బాబొస్తే.. జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి టీడీపీ సర్కారును సూటిగా ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల సూటిప్రశ్న
సాక్షి, హైదరాబాద్: బాబొస్తే.. జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి టీడీపీ సర్కారును సూటిగా ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, చాంద్‌బాషా, జయరామయ్య, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు. బాబు వచ్చారు.. కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించే పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు. కాంట్రాక్ట్ కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 50 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను సగానికి సగం తొలగించారని మండిపడ్డారు.
టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో హామీలను నెరవేర్చడం లేదన్నారు. కాంట్రాక్టు కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని చెప్పి చేయకపోగా 30 వేలమందిని తొలగించారని ఎమ్మెల్యే చాంద్ బాషా మండిపడ్డారు. ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీ క్యాలెండర్‌కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రగల్భాలు తప్ప నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమిచ్చిన పాపాన పోలేదని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి దుయ్యబట్టారు. బాబుకు, ఆయన పరివారానికి జాబులొచ్చాయి కానీ ఓటేసిన వారికి ఉద్యోగాలు రాలేదని మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.