ఐసీఐసీఐ బ్యాంక్‌ : తెరపైకి వచ్చిన మరో వివాదం

ICICI Bank Changed Accounting Policy To Write Off NPAs In FY17: Report - Sakshi

ముంబై : వీడియోకాన్‌ రుణ కేసుతో ఇప్పటికే తీవ్ర చిక్కుల్లో పడిన ప్రైవేట్‌ రంగ దిగ్గజ బ్యాంక్‌ ఐసీఐసీఐ మరో వివాదంలో కూరుకుపోతోంది. వీడియోకాన్‌ రుణ కేసు వివాదంతో ఈ బ్యాంక్‌ సీఈవో చందాకొచ్చర్‌ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. తాజాగా రుణాల రైటాఫ్‌ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.5000 కోట్ల నుంచి రూ.5600 కోట్ల వరకు అనుమానస్పద కార్పొరేట్‌ రుణాలను రైటాఫ్‌ చేసినట్టు వెల్లడైంది. టెక్నికల్‌గా ఈ రైటాఫ్‌లు, అకౌంటింగ్‌ పాలసీని మారడం వల్లనే సాధ్యపడుతుందని మింట్‌ రిపోర్టు చేసింది. రుణాలను రైటాఫ్‌ చేసేందుకు అకౌంటింగ్‌ పాలసీని మారుస్తూ కొత్త అకౌంటింగ్‌ పాలసీని తీసుకొచ్చేందుకు బ్యాంక్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదించారని, అయితే ఆ విషయాన్ని బ్యాంక్‌ వాటాదారులకు, ప్రజలకు తెలుపలేదని మింట్‌ రిపోర్టు వెల్లడించింది. ఇది అకౌంటింగ్‌ స్టాండర్డ్‌(ఏఎస్‌) నిబంధనలకు తూట్లు పొడిచినట్టే అవుతుందని తెలిసింది. 

వీడియోకాన్‌ రుణ వివాద కేసులో సీఈవో చందా కొచర్‌పై జరుగుతున్న విచారణ నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఈవోపై విచారణతో పాటు బ్యాంక్‌ అంతకముందు జరిపిన డీలింగ్స్‌ను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ అకౌంటింగ్‌ పాలసీ మార్పు విషయం వెలుగులోకి వచ్చింది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో మొండిబకాయిల రేషియోను తక్కువగా చూపించేందుకు బ్యాంకు కొత్త అకౌంటింగ్‌ పాలసీని తీసుకొచ్చిందని ఆ న్యూస్‌పేపర్‌ వివరించింది. 2017 ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ)లు 7.89 శాతంగా ఉన్నాయి. ఒకవేళ కొత్త అకౌంటింగ్‌ పాలసీ తీసుకురాకపోతే, ఆ ఎన్‌పీఏలు 8.5 శాతానికి పైన ఉండేవని పేర్కొంది. 

అయితే ఏ లిస్టెడ్‌ కంపెనీ అయినా.. బ్యాంక్‌ అయినా.. తన అకౌంటింగ్‌ అకౌంటింగ్‌ స్టాండర్డ్‌(ఏఎస్‌) నిబంధనలను ఉల్లంఘించకుండా.. కచ్చితంగా అనుసరించాల్సి ఉంటుందని ఓ సీనియర్‌ రెగ్యులేటరీ అధికారి చెప్పారు. అకౌంటింగ్‌ పాలసీలో ఏదైనా మార్పులు చేపట్టాల్సి వస్తే, కచ్చితంగా ప్రజలకు, వాటాదారులకు ఈ నిర్ణయాన్ని తెలుపాల్సి ఉంటుందని తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాక్లో పెట్టుబడి పెట్టాలన్నా, డిస్‌ఇన్వెస్టింగ్‌ చేయాలన్నా ప్రజలకు, వాటాదారులకు తెలుపాల్సిన బాధ్యత బ్యాంక్‌ బోర్డుపై ఉందన్నారు. కానీ ఐసీఐసీఐ బ్యాంక్‌ 2017 ఏప్రిల్‌ 7న ఆమోదించిన కొత్త అకౌంటింగ్‌ పాలసీపై ఎవరికి తెలుపలేదని వెల్లడించారు. అయితే అకౌంటింగ్‌ పాలసీ మార్చిన విషయాన్ని తెలుపకుండా.. చందా కొచ్చర్‌ కేవలం రైటాఫ్‌ విషయాన్ని మాత్రమే 2017 ఏప్రిల్‌ 7న జరిగిన బోర్డు మీటింగ్‌ నోట్‌లో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top