మరో మెగా బ్యాంకు

Govt proposes to merge Dena Bank, Vijaya Bank and Bank of Baroda - Sakshi

మూడు ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి లైన్‌ క్లియర్‌...

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలోకి దేనా, విజయా బ్యాంకు

ఆరు నెలల్లోగా ప్రక్రియ పూర్తవుతుందని అంచనా

దేశంలో మూడో అతి పెద్ద బ్యాంకుగా ఆవిర్భావం..

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బాటలోనే మరో మెగా బ్యాంకు ఏర్పాటుకు కేంద్రం తెరతీసింది. రుణ వృద్ధి, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే దిశగా మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు..బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ), విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లను విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో.. మొత్తం రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంక్‌ ఏర్పాటు కానుంది.  ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం ఈ విషయం ప్రకటించారు. ఈ విలీనంతో బ్యాంకులు మరింత పటిష్టంగా మారడంతో పాటు రుణ వితరణ సామర్థ్యాన్ని కూడా పెంచుకోగలవని చెప్పారు. పెరుగుతున్న మొండిబాకీలతో చాలా బ్యాంకులు దుర్బలంగా మారాయని జైట్లీ చెప్పారు.

‘‘బ్యాంకుల రుణ వితరణ కార్యకలాపాలు బలహీనపడ్డాయి. దీంతో కార్పొరేట్‌ పెట్టుబడులు కూడా దెబ్బతింటున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మూడు బ్యాంకుల విలీనంతో ఏర్పడే సంస్థతో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు పుంజుకునే అవకాశాలుంటాయి’’ అని ఆయన వివరించారు. నాలుగు నుంచి ఆరు నెలల్లోగా విలీన ప్రక్రియ పూర్తి కావొచ్చని బీవోబీ సీఈవో పీఎస్‌ జయకుమార్‌ అభిప్రాయపడ్డారు. అయిదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా విలీనం చేసుకుని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ప్రపంచంలోనే టాప్‌ 50 బ్యాంకుల్లో ఒకటిగా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.  

బ్యాంకింగ్‌ వ్యవస్థను పటిష్టపర్చేందుకే..
బ్యాంకింగ్‌ వ్యవస్థను పటిష్టపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యల అధ్యయనానికి జైట్లీ సారథ్యంలో ఏర్పాటైన ప్రత్యామ్నాయ యంత్రాంగం ఈ మేరకు సిఫార్సు చేసింది. విలీన ప్రతిపాదనను పరిశీలించాలంటూ మూడు బ్యాంకుల బోర్డులకు సూచించినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ‘ఆయా బ్యాంకులు నిర్వహణ సామర్థ్యాన్ని, కస్టమర్‌ సేవలను మెరుగుపర్చుకోవడానికి ఈ విలీనం తోడ్పడుతుంది. విలీన సంస్థ దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంకుగా ఆవిర్భవిస్తుంది.

నెట్‌వర్క్, చౌక డిపాజిట్లు, అనుబంధ సంస్థల పరంగా ఈ మూడింటికి సానుకూలాంశాలు ఉన్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలు, బ్రాండ్‌ ఈక్విటీకి పరిరక్షణ ఉంటుంది’’ అని కుమార్‌ వివరించారు. విలీన సంస్థకు ప్రభుత్వం నుంచి మూలధనపరమైన మద్దతు కొనసాగుతుందని ఆయన చెప్పారు. విలీనానంతరం కూడా మూడు బ్యాంకులు స్వతంత్రంగానే కొనసాగుతాయన్నారు. ‘విలీన ప్రక్రియ పూర్తి కావడానికి ఎన్నాళ్లు పడుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం. కానీ గత విధానాలను, అనుభవాలను బట్టి చూస్తే.. 4–6 నెలలు పట్టొచ్చు. పరిస్థితిని బట్టి మరింత వేగంగా కూడా పూర్తి కావొచ్చు‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.

5.71 శాతం ఎన్‌పీఏలు..
మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ప్రస్తుతం రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) ఎదుర్కొంటున్న బ్యాంకుల్లో దేనా బ్యాంక్‌ కూడా ఉంది. దీంతో దేనా రుణ కార్యకలాపాలపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ప్రకటించిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విజయ బ్యాంకు కూడా ఒకటి కావడం గమనార్హం. విలీన బ్యాంకు నికర మొండిబాకీలు 5.71 శాతం మేర ఉండనున్నాయి. క్యాపిటల్‌ అడెక్వసీ నిష్పత్తి 12.25 శాతంగాను, టియర్‌1 క్యాపిటల్‌ 9.32 శాతంగాను ఉంటుంది. విలీన బ్యాంకుకు మొత్తం 9,500 శాఖలుంటాయి.  

’మొండి’ పీఎస్‌బీలు ..
దేశీయంగా 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) ఉండగా.. వీటిలో ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉంది. ఇక దేశీ బ్యాంకింగ్‌ రంగంలో మూడింట రెండొంతుల వాటా పీఎస్‌బీలదే ఉంటోంది. అలాగే, బ్యాంకింగ్‌ రంగాన్ని పట్టి పీడిస్తున్న మొండిబాకీల్లో కూడా వీటి వాటా భారీగా ఉంది. దీంతో అంతర్జాతీయ బ్యాంకింగ్‌ ప్రమాణాలను అందుకునేందుకు వచ్చే రెండేళ్లలో ఈ బ్యాంకులు కోట్ల కొద్దీ మూలధనాన్ని సమకూర్చుకోవాల్సి వస్తోంది.

పురోగామి చర్య: ఫిక్కీ
మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పురోగామి చర్యగా పరిశ్రమవర్గాలు అభివర్ణించాయి. బ్యాంకింగ్‌ రంగాన్ని పటిష్టం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనంగా ఉంటుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్‌ రశేష్‌ షా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటానికి.. పటిష్టమైన బ్యాంకింగ్‌ రంగం అత్యంత అవసరమని, ఈ దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top