డేటా పరిరక్షణ కోసమే ఆధార్‌ చట్టం

డేటా పరిరక్షణ కోసమే ఆధార్‌ చట్టం - Sakshi


ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: రాజ్యాంగ బద్దతకు సంబంధించిన పరీక్ష ముందు ఆధార్‌ చట్టం నిలబడుతుందన్న ఆశాభావాన్ని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వ్యక్తం చేశారు. డేటా పరిరక్షణ విషయంలో తగిన భద్రతను చట్టం కల్పిస్తుందని ఆయన వివరించారు. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ (అందరికీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం)పై ఐక్యరాజ్యసమితి ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.  పాన్‌కు అనుసంధానంసహా వివిధ ప్రభుత్వ పథకాలకు బయోమెట్రిక్‌ గుర్తింపు సంఖ్య, ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేయడంపై రాజ్యాంగబద్దతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నవంబర్‌లో విచారించనున్న నేపథ్యంలో జైట్లీ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.



గోప్యత పరిరక్షణే చట్టం లక్ష్యం...

 ‘‘ఆధార్‌ ఆలోచనను తీసుకువచ్చింది గత యూపీఏ ప్రభుత్వం.  అయితే డేటాసహా ఇందుకు సంబంధించి ఎటువంటి చట్టబద్దతనూ గత ప్రభుత్వం కల్పించలేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ దానికి ఒక చట్టబద్దతను ఇచ్చింది. ప్రత్యేకించి డేటా పరిరక్షణ, గోప్యతల విషయంలో ఇనుప గోడను నిర్మించడమే దీని లక్ష్యం’’ అని జైట్లీ ఈ సందర్భంగా అన్నారు.  ఇందుకు సంబంధించి ఆమోదం పొందిన చట్టం రాజ్యాంగబద్ద పరీక్షకు నిలబడుతుందన్న విశ్వాసం తనకుందని జైట్లీ అన్నారు.



సంస్కరణలతోనే డేటా మోసాలకు చెక్‌: ఐరాస

కాగా డేటాను దుర్వినియోగం చేసే స్వార్ధ శక్తుల చేతుల్లో ప్రజలు మోసపోకుండా కాపాడేందుకు భారత్‌ నియంత్రణసంస్థలపరమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారత్‌లో ఐక్యరాజ్యసమితి రెసిడెంట్‌ కోఆర్డినేటర్‌ యూరి అఫానసీవ్‌  ఈ కార్యక్రమంలో చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top