2016లోనే బ్యాంకులకు ఆర్‌బీఐ వార్నింగ్‌

2016 RBI Note Had Warned Banks About Tech Misused In Nirav Modi Fraud - Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన లోపం స్విఫ్ట్‌ సిస్టమ్‌. ఈ సిస్టమ్‌ ద్వారానే వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ రూ.11,400 కోట్ల స్కాంకు పాల్పడ్డారు. అయితే ఎంతో జాగ్రత్తతో ఉండాల్సిన ఈ స్విఫ్ట్‌ సిస్టమ్‌పై బ్యాంకు అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వహించారంటే సమాధానమే ఉండదు. అయితే స్విఫ్ట్‌ ఇంటర్‌బ్యాంకు నెట్‌వర్క్‌లో లోపాలున్నాయని, వాటిని దుర్వినియోగ పరుస్తున్నట్టు పీఎన్‌బీ స్కాం బయటకి రాకముందు రెండేళ్ల క్రితమే రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా, బ్యాంకులకు హెచ్చరికలు జారీచేసింది. 

స్విఫ్ట్‌ ఇంటర్‌బ్యాంక్‌ నెట్‌వర్క్‌ ద్వారా నిధులను అనధికారికంగా బదిలీ చేస్తున్నారని సెంట్రల్‌ బ్యాంకు 2016 ఆగస్టులోనే వార్నింగ్‌ ఇచ్చింది. సైబర్‌ సెక్యురిటీ ఫ్రేమ్‌వర్క్‌ను బ్యాంకులు ఏర్పాటుచేయాలని ఆర్‌బీఐ సర్క్యూలర్‌ జారీచేసింది. కరెస్పాండెంట్‌ బ్యాంకులకు పంపించే పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కంట్రోల్స్‌ను బలోపేతం చేయాలని పేర్కొంది. హానికరమైన సాఫ్ట్‌వేర్‌ స్క్రిప్ట్‌/కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయో గుర్తించడం కోసం స్విఫ్ట్‌ ఇన్‌ఫ్రాక్ట్రక్చర్‌ను వెంటనే సమగ్రంగా ఆడిట్‌ చేయాలని సర్క్యూలర్‌లో తెలిపింది. ఏమైనా హానికరమైన వాటివి గుర్తిస్తే, వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. 

కానీ బ్యాంకులు మాత్రం ఈ హెచ్చరికలపై నిర్లక్ష్యం వహించాయి. ఈ నిర్లక్ష్యానికి ప్రతిఫలమే పీఎన్‌బీలో జరిగిన రూ.11,400 కోట్ల కుంభకోణం. నీరవ్‌ మోదీ, ముంబై బ్రాంచులోని ఇద్దరు బ్యాంకు అధికారులు కలిసి నకిలీ ఎల్‌ఓయూలతో విదేశీ బ్యాంకుల నుంచి రుణం పొందారు. ఈ ఎల్‌ఓయూలను పంపించడం, తెరవడం, మార్పులు చేయడం వంటి పనులన్నీ ఈ స్విఫ్ట్‌ సిస్టమ్‌ ద్వారానే జరుగుతాయి. ఈ సిస్టమ్ ద్వారా ఏదైనా బ్యాంకుకు సందేశం అందినప్పుడు, విదేశీ బ్యాంకు దీనిని అధికారికమైన, కచ్చితమైన సందేశంగా భావిస్తుంది. దీనిని అనుమానించదు. స్విఫ్ట్‌ సిస్టమ్‌ను ఉపయోగించుకుని, నకిలీ ఎల్‌ఓయూలతో నీరవ్‌మోదీ ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. పైగా పీఎన్‌బీ స్విఫ్ట్‌ సిస్టమ్‌, కోర్‌ బ్యాంకింగ్‌లో లింక్‌ అయి లేదు. దీంతో స్కాం గుర్తించడం చాలా కష్టతరమైంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top