
ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ ల పరిస్థితి ఏంటి?
భారత్ ఈ-కామర్స్ బిజినెస్ ను ఓ ఊపు ఊపిన ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లకు కాలం కలిసి రావట్లేదు. ఆ కంపెనీలకు పెట్టుబడుల రాక తగ్గింది.
బెంగళూరు: భారత్ ఈ-కామర్స్ బిజినెస్‌ను ఓ ఊపు ఊపిన ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్‌లకు ఈమధ్య కాలం కలిసి రావట్లేదు. ఆ కంపెనీలకు పెట్టుబడుల రాక తగ్గింది. ఫండ్స్ కోసం ఎంతమంది పెట్టుబడిదారులను కలిసినా అనుకున్నంత పెట్టుబడులు రావట్లేదని కంపెనీలు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. 15 బిలియన్ డాలర్ల కోసం ఆరునెలల కాలంలో ఫ్లిప్ కార్ట్ దాదాపు 15 మందికి పైగా పెట్టుబడిదారులతో మంతనాలు జరిపింది. కానీ ఎవరి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది.
ఇక స్నాప్ డీల్ పరిస్థితి కూడా ఇదేనట. అలీబాబా గ్రూప్, ఫాక్స్ కాన్, అంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డులను ఫ్లిప్ కార్ట్ కలిసి, పెట్టుబడుల కోసం అభ్యర్థించింది. కానీ వారెవరూ పెట్టుబడి పెట్టడానికి సమ్మతంగా లేమన్నట్టు తెలిసింది. 2014 మొదలు నుంచి 2015 మధ్య వరకూ ఫ్లిప్ కార్ట్ కొత్త పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ కొత్త పెట్టుబడు విషయంలో అంచనాలను ఆ కంపెనీ అందుకోలేకపోయింది.
టైగర్ గ్లోబల్, ఖతర్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ, పాత పెట్టుబడిదారుల నుంచి జూలైలో కేవలం 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులను మాత్రమే కంపెనీ రాబట్టుకోగలిగింది. కొత్త పెట్టుబడులు పెంచుకోవడానికి ఈ సంస్థలు తెగ తాపత్రయం పడుతున్నాయి. స్నాప్ డీల్ సహ వ్యవస్థపకులు కునాల్ బాల్, రోహిత్ బన్సల్ శాన్ ప్రాన్సిస్కోలో కొత్త పెట్టుబడిదారులతో సమావేశాలు జరిపినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ కంపెనీలు పెట్టుబడులు రాబట్టుకోవడానికి పడుతున్న ఇబ్బందులు మార్కెట్లో వాటి అంచనాలను తగ్గిస్తాయని నిపుణులంటున్నారు.
అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ పోటీని తట్టుకొని, వాటి బిజినెస్ ను పెంచుకోవాలంటే కచ్చితంగా ఈ రెండు సంస్థలు కొత్త పెట్టుబడులను రాబట్టుకోక తప్పదు. అమెజాన్ మార్కెట్లో తనకున్న క్రేజ్ తో తెగ ఇన్వెస్ట్ మెంట్లను రాబట్టుకుంటోంది. తనకున్న అధీకృత మూలధనం రూ.16 వేల కోట్ల కంటే రెండింతల మూలధనాన్ని ఆ కంపెనీ కలిగి ఉంది.
ఈ-కామర్స్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలపై కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు కూడా ఈ స్టార్టప్ కంపెనీలకు అడ్డంకిగా మారాయి. ఈ నిబంధనలపై ఈ సంస్థలకు అవగాహన తక్కువగా ఉండటంతో ఇబ్బందులకు గురవుతున్నాయి. ఆన్ లైన్ రిటైల్ లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ మార్చి 29న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటివరకూ ఈ కంపెనీలు అధికంగా ఆపర్ చేస్తున్న డిస్కౌంట్లను ప్రభుత్వ నిబంధనలతో తగ్గించడంతో, వినియోగదారులను ఆకట్టుకోలేక ఈ దీపావళి సీజన్‌లో తక్కువ అమ్మకాలను నమోదు చేశాయి. గత నవంబర్‌తో పోలిస్తే ఈ మార్చిలో కంపెనీల ఆదాయాలు కూడా పడిపోయాయి.