ఎన్‌బీఎఫ్‌సీలకు ‘ఐఎల్‌ఎఫ్‌ఎస్‌’ ముప్పు!

IL&FS crisis may lead to cancellation of licenses of 1500 NBFCs - Sakshi

రుణ చెల్లింపుల్లో పెద్ద సంస్థే విఫలం కావడంపై ప్రశ్నలు

చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు మనుగడ ప్రశ్నార్థకం

నిధులు దండిగా లేనివి నిలబడటం కష్టమే

1,500 కంపెనీల లైసెన్స్‌ల రద్దుకు అవకాశం

కొత్తగా వచ్చే సంస్థలకు అనుమతులు కష్టమే

ఈ రంగంలో స్థిరీకరణకు చోటు  

నిపుణుల అంచనాలు

న్యూఢిల్లీ: మౌలిక రంగానికి రుణాలు, నిర్మాణ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు... తాను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడం యావత్‌ ఎన్‌బీఎఫ్‌సీ రంగాన్నే తీవ్రంగా కుదిపేస్తోంది. క్రెడిట్‌ రిస్క్‌పై సరికొత్త ఆందోళనలకు తావిచ్చింది. అంతేకాదు, ఈ పరిణామం ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు మరణశాసనం కానుంది! సుమారు 1,500 చిన్న ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల లైసెన్స్‌లను ఆర్‌బీఐ రద్దు చేసే అవకాశం ఉందని, కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టే వాటికి అనుమతులు కూడా మరింత కష్టతరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నిధుల బలం ఉండి, సంప్రదాయంగా నడిచే ఫైనాన్స్‌ కంపెనీలు చిన్న సంస్థలను మింగేయవచ్చన్నది నిపుణులు అంచనా కడుతున్నారు. దీంతో చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకునే వారికి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని, ఇది ప్రైవేటు వినియోగం పెరుగుదలను అడ్డుకునే అంశంగా భావిస్తున్నారు. ‘‘వెలుగుచూస్తున్న పరిణామాలు కచ్చితంగా ఆందోళన కలిగించేవి. ఈ రంగం స్థిరకీరణకు గురవుతుంది’’ అని బంధన్‌ బ్యాంకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ హరూన్‌ రషీద్‌ ఖాన్‌ తెలిపారు. ఆస్తులు, అప్పుల మధ్య అంతరం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు.

బ్యాంకులకు మించి ఎదుగుదల
గ్రామీణంగా అధిక రిస్క్‌తో రుణాలిస్తున్న వేలాది సంస్థల మనుగడను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అంశం ప్రశార్థకం చేసింది. దేశవ్యాప్తంగా 11,400 ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల ఉమ్మడి బ్యాలన్స్‌ షీటు మొత్తం 22.1 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. బ్యాంకుల కంటే వీటిపై నియంత్రణలు తక్కువే. దీంతో బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల రుణ పుస్తక మొత్తం రెండు రెట్ల మేర వృద్ధి చెందడం గమనార్హం.

అందుకే ఈ విభాగం కొత్త పెట్టుబడిదారులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో చాలా సంస్థల క్రెడిట్‌ రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్‌ ముప్పు ఏర్పడింది. అధిక నిధుల సమీకరణ వ్యయాలు, ఐఎల్‌ ఎఫ్‌ఎస్‌ తరహా సంక్షోభాలతో రుణాలకు కటకట ఏర్పడుతుందని, తగినన్ని నిధుల్లేని సంస్థలు నిలదొక్కుకోవడం కష్టమేనన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

‘‘చిన్న ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు వ్యయాల పరంగా సమస్యను ఎదుర్కోనున్నాయి. వాటి లిక్విడిటీ (నగదు లభ్యత) ప్రస్తుత స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ, మధ్య, పెద్ద స్థాయి ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు తమ లక్ష్యాలను సాధించగలవు. నిధులను పొందగలవు’’ అని క్యాప్రి గ్లోబల్‌ క్యాపిటల్‌ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ అధిపతి రాజేష్‌ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు ఎటువంటి రాయితీలు లేనందున, తమ పోర్ట్‌ఫోలియో పనితీరును సరిగ్గా నిర్వహించలేని సంస్థలు కనుమరుగవుతాయన్నారు.

చిన్న సంస్థలకు అస్తిత్వ ముప్పు
కనీసం రూ.2 కోట్ల నిధుల్లేని ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్‌ను ఆర్‌బీఐ రద్దు చేసే ప్రక్రియలో ఉందంటున్నారు నిపుణులు. ‘‘ఆర్‌బీఐ ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ప్రక్రియలో ఉంది. 1,500 సంస్థలు కనుమరుగు కానున్నాయి’’ అని ఫైనాన్స్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఈ రంగానికి చెందిన సంఘం) చైర్మన్‌ రామన్‌ అగర్వాల్‌ తెలిపారు. అయితే, ఇదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీ రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్‌బీఐ వద్దకు వందలాది నూతన దరఖాస్తులు వరదగా వస్తున్నట్టు చెప్పారు.

‘‘దేశంలో సుమారు 11,000 వరకు ఎన్‌బీఎఫ్‌సీలు 500 కోట్ల రూపాయల్లోపు ఆస్తులు కలిగిన చిన్న, మధ్య స్థాయి సంస్థలే. కానీ, అగ్ర స్థానంలో ఉన్న 400 ఎన్‌బీఎఫ్‌సీల్లో చాలా వరకు బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలకు చెందినవి. 90 శాతానికి పైగా ఆస్తులు వీటి నియంత్రణలోనే ఉన్నాయి’’ అని రామన్‌ అగర్వాల్‌ వివరించారు. కస్టమర్లకు 2 శాతం అదనపు వడ్డీ రేటు విధించినప్పటికీ, ఎన్‌బీఎఫ్‌సీలకు కస్టమర్లతో సన్నిహిత సంబంధాలుంటాయన్నారు. 

తాజా పరిణామాలను ఆర్థికంగా దిగ్గజ సంస్థలైన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్, బజాజ్‌ ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ వంటి సంస్థలు తట్టుకుని నిలబడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండేళ్ల కాలంలో ఐడీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ మహింద్రా బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు ఒక్కో మైక్రోఫైనాన్స్‌ సంస్థను కొనుగోలు చేశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు సైతం భారత్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. మార్కెట్లో కొంతమేర స్థిరీకరణ ఉంటుందని ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా పేర్కొన్నారు. దీర్ఘకాలంలో ఈ రంగానికి ఇది మేలు చేస్తుందన్నారు.

రూ. 300 కోట్లు చెల్లించిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌
ముంబై: పలు రుణ చెల్లింపుల్లో విఫలమైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు, ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌కు మాత్రం రూ.300 కోట్ల బకాయిలను చెల్లించింది. ఆగస్టు 27 నుంచి ఏడు చెల్లింపుల్లో వైఫల్యం చెందినట్టు ఐఎల్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూపు స్వయంగా ప్రకటించింది. ‘‘ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు సంస్థ ఐఎల్‌ అండ్‌ఎఫ్‌ఎస్‌ సెక్యూరిటీస్‌ నుంచి మా వడ్డీ చెల్లింపులు, మెచ్యూరిటీ తీరిన వాటి చెల్లింపులు జరిగాయి. ఇందులో తుదిగా రూ.300 కోట్లు శుక్రవారం చెల్లించడం జరిగింది’’ అని ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ తెలిపింది.  

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: గార్గ్‌
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కారణంగా ఏర్పడిన పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, ఫైనాన్షియల్‌ సిస్టమ్‌పై ఎటువంటి అసాధారణ ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్‌ చెప్పారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు విభాగాలు కొన్ని రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో ఆర్థిక రంగంలో లిక్విడిటీ సమస్య ఏర్పడవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ వాటాదారులైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాల చీఫ్‌లతో ఆర్థిక శాఖ చర్చించింది. ఈ సమస్య వ్యవస్థలో ఇతర విభాగాలకు వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇన్‌ఫ్రా విభాగంలో ఇది అతిపెద్ద కంపెనీ అని, ప్రభుత్వ విభాగాలతో ఎక్కువగా భాగస్వామ్యం కలిగి ఉందని గార్గ్‌ చెప్పారు. చాలా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.   

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ వాటాదారులతో ఆర్‌బీఐ మంతనాలు
ముంబై: తీవ్ర రుణ భారంలో కూరుకుపోయి చెల్లింపుల్లో వైఫల్యం చెందిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ సంస్థను ఒడ్డున పడేయడం, నిధుల సాయం ప్రణాళికలపై ప్రధాన వాటాదారులతో ఆర్‌బీఐ చర్చించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వాటాదారులైన ఎల్‌ఐసీ, జపాన్‌కు చెందిన ఓరిక్స్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎన్‌ విశ్వనాథన్, ఎంకే జైన్‌ శుక్రవారం భేటీ అయి చర్చించారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో ఎల్‌ఐసీకి 25.34 శాతం, ఓరిక్స్‌కు 23.54 శాతం వాటాలున్నాయి.

అయితే, చర్చల సారాంశం బయటకు రాలేదు. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, హెచ్‌డీఎఫ్‌సీ, సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐలకూ ఈ సంస్థలో వాటాలున్నాయి. తొలుత అందరు వాటాదారులను ఆర్‌బీఐ భేటీకి ఆహ్వానించగా, ఆ తర్వాత రెండు ప్రధాన వాటాదారులతోనే సమావేశాన్ని పరిమితం చేసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు రూ.91,000 కోట్ల రుణ భారాన్ని మోస్తోంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top