పేరొకరిది.. నిర్వహణ మరొకరిది.. | YSR Kadapa, Ration Shops Someone else management is another | Sakshi
Sakshi News home page

Mar 25 2018 11:07 AM | Updated on May 28 2018 1:30 PM

YSR Kadapa, Ration Shops Someone else management is another - Sakshi

ప్రతీకాత్మక చిత్రం..

సాక్షి ప్రతినిధి, కడప : జిల్లాలో 1,739 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 7.61 లక్షల మంది  తెల్లకార్డు దారులకు సరుకులు సరఫరా అవుతున్నాయి. 659 దుకా ణాలకు డీలర్లు లేకపోగా.. ఇందులో 271 దుకాణాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కడప రెవెన్యూ డివిజన్‌లో 696 దుకాణాలు ఉన్నాయి. ఇందులో 392 ఖాళీలు. ఇటీవలే 240 దుకాణాలకు సంబంధించి రాత పరీక్షలు నిర్వహించి ఇంటర్వూ్యల ద్వారా డీలర్ల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగా యన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీ నేతల ఒత్తిడుల నేపథ్యం లో 40 మంది టీడీపీ నేతల అనుచరులను ఎంపిక చేశారని సమాచారం.  రాజంపేట రెవెన్యూ డివి జన్‌లో 429 రేషన్‌ దుకాణాలు ఉండగా.. ఇందులో 51 ఖాళీలు ఉన్నాయి. 29 దుకాణాలు డీలర్లు కోర్టు మెట్లెక్కారు. ఇక జమ్మలమడుగు డివిజన్‌లో 614 రేషన్‌ దుకాణాలకు గానూ 216 ఖాళీలు ఉన్నాయి. 111 దుకాణాలపై కోర్టు కేసులు నడుస్తున్నాయి. 

అక్రమాలకు బాధ్యులెవరు!
నిత్యావసర సరకుల పంపిణీలో అక్రమాలు జరిగితే బాధ్యులెవరనేదానికి స్పష్టమైన సమాధానం లభించడం లేదు. దుకాణం గతంలో కేటాయించిన వ్యక్తుల పేరుతోనే ఉంటున్నందున తప్పులు గుర్తిస్తే అతనిపైనే కేసు నమోదు చేయాలి. దుకాణం నిర్వహించకుండా వదిలేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేస్తే అధికారులు స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గుర్తించిన అధికారులు దుకాణాల తనిఖీలు చేయడం లేదు. తనిఖీలు చేస్తే 6ఏ కేసులు నమోదు చేసేందుకు కలిగే ఇబ్బందుల నేపథ్యంలో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 6ఏ కేసుల నమోదు సంఖ్య గణనీయంగా తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. 

కన్నెత్తి చూస్తే ఒట్టు.. 
ఆర్‌ఐ, ఉప తహసీల్దార్, తహసీల్దార్‌ రేషను దుకాణాలను తనిఖీ చేసే అధికారం ఉంది. గతంలో ఉన్నతాధికారులు సమీక్ష సమావేశాల్లో  తనిఖీల గురించి వివరాలు అడిగే వారు. ఇటీవల కాలంలో ఉన్నతాధికారులు నుంచి ఒత్తిడులు   లేకపోవడంతో మండలస్థాయి అధికారులు కూడా తనిఖీలను గాలికొదిలేశారు. 

ఇళ్లకు రికార్డులు తెప్పించుకొని.. 
రేషన్‌ దుకాణాల పర్యవేక్షణ బాధ్యత ఆహార తనిఖీ అధికారులపై ఉంది. ఫిర్యాదులు అందినప్పుడో లేక ఒత్తిడులు వచ్చినప్పుడో మినహాయించి ఎఫ్‌ఐలు సైతం దుకాణాల తనిఖీల ఊసెత్తడం లేదు. కొందరు ఆహార తనిఖీ అధికారులైతే దుకాణాలకు సంబంధించిన రికార్డులను తమ ఇళ్లకు తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీల తనిఖీల జాడేది.. 
నాలుగైదు మండలాలకు ఒకరు చొప్పున ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీలను నియమించారు. ప్రతి నెలా చౌక దుకా ణాలను తనిఖీలు చేయాలి. నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్వహించకున్నా, పంపిణీలో తేడాలున్నా సంబంధిత డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసి సంయుక్త కలెక్టర్‌కు నివేదించాలి. పౌర సరఫరాల శాఖ అధికారులు రేషను దుకాణాలను ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. జిల్లాస్థాయి బృందాలు తనిఖీలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

అధికారపార్టీ నేతల కనుసన్నల్లో.. 
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలో టీడీపీ నేతలు రేషన్‌దుకాణాలపై కన్నేశారు. కొత్తగా డీలర్ల నియామకంలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిబంధనలు అధికారపార్టీ నేతలు గాలికొదిలేశారు. నయానో భయానో ఎంతో కాలం నుంచి షాపులను నిర్వహిస్తున్న డీలర్లు బెదిరించి వాటిని తమ బినామీల ద్వారా నిర్వహిస్తున్నారు.  ప్రస్తుతం దుకాణాలు నిర్వహిస్తున్న వారిలో 40–45 శాతం బినామీలే ఉండటం గమనార్హం. గతంలో డీలర్లుగా పనిచేస్తున్న వారి పేరునే కొనసాగిస్తున్నా.. నిర్వహణ మాత్రం కొత్తవారు చేస్తున్నారు. దుకాణాల నిర్వహణకు సంబంధించి డీడీలు తీయడం, అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడం వంటి పనుల్లో బినామీల హవా కొనసాగుతోందన్నది బహిరంగ సత్యం. 

పక్కదారి పడుతున్నా.. 
జిల్లా నుంచి రేషను బియ్యం ఇతర జిల్లాలకు భారీ ఎత్తున తరలుతున్నాయనేది జగమెరిగిన సత్యం. ప్రజలకు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు పట్టుబడుతున్న బియ్యంతో వెళుతున్న వాహనాలే ఇందుకు నిదర్శనం. ప్రతినెలా వందల టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నా నిలువరించేందుకు పటిష్ట చర్యలు కరువయ్యాయి. కొన్ని చోట్ల పౌరసరఫరాల గోదాములు, మరికొన్ని చోట్ల డీలర్లే పెద్ద ఎత్తున పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈపాస్‌ విధానం అమలు చేయడంతో అక్రమాలకు అలవాటుపడిన వ్యక్తులు కొత్త విధానం అమలు చేస్తున్నారు. కార్డుదారులతో వేలిముద్రలు తీసుకొని వారికి కొంత ముట్టజెప్పి బియ్యం డీలర్లే తీసుకుంటున్నారు. వీటిని అక్రమ వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement