పేదల ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం

YV Subba Reddy Slams Chandrababu Naidu in Prakasam - Sakshi

ఆదర్శ పథకాన్ని అటకెక్కించింది

ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు

108, 104 సేవలదీ అదే దారి

రాష్ట్ర ప్రజలు రోగాలతో అల్లాడుతున్నారు  

వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే వెనక్కి పంపుతున్నారు

ఆదాయంలో 5 శాతం కూడా పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేయడం లేదు

టీడీపీ సర్కారుపై మాజీ ఎంపీ వైవీ ధ్వజం

కొండపి(సింగరాయకొండ): పేదల ఆరోగ్యంపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. కొండపిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీగా మారిందని ఎద్దేవా చేశారు.ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వైద్యశాలలకు రూ.500 కోట్ల బకాయిలు ఉండటంతో ఈ పథకాన్ని వైద్యశాలలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయన్నారు. దీన్ని బట్టి చంద్రబాబు ప్రభుత్వానికి పేదల ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్‌ఆర్‌ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మంది పేదలను బతికించిందని, ఆ పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా అమలు చేశాయన్నారు. కానీ ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా అటకెక్కించిందన్నారు. పేదలు వైద్యం కోసం ఆస్పత్రులకు వెళితే వెనక్కి పంపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలు ఆదాయంలో 10 శాతం నిధులు వైద్యం కోసం ఖర్చు పెడుతుంటే మన రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం నిధులు కూడా ఖర్చు చేయడం లేదన్నారు. 

కిడ్నీ బాధితులను పట్టించుకోరా..?
జిల్లాలో కిడ్నీ వ్యాధితో వందల మంది చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కొండపి, కనిగిరి నియోజకవర్గాల్లో సుమారు 500 మందికి పైగా మృతి చెందారన్నారు. ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు, మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, కొండపి నియోజకవర్గాల్లో సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

శిలాఫలకాలకే పరిమితం..
జిల్లా పట్ల చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా ప్రజలు కరువుతో అల్లాడుతున్నా సాగు, తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జనవరిలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇంక 13 రోజులే ఉంటే ఏ విధంగా వెలిగొండ ప్రాజెక్టు  పూర్తి చేసి నీళ్లిస్తారని ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టుకు, కనిగిరిలో పారిశ్రామిక కేంద్రానికి, దొనకొండలో పారిశ్రామికవాడకు శిలాఫలకం వేసి ఓట్లు అడుక్కునేందుకు చంద్రబాబు చంద్రబాబు పన్నుతున్నారని విమర్శించారు.

అధ్వానంగా 108, 104 సేవలు
రాష్ట్రంలో 108 సేవలు అధ్వానంగా ఉన్నాయని, వైఎస్‌ఆర్‌ హయాంలో ఫోన్‌ చేసిన 20 నిముషాల్లో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజల ప్రాణాలను కాపాడిందన్నారు. కానీ నేడు ఫోన్‌ చేస్తే డీజిల్‌ లేదని సమాధానం చెబుతున్నారన్నారు. 104 సేవలు కూడా పేదలకు సక్రమంగా అందడం లేదన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే 108, 104, ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలందిస్తామన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శివభరత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అనారోగ్యం పాలైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆస్పత్రులు నిలిపివేశాయన్నారు. పేదలపై సేవాభావంతో ఇంకో మూడు నెలల పాటు ఆస్పత్రులు ఈ పథకాన్ని కొనసాగించాలన్నారు.

జగనన్న ముఖ్యమంత్రి కాగానే ఈ పథకానికి నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. జగనన్న పుట్టిన రోజును పురస్కరించుకుని వారం రోజుల పాటు ప్రతి జిల్లాలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేదలకు ఉచిత వైద్యం, మందులు అందిస్తామన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ వెంకయ్య , వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, నాయకులు సీహెచ్‌ అయ్యారయ్య, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సామంతుల రవికుమార్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, గోపిరెడ్డి ఈశ్వర్‌రెడ్డి, పామర్తి మాధవరావు, పీవీ రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top