సీఎం జగన్‌ ఏది మంచిదైతే అదే చేస్తారు..

YSRCP MLA Ambati Rambabu Comments On Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి: దేశం సందిగ్ధ పరిస్థితిలో ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లాక్ డౌన్ వలన దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్నారు. లాక్ డౌన్ కొనసాగిస్తే ఆర్థికంగా ఇబ్బంది తప్పదన్నారు. కొనసాగించకపోతే వైరస్ పెరిగే ప్రమాదం ఉందన్నారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ లేనందున సామాజిక దూరం పాటించకపోతే వైరస్ తో కలిసి ఉండటం తప్పదని సీఎం అన్నారని చెప్పారు. సీఎం జగన్ మాటలను ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుకూల మీడియా హేళన చేస్తోందని.. తప్పుగా ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
(‘అందుకేనా ఆయనకు కడుపుమంట’)

దాయాల్సిన అవసరం ఏముంది?
‘‘కరోనాపై ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఎల్లో మీడియా వ్యంగంగా చూపిస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని కరోనా టెస్టులు మన రాష్ట్రంలోనే చేస్తున్నారు. ఈ టెస్ట్ ల సంఖ్యను ఎందుకు ఎల్లో మీడియా చెప్పడం లేదు. కరోనా బారిపడి మన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 2 శాతం ఉంది. విష పూరిత చంద్రబాబు, ఎల్లో మీడియాతో సీఎం జగన్ పోరాటం చేస్తున్నారు. పాజిటివ్ కేసులను దాస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. దాయాల్సిన అవసరం ఏముందని’ అంబటి ప్రశ్నించారు.
(సీఎం జగన్‌ చెప్పింది వాస్తవమే..)

ఆ విషయాన్ని ఎల్లోమీడియా ఎందుకు తొక్కి పెట్టింది?
‘‘కరోనా వ్యాప్తి పెరుగుతుందని తెలిసి చంద్రబాబు హైదరాబాద్ పారిపోయాడు. కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టేవరకు ఆయన హైదరాబాద్ వదలి వస్తారా రారా సమాధానం చెప్పాలి. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండలాని సీఎం చెపితే ఆయన మాటలను చిలువలు పలువలు చేస్తున్నారు. హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో కరోనా వస్తే ఎల్లో మీడియా ఎందుకు తొక్కి పెట్టింది. 33 మందిని హెరిటేజ్ ఉద్యోగులను క్వారంటైన్ కు పంపారు. గవర్నర్ బంగ్లాలో నలుగురికి కరోనా వస్తే పెద్ద పెద్ద బ్రేకింగ్ వేశారు. హెరిటేజ్ లో కరోనా పాజిటివ్‌ కేసులు వస్తే ఎందుకు చంద్రబాబు దాస్తున్నారని’’ ఆయన ప్రశ్నించారు.

హెరిటేజ్‌లో ఏం జరుగుతోంది..!
హెరిటేజ్ లో ఏమి జరుగుతోందో ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు. ‘‘హెరిటేజ్ లో కరోనా కేసులు వస్తే కంట్రోల్ చేయలేని వారు ఆంధ్రప్రదేశ్ లో కేసులు కంట్రోల్ చేస్తారా.. కరోనా కేసులు దేశంలో లేవా..? తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో మనకంటే ఎక్కువ లేవా.. ఏపీలోనే కరోనా కేసులు ఉన్నాయా.. హెరిటేజ్ నుంచి అనేక రాష్ట్రాలకు పాలు వెళ్తున్నాయి. హెరిటేజ్ వలన చాలా మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని’’ తెలిపారు. చంద్రబాబు పిచ్చి లేఖలు వలన ఎలాంటి ప్రయోజనం లేదని.. ప్రజలకు ఏది మంచిదైతే..అదే సీఎం జగన్‌ చేస్తారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top