జీడీపీ వృద్ధి 5 శాతం లోపే!

GDP growth under 5 percent - Sakshi

క్యూ1 (ఏప్రిల్‌–జూన్‌) వృద్ధి రేటు 5 శాతం 

క్యూ2 (జూలై–సెప్టెంబర్‌) వృద్ధి రేటు 4.5 శాతం 

క్యూ3, క్యూ4 గణాంకాలు రావాల్సి ఉంది  

2019–20 ఏడాదికి గణాంకాల కార్యాలయం తొలి ముందస్తు అంచనాలు

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు  ప్రస్తుత ఆర్థిక  సంవత్సరంలో (2019 ఏప్రిల్‌ 2020 మార్చి మధ్య) 5 శాతం దిగువనే నమోదవుతుందని స్వయంగా ప్రభుత్వ అంచనాలే పేర్కొంటున్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) మంగళవారం జాతీయ ఆదాయ తొలి ముందస్తు అంచనాలను వెలువరించింది. జీడీపీ వృద్ధి 2019–20లో 5 నుంచి 4.5 శ్రేణిలోనే ఉంటుందని ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక, బ్యాంకింగ్, రేటింగ్‌ దిగ్గజ సంస్థలు అంచనావేశాయి. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతం.  

జీడీపీ వృద్ధిరేటు 5 శాతం దిగువకు పడిపోతే అది 11 సంవత్సరాల కనిష్టస్థాయి అవుతుంది. ఎన్‌ఎస్‌ఓ తాజా విశ్లేషణ ప్రకారం, 2019–20లో తయారీ రంగం భారీగా దెబ్బతిననుంది. 2018–19లో 6.2 శాతంగా ఉన్న ఈ రంగం వృద్ధిరేటు 2019–20లో 2 శాతానికి పడిపోతుందని ఎన్‌ఎస్‌ఓ అంచనావేసింది. అలాగే వ్యవసాయం, నిర్మాణ, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వంటి రంగాలు కూడా ప్రతికూల ఫలితాలను నమోదుచేసే అవకాశం ఉందని వివరించింది. అయితే మైనింగ్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, రక్షణ వంటి రంగాల్లో కొంత సానుకూలత ఉండొచ్చని ఎన్‌ఎస్‌ఓ అంచనావేసింది.  

ఆర్‌బీఐ అంచనాలకన్నా తక్కువ! ..: తాజా స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ గత నెల్లో  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) జీడీపీ వృద్ధి అంచనాలను ఏకంగా 5 శాతానికి తగ్గించేసింది. అక్టోబర్‌ నాటి సమీక్షలో వృద్ధి అంచనా 6.1 శాతం. ఇప్పుడు 5 శాతం కన్నా లోపే వృద్ధి రేటు ఉంటుందని ఎన్‌ఎస్‌ఓ అంచనావేస్తుండడం గమనార్హం. 2018–19 మొదటి త్రైమాసికంలో 8 శాతం వృద్ధి రేటు నుంచీ చూస్తే,  వరుసగా ఆరు త్రైమాసికాల నుంచీ భారత్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. అంటే ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది.  2012 తరువాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) కేవలం 4.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. గడచిన ఆరు సంవత్సరాల్లో వృద్ధి వేగం ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2012–13 జనవరి–మార్చి త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది.

చమురు ధరల మంటతో ఇబ్బందే: డీబీఎస్‌ 
ముడి చమురు ధరలు తీవ్రంగా ఉంటే, అది భారత్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని సింగపూర్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌– డీబీఎస్‌ అంచనా వేస్తోంది. ముఖ్యంగా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం– కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌)పై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇప్పటికే రూపాయి రెండు నెలల గరిష్టం... 72 స్థాయికి పడిపోయిన  విషయాన్ని గుర్తుచేసింది.

తలసరి ఆదాయ వృద్ధి 6.8 శాతం 
భారత్‌ నెలవారీ తలసరి ఆదాయం 2019–20లో 6.8 శాతం పెరిగి రూ.11,254కు చేరుతున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ అంచనావేసింది. 2018–19లో తలసరి ఆదాయం రూ.10,534. వార్షికంగా చూస్తే, తలసరి ఆదాయం 6.8 శాతం వృద్ధితో రూ. 1,26,406 నుంచి రూ.1,35,050కి పెరుగుతుంది. కాగా వృద్ధిరేటు 10% (2018–19) నుంచి 6.8 శాతానికి పడిపోతుండడం గమనార్హం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top