చిన్న వ్యాపారులకు సున్నా వడ్డీ

Zero interest Bank loans for small traders in AP - Sakshi

అర్హులను గుర్తించేందుకు మొదలైన ప్రక్రియ

పది లక్షల మందిని గుర్తించేందుకు వలంటీర్ల ద్వారా సర్వే 

నడ్డి విరిగే వడ్డీలతో అప్పులు తెస్తున్న చిరు వ్యాపారులకు భారీ ఊరట

‘జగనన్న తోడు’తో రూ.10,000 చొప్పున బ్యాంకు రుణాలు 

వడ్డీ డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుంది... లబ్ధిదారులు అసలు కడితే చాలు

విజయవాడలోని కానూరులో కూరగాయలు విక్రయించే శ్రీను వ్యాపారం బాగానే ఉన్నా రూ.10 చొప్పున వడ్డీకి తెచ్చిన అప్పు తీర్చడానికే లాభం అంతా సరిపోతోంది. వ్యాపారం గిరాకీ బాగున్నా చేతిలో చిల్లిగవ్వ లేక అతడి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

గుంటూరు జిల్లా అల్లూరివారి పాలెం గ్రామానికి చెందిన రమణయ్య బండి మీద అరటి కాయలు అమ్ముకునే చిరు వ్యాపారి. రోజూ ఊరి నుంచి 5 కి.మీ దూరంలోని నరసరావుపేటకు వెళ్లి అమ్ముతుంటాడు. వారానికి రూ.2,000 (వడ్డీ మినహాయించి ఇచ్చేది రూ.1,700లే) కాబూలీ వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకోవడం.. రోజూ రూ. 300 చొప్పున బాకీ తీర్చడమే సరిపోతోంది.

సాక్షి, అమరావతి: అధిక వడ్డీలతో సతమతమవుతున్న చిరు వ్యాపారుల కష్టాలు తీర్చేందుకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అర్హులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా అక్టోబర్‌లో నెలలో సున్నావడ్డీ ద్వారా బ్యాంకు రుణాలిప్పించేలా కార్యాచరణ సిద్ధమైంది. గ్రామాలు, పట్టణాల్లో టీ దుకాణాలు, కూరగాయల వ్యాపారం, బడ్డీ కొట్లు, తోపుడు బండ్లపై టిఫిన్‌ విక్రయాలు తదితర చిరు వ్యాపారాలను నిర్వహిస్తూ పొట్టపోసుకునే వారికి రూ.10,000 చొప్పున రుణాలు ఇప్పించి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. రుణంగా పొందే అసలును మాత్రమే బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా వాయిదాల పద్ధతిలో చిరు వ్యాపారులు చెల్లించాల్సి ఉంటుంది.  ఇలాంటి వారికి బ్యాంకులు రుణాలిచ్చేందుకు వీలుగా ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది చిరు వ్యాపారులు ఉంటారనే అంచనాతో వారందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు ఈ నెల 18వ తేదీ వరకు సర్వే నిర్వహించి 30వ తేదీకల్లా అర్హులను గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

ఎవరు అర్హులు..?
► గ్రామాల్లోనైనా, పట్టణాల్లోనైనా సుమారు 5 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులను ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు.
► రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై, ప్రజా, ప్రైవేట్‌ స్థలాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు. తలపై గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు. 
► ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సైకిల్, మోటార్‌ సైకిళ్లు, ఆటోలపై తిరుగుతూ వ్యాపారం చేసుకునే వారు.
► చిరు వ్యాపారి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.10 వేల లోపు, పట్టణాల్లో రూ.12 వేల లోపు ఉండాలి.
► ఆధార్, ఓటరు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపు కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి.

గుర్తింపు కార్డుల జారీ ఇలా..
► గ్రామ, వార్డు వలంటీర్ల సర్వేలో అర్హులుగా గుర్తించిన వారి జాబితాలను సచివాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ఈ జాబితాలకు ఎంపీడీవో, జిల్లా జాయింట్‌ కలెక్టర్లు ఆమోదం తెలుపుతారు. 
► తుది జాబితాలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు క్యూఆర్‌ కోడ్‌ కలిగిన స్మార్ట్‌ గుర్తింపు కార్డును అందజేస్తారు. బ్యాంకు ఖాతాలు లేని వారు కొత్తగా పొదుపు ఖాతా ప్రారంభించేలా వలంటీర్లు సహకరిస్తారు.
► చిరు వ్యాపారులకు రూ.పది వేల వరకు విరివిగా రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్‌ఎల్‌బీసీ)లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన సూచన చేశారు. 
► గుర్తింపు కార్డులు జారీ చేసిన జాబితాలను జిల్లా అధికారులు అన్ని బ్యాంకులకు పంపుతారు. 

అక్టోబర్‌లో బ్యాంకు రుణాలు..
► వలంటీర్ల సర్వే అనంతరం అర్హుల ప్రాథమిక జాబితాలను ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు పరిశీలించి ఈ నెల 18 నాటికి ఆమోదం కోసం జిల్లా జాయింట్‌ కలెక్టర్లకు పంపుతారు. 24వ తేదీ కల్లా జాబితాకు కలెక్టర్లు ఆమోదం తెలుపుతారు. 30వ తేదీ కల్లా గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ చేపట్టేలా సచివాలయాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ‘జగనన్న తోడు’ ద్వారా అక్టోబర్‌లో సున్నావడ్డీ ద్వారా రుణాలిప్పించేలా కార్యాచరణ సిద్ధమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top