ఈక్విటీ ఫండ్స్‌లోకి తగ్గిన పెట్టుబడులు | Sakshi
Sakshi News home page

ఈక్విటీ ఫండ్స్‌లోకి తగ్గిన పెట్టుబడులు

Published Tue, Dec 10 2019 5:38 AM

equity investors should play the falling GDP scenario - Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక ఈ ఏడాది నవంబర్‌ మాసంలో గణనీయంగా తగ్గిపోయింది. నికరంగా రూ.933 కోట్లు మాత్రమే ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చినట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ ‘యాంఫి’ తెలియజేసింది. నెలవారీగా చూసుకుంటే ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక 85 శాతం మేర తగ్గిపోయింది. 2016 జూన్‌ తర్వాత ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం వరుసగా మూడో నెలలోనూ తగ్గినట్టయింది.

ఏవో కొన్ని ఎంపిక చేసిన స్టాక్స్‌ మినహా మిగిలిన స్టాక్స్‌ పనితీరు గత ఏడాది కాలంలో ఆశాజనకంగా లేకపోవడం ఫండ్స్‌ రాబడులపై ప్రభావం చూపించింది. ఇది పెట్టుబడులపైనా ప్రతిఫలించింది. మరోవైపు క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ నుంచి పెట్టుబడులు గణనీయంగా బయటకు వెళ్లిపోతున్నాయి. గత నెల చివరి నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు రూ.27.04 లక్షల కోట్లకు పెరిగాయి. అక్టోబర్‌ చివరికి ఉన్న రూ.26.33 లక్షల కోట్లతో పోల్చుకుంటే 3 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం మీద ఫండ్స్‌ పథకాల్లోకి అక్టోబర్‌లో రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే, అది నవంబర్‌లో రూ.54,419 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా డెట్‌ ఫండ్స్‌లోకి రూ.51,000 కోట్ల పెట్టుబడులు రావడం వృద్ధికి దోహదపడింది.  

‘క్రెడిట్‌ రిస్క్‌’ సంక్షోభం!  
దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో మొత్తం 44 సంస్థలు (ఏఎంసీలు) కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటి పరిధిలోని క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ నుంచి నవంబర్‌లో నికరంగా రూ.1,899 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారు. అంతక్రితం మాసం నాటి గణాంకాలతో పోలిస్తే పెట్టుబడుల ఉపసంహరణ 37.4 శాతం పెరిగింది. గతేడాది జూలై నుంచి క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌కు అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం, ఆ తర్వాత డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తదితర సంస్థలు రుణ పత్రాలపై చెల్లింపుల్లో విఫలం కావడం, వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసిన క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ రాబడులు దెబ్బతినడం ఈ పరిణామాలకు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నాటికి క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ నిర్వహణలో రూ.79,643 కోట్ల పెట్టుబడులు ఉండగా, నవంబర్‌ చివరికి అవి రూ.63,754 కోట్లకు తగ్గాయి. ఇది 20% క్షీణత.

లిక్విడ్‌ ఫండ్స్‌కూ నిరాదరణ...
డెట్‌ విభాగంలో లిక్విడ్‌ ఫండ్స్‌కూ నిరాదరణ ఎదురైంది. అక్టోబర్లో లిక్విడ్‌ ఫండ్స్‌ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు రూ.93,203 కోట్లుగా ఉంటే, నవంబర్‌లో రూ.6,938 కోట్లకు తగ్గిపోయాయి. ఎగ్జిట్‌ లోడ్‌ విధించడం వల్ల కొందరు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఓవర్‌నైట్‌ ఫండ్స్‌కు మళ్లించి ఉంటారని యాంఫి సీఈవో వెంకటేశ్‌ అభిప్రాయపడ్డారు.

ఇతర ఫండ్స్‌లోకి...  
► ఈక్విటీ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) పథకాల్లోకి నవంబర్‌లో నికరంగా రూ.2,954 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం అక్టోబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.5,906 కోట్లతో పోలిస్తే సగం మేర తగ్గాయి.
► ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకాల్లోకి రూ.1,312 కోట్ల పెట్టుబడులు రాగా, రూ.379 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. దీంతో నికర పెట్టుబడులు రూ.933 కోట్లుగా నమోదయ్యాయి.  
► డెట్‌ విభాగంలో ఓవర్‌నైట్‌ ఫండ్స్‌ (ఒక్క రోజు కాల వ్యవధి సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసేవి)లోకి రూ.20,650 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లిక్విడ్‌ ఫండ్స్‌కు ఎగ్జిట్‌ లోడ్‌ విధించడం వీటికి కలిసొచ్చింది.
► బ్యాంకింగ్‌–పీఎస్‌యూ ఫండ్స్‌లోకి  7,230 కోట్లు వచ్చాయి.  
► గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా రూ.7 కోట్లు వచ్చాయి. అంతక్రితం నెలలో  రూ.31.45 కోట్లు బయటకు వెళ్లిపోయాయి.


లాభాల స్వీకరణే..
ఈక్విటీ పథకాల్లో నికర పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గడానికి ఒకింత ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే కారణం. అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణ ఆస్తులు మాత్రం మొత్తం మీద రూ.27 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి దీర్ఘకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన సిప్‌ పెట్టుబడులు క్రమంగా వృద్ధి చెందుతూ నూతన గరిష్ట స్థాయి రూ.3.12 లక్షల కోట్లకు చేరాయి.

– ఎన్‌ఎస్‌ వెంకటేశ్, యాంఫి సీఈవో

Advertisement
Advertisement