చంద్రగ్రహణం వీడాలి

YV Subba Reddy Slams Chandrababu Naidu - Sakshi

రాక్షస, దోపిడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి

కేంద్రంపై 13సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టాం

ఎన్నికల రణరంగంలో యుద్ధానికి సిద్ధం కావాలి

బూత్‌ కమిటీలే పార్టీకి అత్యంత కీలకం

వైఎస్సార్‌ సీపీ ఏలూరు బూత్‌ కమిటీల సమావేశంలో

మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని

ఏలూరు టౌన్‌: ‘రాష్ట్రంలో టీడీపీ రాక్షస, దోపిడీ  పాలన సాగుతోంది.. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు.. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాల జాడ లేదు.. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించే ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా మార్చేశారు.. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన తరుణం ఆసన్నమైంది’ అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉభయగోదావరి జిల్లాల సమన్వయకర్త, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్థానిక శ్రీరాంనగర్‌ సారథి గ్రాండ్‌లో ఏలూరు నియోజకవర్గం బూత్‌ కమిటీ కన్వీనర్లు, కో–కన్వీనర్లు, సభ్యులసమావేశం ఆదివారం నిర్వహించారు. ఏలూరు సమన్వయకర్త, ఎమ్మెల్సీ ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన సమావేశానికి బూత్‌ కమిటీ కన్వీనర్, కార్పొరేటర్‌ బండారు కిరణ్‌కుమార్‌ నేతృత్వం వహించారు. సమావేశంలో ఏలూరు నియోజకవర్గంలో 200 బూత్‌ కమిటీలకు సంబంధించి 2,200మందిని నియమించగా పార్టీ విజయానికి చేయాల్సిన కర్తవ్యంపై పార్టీ నేతలు అవగాహన కల్పించారు.

బూత్‌ కమిటీలు కష్టపడాలి
సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎంపీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి నోచుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా మోసం చేశాయో ప్రజలంతా చూస్తున్నారని, పార్టీకి గుండెవంటి బూత్‌ కమిటీలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే బూత్‌ కమిటీ సభ్యులకు గౌరవం, అధిక ప్రాధాన్యం ఉంటుందని, పాలనలో కీలకంగా వ్యవహరించేలా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. ప్రజలకు పింఛన్లు, ఇళ్లు, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు ఇలా అన్నీ కలబోసిన నవరత్నాలపై అవగాహన కల్పించే బాధ్యత బూత్‌ కమిటీలదేనని గుర్తు చేశారు. ఏలూరు పాదయాత్ర సభలో ఆటోడ్రైవర్లను ఆదుకునేందుకు ఏడాదికి రూ.10 వేలు నిర్వహణ ఖర్చులుగా ఇస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారని, ఇలా ప్రతి అంశాన్నీ ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రత్యేకç ßోదా కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంట్‌ సమావేశాల్లో 13సార్లు అవిశ్వాసతీర్మానం పెట్టామని, అంతటితో ఆగిపోకుండా పదవులనూ తృణప్రాయంగా వదులుకుంటూ ఐదుగురు ఎంపీలు రాజీనామా చేశామని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ దాడులకు తెగబడుతోందని, కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందనీ, వాటికి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక్కరోజు ఇచ్చే రూ.2 వేలో, రూ.3 వేలకో ఓటును అమ్ముకోవద్దని, సువర్ణ పరిపాలన కోసం జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు.

టీడీపీ మాయలను తిప్పికొట్టాలి
ఏలూరు సమన్వయకర్త, ఎమ్మెల్సీ ఆళ్ల నాని మాట్లాడుతూ పేదల సంక్షేమానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పడుతున్న తపన, కాంక్ష, కష్టాన్ని, చిత్తశుద్ధిని వివరించి ప్రజలను చైతన్యవంతులను చేసే బాధ్యత బూత్‌ కమిటీలదేనని అన్నారు. మూడు నెలలు కష్టపడితే చంద్ర ‘గ్రహణం’ వీడిపోతుందని ఎమ్మెల్సీ నాని చెప్పారు.  ఎన్నికల సమరంలో టీడీపీ కుట్రలు, కుటిల రాజకీయాలు చేస్తూ ప్రజలను మాయచేసేందుకు యత్నిస్తోందని, ఆ మాయలో ప్రజలు పడిపోవద్దని హితవు పలికారు. ఈ నాలుగున్నరేళ్ళలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వార్డు సభ్యుల వరకూ రూ.లక్షల కోట్లు దోచుకున్నారనీ, ‘సీఎం చంద్రబాబు ప్రజాధనాన్ని దోపిడీ చేయండి. ఎన్నికల్లో ప్రజలకు పదిశాతం ఖర్చు చేస్తే చాలు మళ్ళీ అధికారం మనదే’ అని చెబుతున్నారని, ప్రజలకు సేవ చేయనవసరం లేదని పార్టీ నేతలకు ఉద్బోధిస్తున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ము ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసి అధికారంలోకి రావాలనే కుట్ర సీఎం బాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో టీడీపీ మాయలు, మంత్రాలను ఎదుర్కొంటూ ఎన్నికల రణరంగంలో యుద్ధానికి ప్రతి బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

వైఎస్‌ జగనే స్ఫూర్తి
ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్‌ మాట్లాడుతూ పార్టీయే తన కుటుంబమని, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు మంచి చేయాలనే పట్టుదల, కష్టం నాకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. నేడు సమాజంలో 10 శాతం మందికే టీడీపీ పాలన అందిస్తోందని, మిగిలిన 90 శాతం మందికీ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అందే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు ఒక జోకర్‌లా మారిపోయారనీ, కాంగ్రెస్, టీడీపీలను బంగాళాఖాతంలో కలపాలన్నారు. టీడీపీని ఎన్‌టీ రామారావు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్థాపించారని, నిజంగా ఇప్పుడు జాతి గౌరవాన్ని కాపాడే బాధ్యత వైఎస్సార్‌ సీపీ తీసుకుందని, ఎన్టీఆర్‌ని అభిమానించే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. 

గుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు,  దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి, ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి, మాజీ మంత్రి మరడాని రంగారావు మాట్లాడుతూ.. బూత్‌ కమిటీలదే కీలక పాత్ర అని,  ఈ మూడు నెలలు కష్టపడితే భవిష్యత్తు మనదేనని పేర్కొన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మంచెం మైబాబు,  పార్టీ బూత్‌ కమిటీ రెండు జిల్లాల కో–ఆర్డినేటర్‌ బీవీఆర్‌ చౌదరి, పోలింగ్‌ కమిటీ ఇన్‌చార్జ్‌ బీవీఆర్‌ మోహన్, పార్టీ నేతలు గుడిదేశి శ్రీనివాసరావు, రావూరి ప్రసాదరావు, ఎన్‌.సుధీర్‌బాబు, నెరుసు చిరంజీవి, కిలాడి దుర్గారావు, మున్నుల జాన్‌గురునాధ్, పటగర్ల రామ్మోహనరావు, సిరిపల్లి ప్రసాద్, డాక్టర్‌ ప్రసాద్, లంకలపల్లి గణేష్, మోటమర్రి సదానందకుమార్, ఆచంట వెంకటేశ్వరరావు, శశిధర్‌రెడ్డి, పైడి భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top