ఈ వారం రాశి ఫలాలు (10-08-2019)

Weekly Horoscope in Telugu (10-08-2019) - Sakshi

జన్మనక్షత్రం తెలియదా? నో ప్రాబ్లమ్‌! మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (ఆగస్ట్‌ 10 నుండి 16 వరకు) మీ రాశి ఫలితాలు డా‘‘ మైలవరపు శ్రీనివాసరావుజ్యోతిష్య పండితులు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఏదో కారణంగా మన చేయి బెణికినట్లయితే ఆ బాధ తీరేంతవరకూ దానికి పనిని ఏమీ చెప్పం– చేయించం. దానిక్కారణం ఆ బాధ మరింత ఔతుందని. సరిగ్గా అలాగే ప్రస్తుతం మీకు గురువు (గురుగ్రహం) అనుకూలంగా లేడు. ఆ కారణంగా ఏదో ఓ ఆలోచనని చేసేసి పనుల్ని ముగించుకునేలా చేసేసుకుందామని భావించకండి. ‘పనులు కాకపోవడం అనేదే మంచిది సుమా!’ అనే తీరులో విషయం జటిలం అయిపోవచ్చు తొందరపడి చేసేస్తే. ప్రస్తుత దశలో శని నవమంలో ఉండి అకస్మాత్తుగా ఊహించని తీరులో కుటుంబ సభ్యులకి శారీరక అనారోగ్యాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఈ సమాచారాన్ని చదువుతూ భయపడుతూ కూచోడం కాకుండా ఏ చిన్న అనారోగ్యం కనిపించినా, వెంటనే తగు జాగ్రత్తని పాటించాల్సిందే. తేలికపాటి ఆరోగ్య పరీక్షలని చేయించుకోవడం గానాఇ లేదా ఇటీవల వైద్యుడు చెప్పిన సూచనలని కచ్చితంగా పాటించడం గాని చేయాల్సిందే. ఎవరో ప్రోత్స స్తున్నారు కదా! అనీ, ‘మేం అండగా ఉంటాం కదా!’ అనీ గట్టి అండగా పలుకుతున్నారు కదా! అనీ ఇంటిని కట్టడం, మరమ్మతులు చేయడం అనే వాటిని వెంటనే ప్రారంభించెయ్యకండి. అయిన వారితో ఇలాంటి వ్యవహారాలు చేసుకోవడం, చూసుకోవడం కంటె నిక్కచ్చిగా మాట్లాడుకుంటూ బయటి వారితో పనుల్ని సాధింపజేసుకోవడం ఉత్తమం. అసూయతోగాని, శత్రుత్వంతోగాని ఎవరైనా ఓ చిన్నపాటి నిందని వేస్తే వెంటనే ప్రతిస్పందించెయ్యండి. ఎంత తేలికగా మీరు తీసుకోగలిగితే అంతా మీకు శుభమే ఔతుంది. ఎంత తీవ్రంగా దాన్ని పరిగణిస్తే ప్రస్తుత దశలో అంత ఇబ్బందీ కలిగే అవకాశముంది.

లౌకిక పరిహారం: నిందని పట్టించుకోకండి. ఆరోగ్య శ్రద్ధ అవసరం.
అలౌకిక పరిహారం: శ్రావణం కాబట్టి ఎనమండుగురు స్త్రీలకి పళ్లు పంచుకోండి అమ్మ పేరిట.

వృషభం (ఏప్రిల్‌ 20 –మే 20)
ఎత్తు ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఎంతటి వాహనమైనా తనంత తానే ఎలా వేగాన్ని తగ్గించుకునే పరిస్థితికొస్తుందో, అదేవిధంగా శనిగ్రహం 8వ ఇంట ఉన్న కారణంగా ప్రతి పనీ నిదానంగా నడుస్తూ అనుకున్న సమయానికి పూర్తి చేయలేని– పూర్తి కాని విధంలో ఉంటుంది. దీన్ని వేగవంతం చేయాలని ప్రయత్నిస్తే అధిక వ్యయం మాత్రమే కావచ్చు కాని, ప్రయోజనం నెరవేరకపోవచ్చు. ‘పెద్దలు’ అనే మాటకి వయసులో, అధికారంలో పెద్దలనేది ఒక అర్థమయితే, మనకంటె అనుభవం కలవాళ్లనేది నిజమైన అర్థం. మీ విషయంలో. ఆ కారణంగా మీకంటె వయసులో చిన్నవాడనే అభిప్రాయంతో ఆయన్ని సలహా/ సూచనలని అడగడాన్ని అవమానంగానూ, తక్కువదనంగానూ భావించకండి. కార్యసాధకుడైన వ్యక్తి ఏ పరిస్థితికి ఏది అనుకూలమో అలా ప్రవర్తిస్తాడు. అదే సరైన మార్గం కూడా. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఉండదలిచినా కూడా ఏదో ఒక దురదృష్టకాలంలో నోరు రగిలి పై అధికారులతో కఠినంగా మాట్లాడే సందర్భం కనిపిస్తోంది. మిమ్మల్ని మీరు ఎంతగా నియంత్రించుకోగలిగితే అంతగానూ 2వ ఇంట ఉన్న రాహువు– బలహీనుడై ఏ అపకారాన్నీ రాకుండా దూరం చేయగలుగుతాడు– తాను ఏమీ వ్యతిరేకతని కల్గింపజేయలేకపోతాడు కూడా. రాహువుతో పాటు కేతువు కూడా అననుకూలంగా ఉన్న కారణంగా సరైన ఆలోచనలు తట్టకపోవచ్చు. అలాంటి అననుకూల పరిస్థితుల్లో తాత్కాలిక మనశ్శాంతి కోసం తీర్థయాత్రలూ పుణ్యనదీస్నానాలూ.. ఇలా చేయవచ్చు. దూర దూర ప్రయాణాలు కూడా ఉండచ్చు. అయితే ఆరోగ్యభంగం ఉండని కారణంగా శారీరకంగా దృఢంగానే ఉండగలుగుతారు.

లౌకిక పరిహారం: పరిస్థితికి అనుగుణంగా సాగిపొండి తప్ప ఎదురు తిరగవద్దు.
అలౌకిక పరిహారం: శ్రావణం కాబట్టి అమ్మ పేరిట రోజూ ఒకరికి కుంకుమని పెట్టి రండి.

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఎక్కడైనా ‘శత్రుభయం’ ఉందనే మాట వినిపించగానే కిట్టని ఇరుగుపొరుగు వారినీ, పై అధికారుల్నీ, ఇంతకుముందు విరోధం ఎవరితో వచ్చిందో వారినీ ఊహించుకుంటారు మనసులో శత్రువులంటే వారేననుకుంటూ. అయితే కుటుంబ సభ్యులతోనే చిన్న వాగ్వివాదం వచ్చేలా ఉంది గురుగ్రహం  6వ ఇంట ఉన్న కారణంగా. జ్యోతిషం ఎంత గొప్ప శాస్త్రమంటే, రాబోయే వ్యతిరేక ఫలితం– వచ్చే కష్టాన్ని చెప్పి– దానికి పరిహారాన్ని కూడా చెప్పేంతటి ఉత్తమమైన శాస్త్రం. ఆ కారణంగా కుటుంబ సభ్యులకి– అది కొంటా– ఇదికొంటా– వంటి వాగ్దానాలనియ్యద్దు. ఇయ్యకూడదు. వాదం పెరుగుతోందనుకున్నప్పుడు తగ్గిపోవడం అవశ్యకర్తవ్యం. ‘నేను నెగ్గగలిగా’నని మీ సంతానం అనుకున్నా మీరేం మనసుతో పట్టించుకుని భావించకండి ఆ సంఘటనని. చేతికి కదా దెబ్బ తగిలింది– నాక్కాదు కదా!– అని శరీరం ఎలా అనుకోలేదో అలాగే మీరూ మానసికంగా ఈ స్థితి కొద్దిగా ఇబ్బంది అనుటూ ఉన్నా అది ముందునాటికి మీకు మంచిగానే పరిణమిస్తుందని గ్రహించుకోండి.
7వ ఇంట  ఉన్న కేతువు ఏ అనారోగ్యాన్ని కల్గించాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి వీధి భోజనాలని పూర్తిగా మానుకోండి. ఇంట్లోనే చేయించుకుని వెంట తీసుకుపొండి. మన ఆరోగ్యం కంటె గొప్పది కాదు మన హోదాని చూపించుకోవడం!
సాధారణంగా నిదానంగా ఉంటూ వ్యవహరిస్తున్నా నోరు చేసుకోవలసిన పరిస్థితే గనక వస్తే– వెనకాడకండి. శ్రుతి మించకుండా ప్రయాణిస్తూ మాటకి సమాధానాన్ని గట్టిగా చెప్పండి.

లౌకిక పరిహారం: వాగ్దానాలనియ్యద్దు. ఆరోగ్య నియమాలని పాటించకండి.
అలౌకిక పరిహారం: శ్రావణం కాబట్టి ఎనమండుగురికి స్వయంగా పాదాలకి పసుపు పూయండి.

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ప్రస్తుతం గురుగ్రహం 6వ ఇంట ఉన్న కారణంగా ‘అన్నీ నాకే తెలుసు– నేను చెప్పినట్లు వినాల్సిందే!’ మీ మాటకి విలువనియ్యను– మీరు చెప్పినట్లు చేయను,
చేయనివ్వను’అన్న తీరుగా ఉండకండి. మీరు చే యలేకపోవచ్చు సరికదా మిగిలిన వారి సహాయ సహకారాలని తృణీకరించి మాట్లాడుతున్న కారణంగా అందరూ పనిని మీ మీదికి నెట్టేసి చోద్యం చూస్తూ కూచునే ప్రమాదముంది. భగవంతుడు చేతికి 5 వేళ్లనిచ్చింది అందరి సహకారమూ అవసరమని మనకి తెలియజేయడానికే. రాహుగ్రహం అననుకూలంగా ఉన్న కారణంగా ఏవైనా కంటి సమస్యలు ఇంతకుముందే ఉన్నా– లేక ప్రస్తుతం ఏదో ఉందేమో అనే అనుమానమున్నా– కళ్లజోడు ఉన్నా దాన్ని ధరించకుండా ఉంటున్నా వెంటనే శ్రద్ధ పెట్టండి. కంటికి శత్రువు రాహువు. అలాగే ఎముకల విషయంలో తగు జాగ్రత్త తప్పనిసరి. వయసు ఎక్కువ ఉన్న వారు ఎత్తులెక్కి వస్తువుల్ని అందుకోవడం, అలాగే తడి నేలమీద అజాగ్రత్తగా నడవడం సరికాదు. ఇవన్నీ ముందుచూపు జాగ్రత్తలు తప్ప భయపెట్టడం కాదని గ్రహించండి. విదేశాలకి వెళ్లే అవకాశముంది. తగు ప్రయత్నం చేయడం మంచిదే.  శరీరం బాగా సహకరిస్తునే ఉంది కదా అనే ఉద్దేశ్యంతో గాలిపటంలాగా ఎక్కడికి పడితే అక్కడికి తిరిగేస్తారు. గమనించుకోండి ఆరోగ్యాన్ని. ఒక్కసారంటూ వైద్యునికి దొరికి(పో)తే ఈ పనులన్నింటినీ దూరంగా జరిపేందుకు సిద్ధంగా ఉన్నాడు శని. కాబట్టి ముందూ వెనకా చూసుకుని మాత్రమే అవసరమనిపిస్తేనే ప్రయాణించడం అవసరం. విదేశాలకి వెళ్లే అవకాశం పుష్కలంగా ఉన్నందున తగినంతగా– దేనికోసం పిలుస్తున్నారో– ఆ విషయం గురించిన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది.

లౌకిక పరిహారం: కన్ను, ఎముకల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
అలౌకిక పరిహారం: శ్రావణం కాబట్టి 8 తోరాలకి పూజ చేసి ఎనమండుగురికి ధరింపజేయండి.

సింహం(జూలై 23 –ఆగస్ట్‌ 22)
మళ్లీ పూర్వ జీవితపు చాయలు మీలో ప్రవేశిస్తూ అప్పులు చేయడం, అప్పటికేదో ఓ తీరుగా సమస్యా పరిష్కారం కోసం ఏదో ఓ మాటని అనేసి దానికి కట్టుబడలేక మరో మాటని మాట్లాడడం... వంటివి చేసే అవకాశముంది. శనిగ్రహం 5వ ఇంట ఉన్నందున పైకి ఆనందపడేలా సమస్యని నివారించుకునేలా చేసుకోగలిగానని మిమ్మల్ని మీరు అభినందించుకోగలిగేలా చేస్తాడు గాని ఆ మీదట ఇబ్బందికి గురి చెయ్యవచ్చు. రుజు మార్గంలోనే ఉండండి. ఏ సమస్యా లేదు– ఉండదు కదా!
విదేశాలనుండి కొంత ఎక్కువకాలం ఉండే అవకాశమిస్తామంటూ ఆహ్వానం రావచ్చు. వెంటనే నమ్మేసి ఖర్చు చేసేసుకోకండి రాకపోకల విషయంలో కచ్చితమైన పద్ధతిలో నియమ నిబంధనల్ని మాట్లాడుకుని మాత్రమే ఆ పనిలోకి దిగండి.‘వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటావా? అనుమానాలు వీడి వెళ్లిపో!’ అని ప్రోత్సహించేవాళ్లు ఆ మీదట ఏది జరిగినా తప్పుకుంటారు సమాధానాన్ని దాటవేస్తూ. శుభకాలం– రాహువు అనుకూలిస్తూ ఉన్న కారణంగా– ఉంది కాబట్టి, తగు జాగ్రత్తలని తీసుకున్నందువల్ల పని చెడిపోదని గ్రహించండి. 5వ ఇంట కేతువున్న కారణంగా మీ వల్ల మీ చుట్టూ ఉన్న అందరికీ సుఖమూ శుభమూ ఆర్థిక లాభమూ సమస్యా పరిష్కారమూ వంటివి జరుగుతూ ఉంటాయి. కీర్తి లాభం మీకు కలుగుతూ ఉంటుంది గాని, ఈ వ్యవహారాల్లో తలమునకలౌతున్న కారణంగా మీకు సకాల నిద్రా సకాల భోజనం ఉండకపోవచ్చు. ఆ మధ్య శస్త్ర చికిత్స దాకా మీ ఆరోగ్య పరిస్థితి వెళ్లిన కారణంగా మరింత జాగ్రత్త తప్పనిసరి అని గ్రహించండి. వీధి భోజనాలు తప్పక మాని తీరాలని అర్థం చేసుకోండి.

లౌకిక పరిహారం: వ్యవహారంలో జాగ్రత్త– ఆరోగ్యంలో శ్రద్ధ అవసరం.
అలౌకిక పరిహారం: శ్రావణ లక్ష్మి పేరిట 8 మంది ముల్తైదువులకి పూలని తలలో ముడిచి రండి.

కన్య (ఆగస్ట్‌ 23 –సెప్టెంబర్‌ 22)
లోహ వ్యాపారులకి– బంగారం వెండి ఇత్తడి రాగి కంచు వర్తకులకి ఆర్థికలాభం బాగా ఉంది. వస్త్ర వ్యాపారులకి సరుకైతే అమ్ముడుపోవచ్చు కాని, రొఖ్ఖం రావడానికి సమయం పట్టచ్చు. ఈలోగా తాత్కాలికంగా మానసిక ఆందోళన తప్పక పోవచ్చు. ఆలోచించుకుని అప్పు వ్యాపారాన్ని చేయడం మంచిది. వ్యవసాయదారులకి మంచి అనుకూల కాలం. తప్పక పంట దిగుబడి గట్టిగా ఉంటుందనే నమ్మకంతో పాటు, ప్రస్తుతపు వ్యవసాయ పనులన్నీ తక్కువ పెట్టుబడితో సాగిపోతాయి. దాదాపు కౌలుకిచ్చేసుకుందామనే స్థాయి ఆలోచనకి వెళ్లిన మీరు, మళ్లీ సొంత వ్యవసాయమే చేసుకుందామనే ఊహకీ, సొంత వ్యవసాయాన్ని చేసుకోగలననే ఆత్మస్థైర్యానికీ వచ్చేస్తారు. ఇది మంచి పరిణామం. అవివాహితులకి వివాహ ప్రయత్నాలని ముమ్మరం చేస్తారు. కొద్ది అనుకూల దిశగా ప్రయత్నిస్తే శుభకార్యం జరిగే అవకాశముంది. ఒక ముఖ్యమైన విషయాన్ని పదిమంది మేధావుల మధ్యపెట్టవద్దనేది లోకం అనుభవం అనే రెండూ చెప్పే విషయం కాబట్టి తదనుగుణంగా ప్రవర్తించి మంగళ వాద్యాలని మోగించుకోండి ఇంట్లో. కాలం అనుకూలంగా ఉన్న కారణంగా చెప్తున్న విషయం ఇది. కేతువు 4వ ఇంట ఉన్న కారణంగా అయిన వాళ్లతో వాద వివాదాలూ మనఃస్పర్థలూ వచ్చే అవకాశముంది కాబట్టి శ్రుతిమించి పరిహాసాలూ ఒకరినొకరు దెప్పుకోవడాలూ పాత విషయాలని తవ్వుకోవడాలూ వద్దే వద్దు. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే సంతానం గాని కొద్దిగా ఆవేశానికి లోనౌతూ కనిపిస్తే ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లిపొండి తప్ప అక్కడే నిలబడి దీటుగా సమాధానాన్ని చెప్పి నోరు మూయించాలని ప్రయత్నించకండి. సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్త పడడం విజ్ఞుల లక్షణం.

లౌకిక పరిహారం: శుభకాలం నడుస్తోంది వాద వివాదాలు వద్దు.
అలౌకిక పరిహారం: శ్రావణ లక్ష్మి పేరిట 8 మందికి గంధాన్ని పూసి రండి.

తుల (సెప్టెంబర్‌ 23 –అక్టోబర్‌ 22)
రాహువు 9వ ఇంట ఉన్న కారణంగా ఎంతగా ప్రయత్నించినా పనులు కాకపోవడమంటూ ఉండదు గాని– అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం జరగచ్చు. కాబట్టి ముందుకి ముందే మానసికంగా సిద్ధపడి ఉండండి– పనుల్ని కొద్ది నిదానంగా జరుగుతూ సమయానికి పూర్తి కాకపోవచ్చు– నని. చేసిన ప్రయాణాన్నే మళ్లీ అదే పని పూర్తి కావడం కోసం కూడా చేయవలసి రావచ్చు. మీరు సాధించిన విజయం పట్ల అభినందన పరంపరం కొనసాగుతూ ఉంటుంది. ఆ కారణంగా గర్వించకండి. అలాగే మీ పరిస్థితిలోనే ఎవరైనా ఉండి తగు సూచనలు/ సలహాలు గాని అడిగినట్లయితే వివరించి చెప్పండి– ఆ ఇబ్బంది నుండి వారిని తొలగించగలిగిన సహాయాన్ని చేసిన వారవుతారు కాబట్టి. భార్యాభర్తల అన్యోన్యతని గురించి న్యాయస్థానంలో అభియోగం ఉంటే– దాంట్లో ఎవరో ఒకరు గెలిస్తే దాన్ని విజయంగా భావించవచ్చా? అలాగే ఆ ఇద్దరికీ గాని సంతానం ఉంటే ఆ సంతానాన్ని తల్లికో/ తండ్రికో కొంతకాలం పాటు చూపించకుండా ఉంటే దాన్ని కూడా విజయంగా భావించవచ్చా? బహుశః ఈ తీరు విజయమే మీకు లభించిందేమో ఆలోచించుకుని అదే జరిగి ఉంటే కొద్దిగా మనసుని మార్చుకోడానికి ప్రయత్నించండి. దానివల్ల మీకు కలిసొచ్చే అవకాశముంది. ఈ తీరుగా ఆలోచించుకోగలిగితే మీ జీవితం ఒంటరిగా ఉండబోదు. స్థానచలన ఆలోచనని ఎవరైనా మీకు చొప్పించి ఉంటే అది ఉద్యోగం కోసమే అయ్యుంటే అంగీకరించండి తప్ప మరే విధమైన ఇతర కారణాలకోసమూ ఆయ్యుంటే గనక స్థానచలన ఊహకి రాకండి. మీ వ్యతిరేక దృక్పథ ఆలోచన వల్ల మీకూ ఇబ్బంది మానసికంగా రావచ్చు.

లౌకిక పరిహారం: మీకు లభించిన విజయం ధర్మబద్ధమేనా? ఆలోచించుకోండి.
అలౌకిక పరిహారం: శ్రావణ లక్ష్మి పేరిట 8 మంది ముల్తైదువులకి మీకిష్టమైన పండుని అందించండి.

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఏలిన నాటి శని దోషం ఇంకా నడుస్తున్న కారణంగా అధర్మమార్గాలకి దూరంగా ఉండాలి. నిషిద్ధ వస్తువులని విక్రయించడం, తేలికగా సమస్య పరిష్కరింపబడుతుందనే ఆలోచనతో వంకర మార్గాల్ని ఆశ్రయించడం, వ్యసనానికి శరీరాన్ని గురి చేసుకోవడం, అన్య స్త్రీ పరిచయం.. వంటివి తీవ్రమైన మానసిక క్షోభకి గురి చేస్తాయి. పరిస్థితి కారాగార శిక్ష వరకూ వెళ్లచ్చు. జాగ్రత్తగా ఉండగలిగితే క్షేమంగా ఉండగలుగుతారు. ఏ కష్టమూ రాదు– ఉండదు. కేతుగ్రహం 2వ ఇంట ఉన్న కారణంగా ఏ మాటని మాట్లాడినా అది ఎదుటివారికి అపార్థం కల మాటలానే వినిపిస్తుంది– అనిపించవచ్చు కూడా. ఆ కారణంగా అవసరమైతేనే మాట్లాడడం– అవసరం ఎంతవరకో అంతే మాట్లాడడం– వీలు చేసుకుని ఏకాంతంగా కాకుండా మరొకరి సమక్షంలో మాత్రమే శత్రువులతో మాట్లాడడం, అనేది ఏ సమస్యనీ తేకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. వర్షపాతం అధికమైన కారణంగా నదికి చెప్పలేని పోటు వచ్చిన పక్షంలో ఎలా నీళ్లు బరువుగా ఉండి కెరటాలు కూడా పెరుగుతాయో, అలాగే మీ అధికారి కూడా మిమ్మల్ని అదో తీరు దృష్టితో చూస్తూ ప్రతిదాన్నీ తప్పు పడుతూ ఉన్నట్లయితే సహించండి తప్ప వ్యతిరేకించకండి– ఎదురు తిరగకండి. అలా మీ పై అధికారి ప్రవర్తించడానిక్కారణం అతని పై అధికారి అతణ్ణి మందలిస్తూ ఉండడం, పరోక్షంగా మీకు కలిసిరాని కాలం కావడమున్నూ. అష్టమ రాహువు తీవ్ర నిరాశని కలిగించవచ్చు. సిద్ధంగా ఉండండి. మీకు వ్యతిరేకతంటూ జరిగేది ఏదీ ఉండకకపోవచ్చు గాని మానసిక అశాంతి తప్పక పోవచ్చు. ఏమైనా విజయం మాత్రం మీదే. శిక్ష పడదని గమనించండి.

లౌకిక పరిహారం: కోపం సాహసం వాగ్వివాదం.. వంటివి వద్దు. సహనం మ ంచిది.
అలౌకిక పరిహారం: శ్రీ మహాలక్ష్మి పేరిట ఎనిమిది మంది స్త్రీలకి తాంబూలాలనియ్యండి.

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
గురుగ్రహం 1వ ఇంట్లో ఉన్న కారణంగా ఉద్యోగానికి సకాలంలో వెళ్లడం, శ్రద్ధగా పనిచేయడంతో పాటు అనవసర విషయాల జోలికి వెళ్లడాన్ని కచ్చితంగా మానుకోవాలి. అధికారులు నాగుపాముల్లాటివాళ్లు. ఎప్పుడూ బుస్సుమంటారో, వారిపై అధికారుల ఒత్తిడి కారణంగా ఏ క్షణాన కాటువేస్తారో తెలియదు కాబట్టి తగినంత దూరంలో ఉంటూ అవసరమైతే మాట్లాడడం, వివాదాలకి దిగడం మంచిది కాదని గుర్తుంచుకోండి. ఇది భయపెట్టడం కాదు. ముందుచూపు జాగ్రతలని చెప్పడం మాత్రమే. ఇంట్లో ఏదో ఓ శుభకార్యానికి అవకాశముంది. బాగా ఆలోచన చేస్తూ ఓ ప్రణాళిక ప్రకారం వ్యయం చేసుకోని పక్షంలో, మొగమాటాన్ని వీడని పక్షంలో బంధువులతో తగాదాలు రావచ్చు కాబట్టి ముందుకు ముందే ఎవరెవరు ఏయే పనుల్ని ఎంత వ్యయంతో చేసుకోవాలో నిర్ణయించుకోండి. ఎవరో ఒకరితోనే ఆర్థిక వ్యవహారాలని చూసుకుంటూ ఉండండి తప్ప ప్రణాళిక ఒకరిదీ అమలు మరొకరిదీ కాకూడదని గ్రహించుకోండి. రాహుగ్రహం అనుకూలంగా ఉన్న కారణంగా తాత్కాలిక అనారోగ్యమున్నా అది పనులకి ఆటంకాన్ని కల్గించేది కానేకాదు కాబట్టి నోటిని అదుపు చేసుకుంటూ సక్రమంగా ఔషధసేవని చేసుకుంటూ ఉండండి. ఎవరికో తోడుగా కొంత దూర ప్రయాణాన్ని చేయవలసి రావచ్చు. వారితో మీకున్న పరిచయస్థాయిని బట్టి లౌక్యంగా గాని, ఖండితంగా గాని రా(లే)నని చెప్పేయండి. ప్రయాణం ప్రయోజనకరమైనదైతే చేయడంలో అర్థముంది తప్ప వృధా ప్రయాణమని తెలిసి చేయడం సమయ వ్యర్థం కదా! ఇంత ఉన్నా మానసికంగా ప్రశాంతతో ఉంటారు. అవకాశం చేసుకుని భర్త/భార్య ఒకచోటే ఉండేందుకు ఉద్యోగ ప్రయత్నాన్ని గనుక చేసుకుంటే అనుకూలిస్తుంది.

లౌకిక పరిహారం:  దంపతులు ఒకచోట ఉండే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో శ్రద్ధని పాటించండి.
అలౌకిక పరిహారం: శ్రావణలక్ష్మి పేరిట 8 మంది ముల్తైదువులతో లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి.

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
శనిగ్రహం 12వ ఇంట ఉన్న కారణంగా ఏదో తెలియని మానసిక ఆందోళన ఉండచ్చు. వ్యతిరేకతంటూ జరిగేది ఏమీ ఉండకపోవచ్చుగాని లోభయం మాత్రం తప్పదు. తేలికగా అయ్యేపని కాస్తా మరింత శ్రమ చేస్తే కాని పూర్తికాకపోవచ్చు. నష్టమేముంది? పని అవుతుందన్నప్పుడూ, పని అయినప్పుడూ కొంత శ్రమకి గురైతే నష్టమేముంది? శ్రమ పడినా కూడ పని కానప్పుడు కదా బాధపడాల్సింది! మీకున్న సహజమైన వాక్పటిమా ప్రజ్ఞాపాటవాలూ మీకు బాగా తోడ్పడుతూ వ్యాపారాభివృద్ధికి సహకరిస్తాయి. అయితే వ్యాపార విస్తరణ కోసం మీకు తగిన సహాయం చేయగల వ్యక్తి దొరకని కారణంగా వ్యాపారం మరింతగా పెంపుకి నోచుకోకపోవచ్చు. సంతృప్తి అనే గుణం ఉన్న మీకు వ్యాపారం నిలకడగా సాగుతూండడమనేది చెప్పుకోదగ్గ అంశంగా అన్పించదు. ఆర్యోగంగా మీరంటూ ఉండడానిక్కారణం కూడ ఈ తీరు మానసిక సంతృప్తి. బంధుమిత్రులూ ఆప్తులూ రాకపోకలు సాగించే అవకాశముంది కాబట్టి పెట్టుపోతలూ కానుకలూ బహుమతులూ నిమిత్తం కొంత వ్యయమయ్యే అవకాశముంది. దాంతోపాటు వాళ్లతో సమయాన్ని గడపవలసి ఉంటుంది కాబట్టి ముఖ్యమైన పనులకి సంబంధించి వాళ్ల రాకతో ఇబ్బందికి గురికాకుండా ఉండేలా ఓ ప్రణాళికని ఏర్పాటుచేసుకోవడం కూడ అవసరమని గమనించండి. కేతువు కొద్దిగా అననుకూలంగా ఉన్న కారణంగా కంటికి అలాగే మెడ, నడుము భాగాలకి తాత్కాలిక అనారోగ్య బాధ ఉండచ్చు. నిర్లక్ష్యం చేయకుండా ఉండడం మంచిది. ఏదైనా ఓ నిర్ణయాన్ని తీసుకునేప్పుడు పెద్దల్ని సంప్రదించడం మాత్రం ఎంతైనా అవసరం.

లౌకిక పరిహారం: మానసికారోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. పెద్దలతో సంప్రదింపుల్ని మానద్దు.
అలౌకిక పరిహారం: శ్రావణలక్ష్మి పేరిటి 8 మంది ముల్తైదువలకి పాయసాన్ని పంచుకోండి.

కుంభం  (జనవరి 20 – ఫిబ్రవరి 18)
రాహుగ్రహం 5వ ఇంట ఉన్న కారణంగా బంధువులతో మాటా మాటా వచ్చే అవకాశమున్నందున ఆచితూచి బంధువులతో మాట్లాడడం మంచిది. బంధుత్వపు కొనసాగింపుకోసం – ‘బంధువుల్లేకున్నా నష్టం లే’దని పలికే మీ మాట తాత్కాలిక ఆవేశంలో అన్నదే ఔతుంది. ఎప్పుడూ బంధువులతో కలిసి మెలిసి ఉండాల్సిందే– తెంపుకోకండి. మీకు సంబంధించిన రంగంలో మీ ప్రతిభకి మెచ్చి చిన్నపాటి సంమానభాగ్యం ఉంది మీకు. ఆనందించండి. ‘ఎవరితోనూ తెగతెంపు’లనే మాటని ఎత్తనే ఎత్తకండి. సకాలంలో నిద్ర తప్పనిసరి అని భావించి ఇన్నవగంట తర్వాత వ్యాపారం సరికాదనే స్థిరనిశ్చయానికి రండి. వయసు పైబడిన పెద్దలతోనూ, వయసులో ఉన్నపిల్లలతోనూ అనవసర చర్చలవీ చేయకండి. వాళ్ల అభిప్రాయాలని వాళ్లు ప్రకటిస్తూంటే – మీదైన ఆలోచనని వాళ్ల సమక్షంలో పెట్టి, మీ ఆలోచనే ఎందుకు సరైనదో దాన్ని వివరించే ప్రయత్నాన్ని చేయకండి. ఎవరికి తోచిన ఆలోచనలు వాళ్లకుంటాయి. ఆ ఆలోచనల అమలులో వాళ్లకి ఏవైనా ఇబ్బందులుగాని వస్తే అప్పుడు ఆ సమస్యా పరిష్కారానికి సూచనలనడిగితే – అప్పుడు చెప్పండి తప్ప మీకు మీరుగా విషయాన్ని అడిగి మరీ ఆ అంశంలో జోక్యం చేసుకోకండి. ధనాన్ని ధనంగా పెంచే షేర్లూ చిట్‌ఫండ్లూ తాకట్టూ వడ్డీ వ్యాపారం.. వంటి వ్యాపారాల విషయంలో ఎక్కువ చురుకు చూపుతనంతో ఉండడం ఆమోదయోగ్యం కాదని గ్రహించండి. ఆరోగ్యంగానే ఉంటారు. స్థిరచిత్తంతో గడపగలుగుతారు కూడ. బంధువుల్ని ఆడిపోసుకోకండి.

లౌకిక పరిహారం: నోటి దురుసుతనం మహర్షులూ కొందరు వ్యాపారమిత్రులూ కూడ ఉండచ్చు.
అలౌకిక పరిహారం: శ్రావణలక్ష్మి పేరిట అమ్మవారికి 64 (8గీ8)ప్రదక్షిణలని చేయండి.

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఆర్థిక అనుకూలత బాగా ఉన్న కారణంగా పదిమందితో చర్చలు చేస్తూ ఓ వ్యాపారానికి మొగ్గు చూపే అవకాశముంది. అయితే ఆ వ్యాపారం గురించిన కొంత సమాచారాన్ని సేకరించాక మళ్లీ ఆ వ్యాపారం పట్ల విముఖత ఏర్పడే ధోరణి కన్పించవచ్చు. ‘తీరా ఒప్పేసుకున్నాను గదా!’ అనుకుంటూ మళ్లీ వెనక్కిపోవడాన్ని సరికాదనుకోకండి. మీకు ఏది ప్రయోజనకరమో గమనించుకుని దిగండి తప్ప ఈ మాటకి కట్టుబడి తీరాల్సిందేననుకుంటూ సరికాని వ్యాపారంలో దిగబడిపోకండి. మీ గృహిణి మీ ఇంట్లోకంటూ కొన్ని వినోద విలాసవస్తువుల్ని కొనచ్చు. నిరుత్సాహపరచకండి.
ఇద్దర్లో ఏ ఒక్కరికి మానసిక ప్రశాంతత లోపించినా కుటుంబం మొత్తానికి ఆ ప్రభావం సోకి అంతా అయోమయమైపోతుంది. గుర్తుంచుకుని మెలగండి. దుఃఖకాలంలో ఉన్నవారెలాగూ దుఃఖిస్తూ జీవనాన్ని సాగిస్తూంటే అన్ని తీరులా సుఖాన్ననుభవిస్తూ మళ్లీ నిరాశాజీవితం వైపు మీ దృష్టిని మళ్లించడం ఎంత అనవసరమైన విషయం? ఆలోచించుకోండి. కేతువు 10వ ఇంట ఉన్న కారణంగా ఏ పరిస్థితుల్లోనైనా ఎవరివల్ల ఏ తీరు అనౌచిత్యం ఇంట్లో జరిగినా, ఏ పనులైనా సరైన విధానంలో ముగియకున్నా – కొంత ధననష్టం, కొంత మానసిక శ్రమా ఉండచ్చు. తట్టుకోండి. ఎప్పుడూ ఎండాకాలమే ఉండదు. చలికాలం కూడ అనుభవానికి రావల్సిందే. ఆప్తులూ బంధువులూ లేదా అధికారులూ అయిన వ్యక్తుల గూర్చిన చిన్న చిన్న మాటలని (ప్రవర్తన కి సంబంధించిన) నిజమని నమ్మి ప్రచారం చేయకండి. ఎవరో చెప్పే చాడీలని చెవిని ఒగ్గి వినకండి.

లౌకిక పరిహారం: చాడీలని వినకండి. అంతా శుభమే ఔతుంది.
అలౌకిక పరిహారం: శ్రావణలక్ష్మికి 8 రంగుల పూలదండలని సమర్పించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top