌తో పోటీపడుతూ ధరల యుద్ధానికి తెరతీసిన అమెజాన్... ఇటీవలే సెల్లర్ల నుంచి వసూలు చేసే కమిషన్‌ను పెంచింది. 2015లో... ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ రూ.7,000 కోట్ల నష్టాలను ప్రకటించాయి. వీటిలో అధిక భాగం డిస్కౌంట్లు, ఆఫర్ల వల్ల సంభవించినవేనని ఈ సంస్థలు చెప్పాయి కూడా.
ఇదే బాటలో పేటీఎం...!
చైనా ఈ-కామర్స్ దిగ్గజానికి చెందిన పేటీఎం కూడా కమిషన్ పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై వ్యాఖ్యానించటానికి పేటీఎం ప్రతినిధి నిరాకరించారు. నిజానికి చైనాలో అలీబాబా తన సెల్లర్ల నుంచి తక్కువ కమిషన్‌నే వసూలు చేస్తోంది. కాకపోతే వారి ఉత్పత్తుల్ని ప్రదర్శించే చోట ప్రకటనల ద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జిస్తోంది. వారి ఉత్పత్తుల ప్రకటనలకూ బాగానే వసూలు చేస్తోంది. ఈ సంస్థకు వచ్చే ఆదాయంలో సగం కేవలం ప్రకటనల నుంచే వస్తోందంటే పరిస్థితి తెలియకమానదు. దాన్నే ఇక్కడ కూడా అనుసరిస్తుందా? లేక మిగిలిన సంస్థల్లా కమిషన్ పెంచుతుందా అన్నది తెలియరాలేదు.
రిటర్న్‌కు ఇక అంతా ఒకే సమయం!
ప్రామాణికతలో భాగంగా ఈ-కామర్స్ సంస్థలన్నీ ఇక వస్తువుల్ని తిరిగి తీసుకునేందుకు ఒకే గడువు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెజాన్ బాటలో ఫ్లిప్‌కార్ట్ కూడా ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లు, పుస్తకాల్ని తిప్పి పంపే గడువును 10 రోజులకు కుదించింది. గతంలో ఇది 30 రోజులుండేది. స్నాప్‌డీల్ వీటిని 7 రోజుల్లోగా తిప్పి పంపాలని చెబుతోంది. ‘‘ఫ్లిప్‌కార్ట్ ఉత్పత్తుల్లో తిరిగివచ్చేవాటిలో అధికం డెలివరీ అయిన 5 రోజుల్లోగానే జరుగుతున్నాయి. అందుకని మా రిటర్న్ పాలసీ మార్చటం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు’’ అని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి చెప్పారు.