వారఫలాలు (జులై 27 నుంచి ఆగస్ట్‌ 2 వరకు)

Weekly Varaphalalu in Telugu (27-07-2019) - Sakshi

రాశి ఫలాలు (సౌరమానం)

జన్మనక్షత్రం తెలియదా?నో ప్రాబ్లమ్‌!  మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (జులై 27 నుంచి ఆగస్ట్‌ 2 వరకు) మీ రాశి ఫలితాలు- డా‘‘ మైలవరపు శ్రీనివాసరావుజ్యోతిష్య పండితులు

మేషం(మార్చి 21 –ఏప్రిల్‌ 19)
జీవితంలో నిజంగా సాధించుకోవలసింది ఏదనే తీరు ఆలోచనలో పడి పడి– సంతానం భార్య/ భర్తతో కలిసి కలిసి మెలిసి ఉంటూ ఎక్కువసేపు వాళ్లతో గడుపుతూ ఆనందాన్ని పొందడమే– నిజంగా సాధించుకోవలసిన అంశమనే దృఢమైన భావానికి వచ్చేస్తారు. నిజంగా ఇది సంతోషించదగ్గ పరిణామం. ఆహ్వానించదగ్గ ఆశయం.
మనసులో దుఃఖం అంటూ కలిగితే వెంటనే దాన్ని మీరు మరొకరితో చెప్పేసుకునే మనస్తత్వం కలిగిన వారయ్యుంటే ఆ పనిని చెయ్యకండి.
ఎవరితో మీ బాధని చెప్పుకోవాలో అలా వాళ్లతో కాకుండా మరొకరికి గాని చెప్పుకున్నట్లయితే మీరు చెప్పిన ఆ మాటలు రెక్కలు కట్టుకుని మరికొన్ని సొంత ఈకల్ని తగిలించుకుని ఎవరికి చెప్పడం మంచిది కాదో వాళ్లకే చేరిపోయే ప్రమాదముంది. నియంత్రించుకోండి.
విదేశాలకి వెళ్లాలనే తాపత్రయం, విదేశీవస్తువుల్ని తెచ్చుకోవాలనే మోజు రోజు రోజుకీ పెరిగే అవకాశముంది. ఆలోచన రావడం మంచిదేనేమోగాని, దానివల్ల మీరు ఆర్జించగలిగేదేముందనే దృక్పథాన్ని అలవరచుకోండి.
ఇక్కడ సంసారం భార్యాభర్తల్ని వేరు చేసేదిగా ఔతుంది. అక్కడ మళ్లీ కొత్త పొయ్యిని పెట్టుకుని పదిమందితో పరిచయాలని చేసుకుంటూ ఉండడం... అంత అవసరమా?
చక్కగా సాగిపోతున్న గమ్యానికి దగ్గరగా ఉన్న రథాన్ని మరో వైపుకి మళ్లించడం ఎలా సరికాదో అలా ఇప్పుడు విదేశీ ప్రయాణం కేవలం ఉద్యోగ నిమిత్తం అంత అనవసరం. ఆలోచించుకోండి.

లౌకిక పరిహారం: సుఖంగా సాగుతున్న సంసారానికి విదేశీ ఆలోచన ప్రస్తుతానికి వద్దు.
అలౌకిక పరిహారం: మాస శివరాత్రి సందర్భంగా శివాలయంలో విభూతిని సమర్పించుకోండి.

వృషభం  (ఏప్రిల్‌ 20 –మే 20)
మీరనుకునే పని ఏదైనా సరే ఎంత కఠినమైనదైనా సరే సాధించుకోవాలనుకుంటే దానిక్కావలసిన ఉపాయం కేవలం నమ్రతతో ఉంటూ నిదానంగా మాట్లాడటం మాత్రమే. ఇలా కాకుండా నాది ధర్మమే అనే అభిప్రాయంతో ఉన్నదున్నట్టుగా గట్టి కంఠంతో గనుక మాట్లాడితే అనుకున్న పని కానే కాదు సరికదా... పని జరగలేదనే ఆందోళన మనసుకి కలుగుతుంది కూడా.
కుటుంబంలో ఉండే ఎవరో ఒకరి వ్యతిరేకత కారణంగా లేక ఆధిపత్యం కారణంగా చేయదలచిన ఓ శుభకార్యాన్ని ఎప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో అనే విషయం ఓ స్పష్టతకి రాకపోవచ్చు. ఆ విషయం మీద మరింత దృఢంగా బలంగా నిలబడి తేల్చాల్చిందే– అనుకోకండి. అలా చేసిన పక్షంలో వ్యక్తిగత వైరం పెరిగిపోయే అవకాశముంది.
ఓ విషయాన్ని గురించిన స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడ ఆ విషయం గురించి మాట్లాడండి తప్ప సగం సగం తెలిసి మాట్లాడడం సరికాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటుతనాన్ని చేష్టల్లోనూ సంభాషణల్లోనూ కలిగి ఉండడం సరికాదు. నిదానంగా ఉండడమే సరైనది. ఇలా నిదానాన్ని పాటించడమనేది అసమర్థతకి సాక్ష్యం అనుకోకండి. కార్యసాధనకి అనువైన మార్గమని భావించండి.
ఆరోగ్యం చెడిపోలేదు గాని, ఆహార విహారాలని సరిగా పాటిస్తూ అనారోగ్యం రాకుండా చేసుకోవడం ఎంతైనా అవసరం. శని 8వ ఇంట్లోనే ఇంకా ఉన్న కారణంగా చీకట్లో కనిపించని నల్లని దొంగలా ఎక్కడో ఓ చోట ఎప్పుడో ఒకప్పుడు మనకి మానసిక ఆందోళనకి పాల్పడేలా చేస్తాడు ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో.

లౌకిక పరిహారం: నిదానం ప్రధానం. కాఠిన్యం కార్యభంగానికి కారణం.
అలౌకిక పరిహారం: శివునికి బిల్వదళాలని ముంచిన జలంతో అభిషేకం చేసుకోండి.

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఒక త్రాసులో వస్తువుని తూచుతూ ఉంటే ఒకసారి ఇటువైపున్న పళ్లెం– మరోసారి అటువైపున్న పళ్లెం కిందికీ మీదికీ వెళ్తూ దిగుతూ బరువుని సరి చేస్తుంటే కొంతసేపటికి సమాన స్థాయికి వచ్చేటట్లుగా, మీ ఆలోచనలు కూడా ఇది సరికాదు... ఇదే సరి సుమా! అనే తీరుగా ఊహాపోహలతో సాగుతూ ఉంటాయి. చేస్తున్న వృత్తీ ఉద్యోగం నిర్వహిస్తున్న వ్యాపారమూ కూడా అసంతృప్తి ధోరణితోనే కనిపిస్తుంటాయి మీకు. జరగబోయే వ్యతిరేక ఫలితమంటూ ఏమీ ఉండదు గాని, ఆ భయం లేకుండా ఉండ(లే)కపోవచ్చు.
సంపాదన బాగానే ఉన్నప్పటికీ చేబదుళ్లు తీసుకోకుండా జరక్కపోవచ్చు. సాధారణంగా అప్పు చేయడమనే అలవాటుగాని తెరదీస్తే తప్పక మనకి అది ఓ అలవాటుగా– మాటల్లో అలా వచ్చేస్తుండే ఊతపదంలా అయిపోవచ్చు కాబట్టి రుణాన్ని తీసుకోవడమనే ఊహని పూర్తిగా తుడిచేసుకోండి మనసులో.
ఎంత అవసరమౌతుందో అంతకంటే ఓ రూపాయి ఎక్కువతోనే ప్రయాణించండి. అంగడికి వెళ్లబోతున్నా సరే ఇదే నియమాన్ని పాటించండి. ఓ చిన్న చేబదులు గురించి ఇంత చెప్పాలా? అనుకోవద్దు. పాటించండి ఈ నియమాన్ని. ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ముందు నాటికి అర్థమౌతుంది.
సంతానానికీ అలాగే మీకూ ఎందుకైనా ఎప్పుడైనా ప్రయోజనపడతారు గదా అనే ఆలోచనతో పెద్ద పెద్దల పరిచయాల కోసం తపన పడతారు. అలాంటి పెద్ద పెద్ద స్థాయివాళ్లు దాదాపుగా సముద్రాలలాంటివాళ్లే. వైశాల్యం లోతుదనం అన్నీ ఉన్నా ఒక్క చుక్క కూడా తాగవీల్లేనిది కదా సముద్రజలం! వాళ్లూ అంతే అనే నిశ్చయంతో ఉండండి. ఎక్కడో కోటికొకరుంటారు ఉత్తములు!

లౌకిక పరిహారం: రుణం గూర్చిన ఆలోచనని విరమించుకోండి.
అలౌకిక పరిహారం: నవధాన్య జలంతో శివుణ్ణి అభిషేకించండి.

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉందన్న సామెతలాగా ఆస్తీ అంతస్తూ బంధుబలం శారీరకమైన ఓపికా..
ఇలా అన్నీ మీ స్థాయికి తగ్గట్టే ఉన్నా సంతానం గూర్చిన ఓ చిన్న సమస్య మిమ్మల్ని సుఖంగా సంతోషంగా ఉండేలా సాగనియ్యదు.
ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా ఆ మనోవ్యధ మిమ్మల్ని ఓ ముల్లు గుచ్చుకుంటున్నట్లుగానే చేస్తుంటుంది. మరికొంతకాలం తప్పదు. వ్యతిరేకత ఉండదు గాని భరించక తప్పదు.
దాదాపుగా నిశ్చయం అయిపోయిందనుకున్న శుభకార్యం కొద్ది దూరంగా జరగడం కాని లేదా తాత్కాలికంగా ఆగిపోయినట్లుగా అన్పించడం గాని జరగచ్చు. దిగులు పడకండి. రవి కుజుల అననుకూలత కారణంగా సరైన  ఆలోచన తోచదు. మానసిక అసంతృప్తీ తప్పదు.
భార్యాభర్తల సయోధ్య అంతగా ఉండక ఓ చిన్న స్పర్థ( నేనే తెలివి కలవాణ్ణి/ దానిని) ఏర్పడి ఉండచ్చు. ఇద్దరిలో ఒకరి గొంతు పెద్దదై నలుగురిలో అప్రతిష్ఠని మిగిల్చేదిగా కూడా ఉండచ్చు.
కుటుంబపు పరువు కొంత కొంతగా దిగజారుతూ ఉండచ్చు కూడా. ప్రస్తుత దశ ప్రకారం చేయగలిగిందీ చేసుకోగలిగిందీ ఏమీ లేదు. మౌనంగా భరిస్తూ ఉండడమే.
మీ విషయంలో అపార్థ పడిన వాళ్లు క్రమక్రమంగా నిజాన్ని తెలుసుకుని మళ్లీ పూర్వం లాగా స్నేహభావంతో ఉండడానికి ప్రయత్నించవచ్చు. అప్పటిలాగా కాకుండా ఎంత దూరంలో వాళ్లని ఉంచాలో మీరు ఎంత దూరంలో ఉండాలో అలాగే ఉండండి.

లౌకిక పరిహారం: తాత్కాలికంగా మనో వ్యధ తప్పదనే అభిప్రాయంతో ఉండండి.
అలౌకిక పరిహారం: బంగారు వస్తువుని ముంచిన జలం(స్వర్ణజలం)తో శివాభిషేకం చేయండి.

సింహం(జూలై 23 –ఆగస్ట్‌ 22)
లోగడ ఎక్కడ దొరికితే అక్కడ ఋణాలు చేసేసి ఏదో వ్యాపారాన్ని ప్రారంభించి, తీసుకున్న అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక చిన్నచిన్న అప్రతిష్ఠాకర సంఘటనలని ఎదుర్కొన్నారో మళ్లీ అదే పరిస్థితికి వెళ్తున్నారేమో ఒంటరిగా కూర్చుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
ఆదాయంగా వస్తున్న ఆదాయాన్ని స్వగృహం మరమ్మతులకీ సౌకర్యాలకీ ఇతరమైన సౌందర్య పద్ధతులకీ వాడేస్తూ ఎప్పటి ఆదాయాన్ని అప్పుడు వస్తురూపంలోకి తెచ్చేస్తూ తీసుకున్న ఋణాన్ని వడ్డీలతో అలా పెంచేసుకుంటున్నారేమో గమనించుకోండి.
వ్యక్తి మీది గౌరవమనేది బాకీ తీసుకోనంతవరకే. అది సరైన కాలంలో తీర్చ(లే)ని పక్షంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ అవమానాన్ని చేయాలనే ఊహకి ఋణదాత(ల)ని వచ్చేలా చేస్తుంది. జాగ్రత్త పడండి.
సంతానంలో ఒకరి విద్యాప్రతిభ ఓ మాదిరిగా ఉంటూ కొంత మనస్తాపానికి మిమ్మల్ని గురి చేయవచ్చు. అలాగని మీరేమైనా ఆ పరిస్థితిని చక్కదిద్దగలుగుతారా? అంటే అది మీ చేతిలో పని కాని కారణంగా ఇబ్బందికి గురి చేయవచ్చు. కొద్దిగా శ్రమ, అసౌకర్యమనుకుంటే సంతానం దగ్గర మీ భార్యని కొన్నాళ్లపాటు ఉంచితే అటు విద్యాస్థాయి దానితో పాటు ప్రవర్తన... అనే ఈ రెండూ సక్రమంగా అవుతాయి.
శస్త్రచికిత్స దాకా అనారోగ్యస్థాయి వెళ్లిన విషయాన్ని గుర్తుంచుకుని ఆహారవిహారాల్లో తగు జాగ్రత్తలని పాటించక తప్పదు. అత్యాశకి పోతూ దూర భార ప్రయాణాలని విరమించడం మంచిది.

లౌకిక పరిహారం: ఋణాలని తీర్చడం విషయంలో ఓ క్రమశిక్షణ అవసరం.
అలౌకిక పరిహారం: వెండి వస్తువుని ముంచిన జలం (రౌప్యజలం) తో శివాభిషేకం చేసుకోంది.

కన్య(ఆగస్ట్‌ 23 –సెప్టెంబర్‌ 22)
దురదృష్టవశాత్తు ఏవైనా వ్యవహారాలు న్యాయస్థానాల వరకు వెళ్లి ఉండినట్లయితే అంత అనుకూలమైన తీర్చు వచ్చే అవకాశం లేనందున వాయిదా కోరుకోవడం మంచిది. ఆషాఢమనేది దైవప్రార్థనకి విశేష అనుకూల కాలం కాబట్టి దైవచింతన సమయానికి ప్రాధాన్యమీయడం మంచిది కూడ.
సంతానంతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర లేదా విహారయాత్రని చేసే అవకాశముంది. అనారోగ్యం కనిపించిన మొదటి గంటలోనే వైద్యానికి పరుగెత్తడం సరికాదు.
ఆ అనారోగ్యం తాత్కాలికమా? స్వయంకృతాపరాధమా?... ఇలా విశ్లేషించుకుని తాత్కాలికమైన తేలికపాటి ఆరోగ్య పరీక్షలని చేయించుకోండి అవసరమైతే.
అనుకోకుండా వచ్చే ఆర్థికలాభం ఉంది. దాన్ని విచ్చలవిడిగా కుటుంబంలోకి కావలసిన వస్తువులని కొనేయడం కాకుండా సంతానానికి చేయాల్సిన వివాహాది శుభకార్యాల నిమిత్తం వినియోగించండి. దానిలో భాగంగా వెండి బంగారాలని కొని ఉంచడం శ్రేయస్కరం.
కొత్త వ్యాపారాన్నే ప్రారంభించదలిస్తే ఎప్పటికప్పుడు తెమిలిపోయే కూరగాయల వ్యాపారాన్ని చేయడం మంచిది. ఒకవేళ నష్టం వచ్చినా లక్షల్లో ఉండదు.
ఇది వ్యాపార ప్రారంభస్థితి అనుకుంటూ పెద్దగా లాభం రాదనీ – అనుభవం మాత్రం వచ్చి తీరుతుందనీ భావించి దిగండి. అధికాధిక లాభాలు రావుగాని నష్టం మాత్రం ఉండదు.
రాజకీయ రంగం వైపుకి దిగే ఆలోచనల్ని విరమించుకోండి.
లౌకిక పరిహారం: న్యాయస్థాన అంశాల్లో రాజీ విధానం మంచిది.
అలౌకిక పరిహారం: గుడ (బెల్లం) జలంతో శివాభిషేకం ఉత్తమం.

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
మంచి అదృష్టయోగం నడుస్తున్న కారణంగా కుటుంబ సభ్యులందరి సంపాదననీ ఒకచోట చేర్చి గృహాన్ని/భూమిని/పొలాన్ని కొనడం గానీ లేదా ఉన్న ఇంటికి భారీగా మరమ్మతులు చేపట్టడం గానీ జరగచ్చు. కుటుంబంలో అందరిలోనూ ఐకమత్యం దృఢంగా ఉంటుంది.
వ్యవసాయదారులకి మంచి ఆదాయాలు వచ్చే సూచనలున్నాయి. అవకాశం చేసుకుని సొంత వ్యవసాయాన్నే గనక చేసుకుంటే చక్కని ఆర్థిక లాభం ఉండడమే గాక సరైన ఎరువుని సరైన తీరులో వేసుకుంటూ భూసారాన్ని పెంచుకోగలగుతారు.
అదే మరి కౌలుకిస్తే ఈ దృఢత్వం భూమికి రాదు. ఈ విషయాన్ని ఆలోచించుకుని కౌలుకి ఇయ్యద్దు. కొద్ది శ్రమైనా సొంతంగానే చేసుకోండి.
లోగడ ఎదుర్కొన్న ఇబ్బందులు దాదాపుగా తొలగిపోయినట్లుగానే భావించచ్చు. ప్రతి ప్రయాణమూ లాభసాటిగానే ఉంటుంది.
స్థిరమైన ఆస్తుల కొనుగోళ్లకో లేదా ఉన్న ఆస్తుల మరమ్మతులకో కొంత సొమ్ముని రుణంగా బంధువుల నుండి తీసుకోవచ్చు.
తలిదండ్రుల ఆరోగ్యం బాగానే ఉన్నట్లనిపించినా ఒకరికి మాత్రం ఔషధసేవ తప్పనిసరి కావచ్చు. మిత్రులూ బంధువులూ ఇరుగు పొరుగులూ.. ఇలా అందరూ కూడా మీ మాటనే విశ్వసించేవారు అయ్యే కారణంగా ఒకప్పుడు మీకు వచ్చిన అప్రతిష్ఠ దాదాపుగా తొలగిపోతుంది.

లౌకిక పరిహారం: ప్రతీకార బుద్ధి సరికాదు.
అలౌకిక పరిహారం: గోధుమ జలాభిషేకాన్ని శంకరునికి చేయడం మంచిది.

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
లోగడ అవసరం కోసం చేసిన రుణాలకి అదనంగా మరికొంత రుణాన్ని చేయవలసి రావచ్చు. ప్రతి ప్రయాణమూ ప్రయోజనకరం ఏమాత్రమూ కాదని తెలిసి కూడా ప్రయాణాలు చేయవలసి రావచ్చు.
ప్రయాణాల్లో అతి ముఖ్యమైన పత్రాలూ వస్తువుల పట్ల జాగరూకత అత్యంత అవసరమని గుర్తించండి.
జీవిత భాగస్వామితో సత్సంబంధాలు లేకపోవడం గాని– న్యాయస్థానంలో వ్యవహారం నడుస్తుండడం గాని– ప్రతీకార బుద్ధితో దంపతుల్లో ఒకరు (ముఖ్యంగా భార్య) ఉండడం గాని– ఒకవేళ తనతో కలిసి అదే గృహంలోనే ఉంటే భర్త ఆరోగ్యం దెబ్బతినడం గాని జరిగే అవకాశముంది. దూరంగా గాని భార్యాభర్తలున్న పక్షంలో సంతానాన్ని చూసే వీలుని ఆమె ఈయకపోవచ్చు.
మీరు మాట్లాడే ప్రతి మాటనీ ఎవరో వింటున్నారనే ఆలోచనతో ఉండండి. ప్రత్యక్షంగా మాట్లాడడమే అయితే ఆచితూచి మాట్లాడడం మంచిది తప్ప తోచిన విధంగా మాట్లాడడం ప్రమాదకరం. అనుకూలంగా ఉంటూ శత్రుభావంతో ఉన్న మిత్రులున్నారు. ఓ కంట కనిపెట్టి ఉండండి.
వ్యాపారస్థులకి ప్రభుత్వం వారి నుండి జరిమానాలు విధింపబడవచ్చు. చిన్న చిన్న అభియోగాలు మోపబడచ్చు. అనారోగ్యాన్ని అశ్రద్ధ చేసే అవకాశముంది.
కాబట్టి కుటుంబ సభ్యులు కుటుంబంలో అనారోగ్యవంతులుంటే వారిపట్ల శ్రద్ధని వహించి ఉండాల్సిందే.

లౌకిక పరిహారం: ఆచితూచి మాట్లాడాలి. అనుకూల శత్రువులున్నారు జాగ్రత్త!
అలౌకిక పరిహారం: ఆవుపాలతో శివాభిషేకం ఉత్తమం.

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
అనవసర విషయాల మీద ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటూ కాలాన్ని వృథా చేసుకుంటున్నారేమో ఆలోచించుకోండి.
సరైన సమయంలో విత్తనాన్ని నాటకుండా ఆలస్యం చేసుకుని అకాలంలో విత్తనాలని చల్లి ఎరువు వేసినా ఫలితం శూన్యమే ఔతుంది. గమనించుకుని సమయాన్ని సద్వినియోగపరుచుకోండి. విషయం మీద సరైన అవగాహన లేనివాళ్లు మిమ్మల్ని బాగా ప్రశంసించేస్తూ మీ చేత తమ పనిని చేయించుకుంటూ ఉండచ్చు.
దీనివల్ల వాళ్లు ప్రయోజనాన్ని పొందుతున్నారు తప్ప, మీరేం లాభాన్ని పొందగలుగుతున్నారు.. పరిశీలించుకోండి. జీవితంలో కొంత స్వార్థం (ఇతరులకి హానికరం కాని తీరులో) అవసరం. గృహిణులకి సంతానంతో తాత్కాలిక వ్యతిరేకత వచ్చే అవకాశమున్న కారణంగా కొద్ది జాగ్రత్తగా మాట్లాడడం, మాట్లాడుకోవడం అవసరం.
ఒకవేళ వాళ్లు మాట తూలి ఓ మాటని అన్నప్పటికీ సంయమనాన్ని పాటించడం మంచిది. వినోద విహారయాత్రలకి వెళ్లే అవకాశముంది గాని వాటికై ఒక నిర్దిష్ట ప్రణాళిక (ఇన్ని రోజుల మాత్రమే) అవసరం. దానికి అటూ ఇటూ ఉండడం సరికాదు. విద్యార్థులకి సమస్యాకాలం ఇది.
ఎక్కడ చేరాలో అనే విషయం గూర్చిన చర్చలు జరుగుతూనే ఉండచ్చు. కాలయాపన లేకుండా విషయాన్ని తెంచేసుకుని ఒక స్థిర నిర్ణయానికి రావడం మంచిది.
పిల్లల చదువులూ వాటి కోసం కావలసిన ఆర్థికమైన వనరులూ.. గమనించుకుని కొత్త ఆస్తుల్ని సంపాదించుకోవాలనే ఆలోచనని కొద్దిగా వాయిదా వేయడం మంచిది.

లౌకిక పరిహారం: సమయాన్ని వృధా చేసుకోకండి. పొగడ్తలకి లొంగిపోకండి.
అలౌకిక పరిహారం: ఆవుపెరుగుతో శివాభిషేకం ఉత్తమం.

మకరం(డిసెంబర్‌ 22 – జనవరి 19)
‘క్షణం తీరికలేదు – దమ్మిడీ ఆదాయం లే’దనేది ఓ సామెత ఒకప్పుడుండేది. సరిగ్గా దానికి ఉదాహరణగా మీరు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు.
అయితే ఫలితం మాత్రం ఖాళీ అరచేయి మాత్రమే అవుతూ ఉంటుంది. ఆదాయం రాకుంటే బాధ లేదు గాని సమయం వ్యర్థం అవుతూ ఉండడం – దాంతో పాటు మానసిక నిరుత్సాహం కల్గడం జరుగుతూ ఉంటుంది. అది సరికాదు.
వెంటనే సరైన వ్యాపారం కోసం అన్వేషణ చేయండి. మీరు మాట్లాడే తీరు ధర్మబద్ధంగానూ వ్యవహార శైలితోనూ హానికరం కాని లౌక్యంతోనూ ఉండే కారణంగా మీ మధ్యవర్తిత్వాన్ని ఆకాంక్షిస్తూ మీ బంధువులో ఆప్తులో మరెవరో మీ వద్దకి వచ్చే అవకాశముంది. తప్పక సహాయపడండి తప్ప, మొత్తం బాధ్యతనంతా భుజాన వేసుకుని దిగిపోకండి మధ్యవర్తిత్వానికి. సహజంగా ముందుగా ఎవరు మనదగ్గరకొచ్చి ఓ విషయాన్ని చెప్తారో దాన్నే మనం నిజమని నమ్ముతాం.
అలాటి ధోరణిని విడనాడి తలదూర్చండి, శృతిమించి పోకండి. సంతానానికి అంటే సంతానంలో ఒకరికి తాత్కాలిక అనారోగ్యబాధ కలగచ్చు.
అది తేలికపాటిదే కాబట్టి మరింత పెద్దవైద్యుని దగ్గరికి వెళ్లక్కర్లేదు. అయితే అనారోగ్యం ఎందుకొచ్చిందో ఒక్కసారి విశ్లేషించుకున్న పక్షంలో ఆ సమస్యకి మూల కారణం తెలుస్తుంది.
సమస్యకి పరిష్కారం లభిస్తుంది కూడ.

లౌకిక పరిహారం: మధ్యవర్తిత్వంలో శ్రుతిమించద్దు.
అలౌకిక పరిహారం: శివునికి తేనెతో అభిషేకం చేయడం ఉత్తమం.

కుంభం  (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వ్యవసాయదారులయ్యుంటే పరిస్థితి నిరాశజనకంగా ఉండచ్చు. పొలం పనులకి కూలీల రాకా, యంత్రపరికాలు పనిచేసే విధానం, భూమిలో ఉండాల్సిన సారం, కూలీలని పర్యవేక్షించే నమ్మకమైన వ్యక్తీ.. ఇలా అన్నిటా ప్రతికూలతే ఉండచ్చు.
ధైర్యంగా ఉండడమే తప్ప చేయగలిగింది లేదు. కుజుడు బుధుడూ అర్ధశుభులుగా ఉన్నారు. వ్యాపారం చేసేవారు సరుకుకోసం ముందుకి ముందే సొమ్మునిచ్చి ఆ సరుకు రాకపోవడమో లేక చెప్పినదీ చూపించినదీ అయిన సరుకు ఆ వచ్చినది కాకపోవడమో జరిగి, ఆ ఇచ్చిన సొమ్ముని వెనక్కి తెచ్చుకునే ఆలోచనతో సతమతమయ్యే అవకాశముంది కాబట్టి తగిన వ్యవహారంలో తగిన బందోబస్తుతో వ్యవహరించడం మంచిది.
ఉద్యోగస్థులయినట్లయితే అధికారుల వ్యతిరేకతకీ ఆగ్రహానికీ నిష్కారణంగా గురయ్యే అవకాశం ఉంది. మాటకి మాట బదులు చెప్పడం పెద్ద పనేమీ కాదు గాని, వ్యవహారం మలుపు తిరిగితే దాన్ని సరి చేసుకోవడం సామాన్యమైన పని కా(బో)దు.
కాబట్టి కొద్దిగా తలొంచుకుని వ్యవహారాన్ని ముగించుకోవడం ఉత్తమం. నిదానంగా వ్యవహరించిన పక్షంలో మాత్రమే మీరు గెలుపుని సాధించుకోగలుగుతారు తప్ప దూకుడుతనంతో వెళ్లినట్లయితే ఇబ్బందికి గురౌతారు. అందుకే రెండోసారి కూడ ఈ విషయాన్ని చెప్పడం జరుగుతోంది.
ఎన్నెన్నో ప్రయాణాలు చేయవలసి రావడంతో ప్రయాణించి ప్రయాణించి శారీరకంగా నిస్సత్తువతో ఉండిపోతారు ఇల్లు కదలక. ఆరోగ్యం జాగ్రత.

లౌకిక పరిహారం: శారీరక స్థితిని గమనించుకుని మాత్రమే ప్రయాణాలు చేయండి.
అలౌకిక పరిహారం: శంకరునికి చెరుకు రసంతో అభిషేకాన్ని చేయించుకోండి.

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
సంతానం గాని ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నట్లయితే వాళ్లకి విద్యేతర విషయంలో – అంటే సంగీతం క్రీడలు ఈత చిత్ర లేఖనం సంగీతవాద్యాల మీదా ఆసక్తి క్రమంగా పెరిగి, ప్రధానమైన విద్యమీద దృష్టి తగ్గిపోతూండే ప్రమాదం ఉంది. గమనించుకుని తోవకి తెచ్చుకోండి.
భయపెట్టీ వారించీ హెచ్చరిస్తూ ప్రవర్తించినట్లయితే పరిస్థితి మరోలా కూడ ఉండచ్చు. పరిస్థితిని బట్టి సరిచేసుకోండి. సంతానంలో ఒకరికి వ్యాపార దృక్పథం చిన్నతనం నుండే అలవడే అవకాశం – దాంతోపాటు మీరు వ్యాపారస్థులే గాని అయ్యుంటే మీతో పాటు వ్యాపార స్థలానికి అప్పుడప్పుడు వస్తూండే అలవాటూ ఉండచ్చు. ఇది కూడ ప్రధాన విద్యకి విఘాతం కల్గించేదే కావచ్చు. ఆలోచించుకోండి.
అకస్మాత్తుగా ఆధ్యాత్మిక ధోరణి మీలో కలిగి దానధర్మాలూ పుణ్యక్షేత్ర సందర్శనాలూ పుణ్యనదీ స్నానాలూ.. వంటివి చేయాలనే ఆలోచన దృఢంగా రావచ్చు. ఏ పనైనా సరే విద్యాభ్యాసం ధన సంపాదనం దైవభక్తీ.. ఇలా ఏదైనా సరే శ్రుతి మించి ఉండకూడదనే ఆలోచనకి రండి.
శుభకార్యం ఒకటి సిద్ధంగా ఉండచ్చు. తగు ప్రయత్నాల్లో ఉండండి. వాహనాలనీ యంత్రాలనీ మార్పులు చేసే ఆలోచనలో మీరుంటూ కొత్తవాటిని కొనుక్కుందా మనుకోవచ్చు. ‘లోతు చూసి గోతులోకి దిగు’ అన్న సామెత ప్రకారం ప్రస్తుతం అంత ఖర్చుకి తట్టుకోగలనా? అనుకుని ఆ మీదట దానికి తగ్గట్టు చేసుకోండి.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ అడ్డూ లేని – రాని కారణంగా ఆదాయం బాగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు ఈ వారమంతా.

లౌకిక పరిహారం: పిల్లలకి ప్రధాన విద్య మీదే దృష్టి ఉండేలా చూసుకోండి.
అలౌకిక పరిహారం: శివునికి ఏవైనా సరే 5 ఫలాల రసంతో అభిషేకం చేయడం ఉత్తమం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top