గెయిల్‌ చరిత్రాత్మక లాభం 

Gail India Reports Highest Ever Net Profit And Dishes Out Bonus - Sakshi

ఒక షేరుకు మరో షేరు బోనస్‌ 

రూ.1.75 చొప్పున తుది డివిడెండ్‌ 

విస్తరణపై రూ.54,000 కోట్ల వ్యయ ప్రణాళిక 

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ గెయిల్‌ మార్చి త్రైమాసికంలో రూ.1,122 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న లాభంతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. ఆదాయం సైతం రూ.15,430 కోట్ల నుంచి రూ.18,764 కోట్లకు వృద్ధి చెందింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.74,808 కోట్ల ఆదాయం (39 శాతం అధికం)పై రూ.6,026 కోట్ల లాభాన్ని (30 శాతం వృద్ధి) నమోదు చేసింది. వాటాదారుల వద్దనున్న ప్రతీ షేరుకు మరొక షేరును బోనస్‌గా ఇవ్వాలని, అలాగే, ప్రతీ షేరుకు రూ.1.77చొప్పున తుది డివిడెండ్‌ ఇచ్చేందుకు బోర్డు సిఫారసు చేసింది. 2018–19లో రికార్డు స్థాయిలో ఇంతకుముందు ఎన్నడూ లేని స్థాయిలో రూ.8,344 కోట్లను విస్తరణపై ఖర్చు చేశామని, వచ్చే 2–3 ఏళ్లలో మరో రూ.54,000 కోట్లను గ్యాస్‌ పైపులైన్ల ఏర్పాటుపై ఖర్చు చేయనున్నట్టు గెయిల్‌ చైర్మన్, ఎండీ బీసీ త్రిపాఠి తెలిపారు.

గెయిల్‌కు దేశవ్యాప్తంగా 14,000 కిలోమీటర్ల పొడవు పైపులైన్‌ మార్గాలు ఉన్నాయి. కొత్తగా రూ.32,000 కోట్లతో 6,000 కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మిస్తోంది. దీంతో తూర్పు, దక్షిణ భారత్‌లో అనుసంధానం లేని ప్రాంతాలకు చేరుకోగలదు. అలాగే, వారణాసి, పాట్నా పట్టణాలకు పైపు ఆధారిత సహజవాయువు సరఫరా చేసేందుకు గాను రూ.12,000 కోట్లతో పంపిణీ నెట్‌వర్క్‌ను కూడా నిర్మిస్తోంది. మరో రూ.10,000 కోట్లను పెట్రోకెమికల్స్‌ వ్యాపార విస్తరణపై వెచ్చించనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top