
సాక్షి, ముంబై: పసిడి పరుగుకు కళ్లెం పడింది. రికార్డు గరిష్టాలను నమోదు చేసిన బంగారం ధర భారీగా దిగి వచ్చింది. దేశీయంగా పుత్తడి ధరలు క్షీణించాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం ఒక్క రోజులోనే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,490 తగ్గుదలతో రూ.37,000కు పతనమైంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 తగ్గుదలతో రూ.35,760కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ రికార్డుస్థాయిల వద్ద ఇన్వెస్టర్ల అమ్మకాలు, జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌వార్‌పై అంచనాలతో ఆసియా కరెన్సీలు బలపడ్డాయి. చైనా ఉత్పత్తుల దిగుమతులపై 10శాతం దిగుమతి సుంకం అమలును డిసెంబర్‌కు వాయిదా వేసింది ట్రంప్ సర్కార్. దీంతో దేశీయ కరెన్సీ రూపాయి, ఈక్విటీ మార్కెట్లు బుధవారం భారీగా పుంజుకున్నాయి.
గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.29 శాతం పెరుగుదలతో 1,532.15 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 17.32 డాలర్లకు ఎగసింది. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.47,265 వద్ద నిలకడగా కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 క్షీణించి రూ.37,700 వద్ద ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 తగ్గి రూ.36,500 వద్ద ఉంది. ఇక కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.47,265 వద్ద కొనసాగుతోంది.