
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి దేశ రక్షణ పరిశోధన సంస్థ డీఆర్‌డీవో మరో కీలక ఉత్పత్తులను తీసుకొచ్చింది. ఆటోమేటిక్ మిస్ట్-బేస్డ్ శానిటైజర్ డిస్పెన్సింగ్ యూనిట్‌తో సహా మరో రెండు ఉత్పత్తులను అభివృద్ధి చేసిందని అధికారులు శుక్రవారం తెలిపారు. ముఖ్యంగా అతినీలలోహిత సి లైట్-బేస్డ్ శానిటైజేషన్ బాక్స్, చేతితో తాకే అవసరం లేకుండానే ఉపయోగించే యూవీసీ శానిటైజర్ క్యాబినెట్‌ను అభివృద్ధి చేసింది.
ఢిల్లీలోని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ ప్లోజివ్ అండ్ ఎన్విరాన్ మెంట్ సేఫ్టీ సంస్థ అనుసంధానంతో అల్ట్రాసోనిక్ సెన్సార్ ద్వారా పనిచేసే ఆటోమేటిక్ మిస్ట్-బేస్డ్ శానిటైజర్ డిస్పెన్సింగ్ యూనిట్‌ను అభివృద్ధి చేసింది. దీంతోపాటు ఢిల్లీలోని డిఫెన్స్ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (డిపాస్) ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ తో కలిసి అతినీలలోహిత సి లైట్-బేస్డ్ శానిటైజేషన్ బాక్స్ యూవీ-సీ(254 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో అతినీలలోహిత కాంతి రూపొందించాయి.తద్వారా రసాయనాలను ఉపయోగించి శుభ్రపరచలేని ఏ వస్తువునైనా శుభ్రపరచడానికి ఇది ఉపయోగ పడుతుంది. చెక్కులు, పాస్‌బుక్‌లు, పేపర్ కవర్లులాంటి రోజవారీ వినియోగించే వస్తువుల నుంచి కరోనా వ్యాపించకుండా నిరోధించవచ్చు. ఈ కిరణాలు కరోనా వైరస్ లోనిని జన్యు పదార్ధాలను నాశనం చేయడంలో, పునరుత్పత్తిని నిరోధిచండంలో చాలా బాగా పనిచేస్తాయిని డీఆర్‌డీవో ఒక ప్రకటనలో తెలిపింది.
డీఆర్‌డీవో డైరెక్టర్ బిహెచ్‌ఎస్‌వి నారాయణ మూర్తి నేతృత్వంలోని సిఎన్‌టి అత్యుత్తమ శాస్త్రవేత్త సౌరభ్ కుమార్, ఎస్. గోపీనాథ్ కేవలం రెండు వారాల రికార్డు సమయంలో రూపొందించచారు. అతినీలలోహిత (యూవీసి) కిరణాలు క్రిమిసంహారక ప్రభావాన్నికలిగి ఉన్నట్లు కనుగొన్నామని చెప్పారు. మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, ల్యాప్‌టాప్, కరెన్సీ నోట్స్ వంటివాటితో పాటు, కరెన్సీ నోట్లు, పాస్‌బుక్‌లు, ఇతర ముఖ్యమైన పత్రాలను శుభ్రపరిచే క్రమంలో బ్యాంకర్లకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. ఆసుపత్రులు, మాల్స్, కార్యాలయ భవనాలు, నివాస భవనాలు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ఇతర క్లిష్టమైన ప్రదేశాలకు వెళ్లినపుడు చేతుల శానిటైజేషన్ కోసం దీనిని ఉపయోగించవచ్చు. ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాల దగ్గర కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
కోవిడ్-19 తో పోరాడుతున్న వైద్య సిబ్బందికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని డీఆర్‌డీవో శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. అలాగే ఎన్-95 మాస్క్‌లు పునర్వినియోగతనుకూడా పెంచుతుందనీ తెలిపింది. అంతేకాదు శానిటైజర్ బాక్స్ ద్వారా కనీస వృధాతో చేతులను శుభ్రపరుచుకోవచ్చని చెప్పింది. ఒకసారికి 12 సెకన్ల పాటు 5-6 మి.లీ శానిటైజర్ మాత్రమే విడుదల అవుతుందని వెల్లడించింది. దీని సామర్థ్యాన్ని అంచనా వేయడానికి హైదరాబాద్ లోని ఎర్రగడ్డలోని ఇఎస్ఐసికి అప్పగించామన్నారు.