పుత్తడి ఇంకా దిగి వస్తుందా?

Gold extends fall as safe-haven buying slows - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రపంచవ్యాప్తంగా  ట్రేడ్‌వార్‌  వివాదాలు పెరుగుతుండటం బంగారం ధరలపై ప్రతికూల ప్రభావాన్ని పడవేస్తున్నాయి. అలాగే వివిధ కరెన్సీలతో డాలరు పుంజుకోవడంతో పసిడి ధరలు బలహీన పడుతున్నాయి.  తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఆరు నెలల కనిష్టానికి చేరాయి. ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 3 డాలర్లు(0.2 శాతం) క్షీణించింది. ఆగస్ట్‌ డెలివరీ 1257 డాలర్లుగా నమోదైంది.. స్పాట్‌ ధర అయితే 0.3 శాతం(4 డాలర్లు) వెనకడుగుతో 1255 డాలర్లకు చేరింది. 2017 డిసెంబర్‌ తరువాత ఇవి కనిష్ట ధరలుకాగా.. వెండి ఔన్స్‌ 0.3 శాతం నీరసించి 16.30 డాలర్లను తాకింది.  సింగపూర్‌లో లో ఔన్స్  వెండి ధర 0.49 శాతం  తగ్గి  16.19 డాలర్లకు చేరుకుంది.

అయితే దేశీయంగా డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతుండటంతో ఈ ప్రభావం కొంతమేర మాత్రమే కనిపిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు ద్వారా వడ్డీ రేట్లు పెరగడం, మరింత వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతోకు తోడు  దేశీయంగా నగల, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గిందని ట్రేడర్లు  విశ్లేషించారు.  అయితే రూపాయి, ఈక్విటీ మార్కెట్ల బలహీనత నేపథ్యంలో పుత్తడి ధరలు ఈ స్థాయిలో  నిలదొక్కుకునే  అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్వెస్టర్ల పెట్టుబడులు  పసిడివైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు.

దేశ రాజధానిలో, 99.9, 99.5 శాతం స్వచ్చత బంగారం 10 గ్రాముల విలువ 120 రూపాయలు క్షీణించి   వరుసగా రూ .31,570, రూ. 31,420,  వద్ద ఉంది.  పారిశ్రామిక యూనిట్లు, నాణెల తయారీదారులనుంచి డిమాండ్‌ తగ్గిన  కారణంగా సిల్వర్  కిలోకు 200పైగా  క్షీణించి రూ. 41వేల దిగువకు చేరింది  అటు ఎంసీఎక్స్‌ మార్కెట్లో పుత్తడి ధరలు ఫ్లాట్‌గా ఆరంభమైనా క్రమంగా  పుంజుకున్నాయి.  పది గ్రా.114 రూపాయలు ఎగిసిన బంగారం ధర 30,668 వద్ద ఉంది. .మరోవైపు ఈక్విటీ మార్కెట్లు  భారీ నష్టాలతో ముగిశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top