రాజన్నా మళ్లీ రా అన్నా

YSR First Sign as CM on Free Power - Sakshi

మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా..

ఎక్కడ ఏ ప్రమాదం చోటుచేసుకున్నా 
నేనున్నానంటూ ఆపద్బాంధవునిలా
కుయ్,కుయ్‌ రాగాలు తీస్తూ  
పరుగులు తీసే 108 ఏదన్నా!
పదివేల కోట్ల రూపాయల
ఆరోగ్యశ్రీ నిధులతో ఊపిరి పోసుకున్న 
నాలుగు లక్షల మంది ప్రాధేయపడుతున్నారు
రాజన్నా మళ్లీ రా అన్నా అని...

మెట్ట ప్రాంతంలో నలభై వేల కనెక్షన్లతో 
రూ. 21 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చి
ప్రజా ప్రస్థానంలో ఇచ్చిన మాటకు 
తొలి సంతకంతోనే వెలుగులిచ్చిన
రాజన్నా మళ్లీ రా అన్నా...

ప్రతి ఏటా వచ్చే వరదలకు అడ్డుకట్టేసి
రూ.600 కోట్లతో ఏటిగట్లను పటిష్టం చేసి
50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా
మీకేమీ భయం లేదంటూ ధైర్యాన్నిచ్చిన
రైతుబిడ్డా రావయ్యా మళ్లీ...

కాటన్‌ మహాశయుడి ఆశయం నీది
అందుకే వేశావు ప్రాజెక్టులకు పునాది
పైరుకు ప్రాణంపోసే బాధ్యత నాదంటూ
జిల్లా అంతటా జలసిరికి శ్రీకారం చుట్టిన
జలదాతా ... నీదేనయ్యా ఆ కీర్తి

ఆ ఆశయాల బాటలో జగనన్న సంకల్పం
ఆ అడుగులో అడుగేస్తోంది జన ప్రవాహం 
కుట్రదారుల గుండెల్లో భయ ప్రకంపం
రానున్న కాలంలో రానున్నది రాజన్న రాజ్యం
అందుకు కావాలి నీ ఆశీర్వాదం.

రాజన్న రాజ్యం కచ్చితంగా సంక్షేమ రాజ్యమే. రాష్ట్రం అభివృద్ధి సూచీని వైఎస్‌ ముందు వైఎస్‌ తరువాత అని చెప్పేంతగా సాగింది ఆ మహానేత పాలన. ప్రత్యేకించి జిల్లాకు ఆయన అభయ ప్రదాతగా.. అపర భగీరథుడిగా.. మరో కాటన్‌ మహాశయుడిగా ఖ్యాతి గడించారు. రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌గా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో అప్పటి వరకూ ఉన్న రైతు సమస్యల పరిష్కారానికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కాలువల ఆధునికీకరణ, గ్రోయిన్లు, కరకట్టల నిర్మాణం, కాలువ గట్ల పటిష్టానికి ఎంతో కృషి చేశారు. పంట పండినా పండకపోయినా ముక్కు పిండి బిల్లులు వసూలు చేసే విద్యుత్‌ అధికారులకు చెక్‌ పెడుతూ ఉచిత విద్యుత్‌ అందజేశారు. కోట్లాది రూపాయలు నష్టం వచ్చినా సరే వెనకడుగు వేయలేదు. అలాగే చిన్న వారికి పెద్ద జబ్బులు వచ్చిన సందర్భాల్లో ప్రాణాలపై ఆశలు వదులుకునే పరిస్థితి నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పునర్జన్మ ప్రసాదించారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. నేడు ఆ మహానేత తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆ శ్రేయోరాజ్యాన్ని స్మరించుకునే చిరు యత్నం.

అమలాపురం: గోదావరి డెల్టా.. రాష్ట్రానికి అక్షయపాత్ర. ఉభయ గోదావరి జిల్లాలకు రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని పేరొచ్చిందంటే అందుకు గోదావరి డెల్టానే కారణం. ఈ జిల్లాల్లో ఏకంగా 10.30 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు జరుగుతోంది. దీనిలో 8.96 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుంది. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ హయాంలో పురుడుపోసుకున్న డెల్టా తరువాత కాలంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అనంతరం చాలా కాలానికి డెల్టాతో పాటు జిల్లాలో కీలకమైన ఏలేరు, తాండవ, పంపా ప్రాజెక్టుల ఆధుకీకరణకు, ఏజెన్సీ రైతులకు మేలు చేసే భూపతిపాలెం, ముసురుమిల్లికి శంకుస్థాపన చేసింది కూడా వైఎస్సారే. 

రాష్ట్రానికి జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టుకు సైతం పునాది వేసింది వైఎస్సార్‌. ఆయన మృతి చెంది తొమ్మిదేళ్లు కావస్తున్నా.. జలయజ్ఞం పేరుతో ఆయన చేసిన పనులను ప్రతీ రైతు నేటికీ గుర్తుంచుకుంటూనే ఉన్నారు. 

ధవళేశ్వరంలో సర్‌ ఆర్థర్‌ కాటన్‌హయాంలో డెల్టా వ్యవస్థ రూపొందిన తరువాత పెద్ద ఎత్తున ఆధునికీకరణకు నిధులు కేటాయించింది వైఎస్సార్‌ ఒక్కరే. ఆ మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి 2008లో ఆధునీకరణ పనులకు ఆమోదముద్ర వేశారు. డెల్టా కాలువల ఆధునికీకరణ పెద్ద ఎత్తున సాగడం అనేది వైఎస్సార్‌ హయాంలో మాత్రమే జరిగింది.

 ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న కాలువ ఆధునికీకరణకు ఆయన రూ.3,361 కోట్లు కేటాయించారు. ఇందుకు సంబంధించి 2007 నవంబరు 27న జీవోనెం.258ని విడుదలైంది. దీనితో తూర్పుగోదావరి జిల్లాకు రూ.1,679.24 కోట్లు కేటాయించారు. జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని పంట కాలువలకు 1,170.21 కోట్లు, మురుగునీటి కాలవలకు రూ.485.65 కోట్లు కేటాయించారు. డెల్టాలో భాగంగా ఉన్న అన్నంపల్లి నూతన అక్విడెక్టుకు సైతం శంకుస్థాపన పడింది వైఎస్సార్‌ హయాంలోనే రూ.13 కోట్ల అంచనాతో దీనికి ఆయనే 2008లో శంకుస్థాపన చేశారు. ఆయన మృతితో నత్తనడకనసాగిన పనులు రూ.54 కోట్లతో పూర్తిచేశారు.

వైఎస్సార్‌ ఉండగా రూ.639.92 కోట్ల విలువైన ఐదు ప్యాకేజీలకు టెండర్లు ఖరారయ్యాయి. టెండర్లు ఖరారుకాని చోట కాలువలు అధ్వానంగా ఉన్నాయని రూ.9.01 కోట్లతో పూడికతీత పనులు చేపట్టారు. దీనితో శివారు ఆయకట్టుకు కొంత వరకు నీరందింది. ఆయన మృతి తరువాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలో కొంత వరకు పనులు జరిగాయంటే వైఎస్సార్‌ హయాంలో నిధులు కేటాయించడమే కారణం. బాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో డెల్టా ఆధునీకరణపై శీతకన్ను వేశారు. ఈ నాలుగేళ్లలో బడ్జెట్‌ కేటాయింపులు రూ.350 కోట్లు కాగా, దీనిలో 70 శాతం మాత్రమే అంటే రూ.245 కోట్ల పనులు మాత్రమే జరిగాయి.

∙మెట్టలో కీలకమైన ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు దివంగత నేత వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో రూ.138 కోట్ల అంచనాతో 2008 జూన్‌ 24న జీవో 569 విడదల చేశారు. మూడు ప్యాకేజీలుగా దీనిని విడదీశారు. కాలువల ఆధునికీకరణ, గట్ల పటిష్టం పనులున్నాయి. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో శంకుస్థాపన చేశారు. అయితే పనులు మాత్రం ఆరంభం కాలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏలేరు పనులు ఆరంభమయ్యాయి. రెండవ దశ పనులకు కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.168.24 కోట్లు మంజూరు చేశారు. 

మెట్టలోని సీతానగరం నుంచి తుని వరకు ఏడు మండలాలల్లో  సుమారు 1.87 లక్షల ఎకరాలకు సాగునీరందించే పుష్కర ఎత్తిపోతల పథకానికి పునాది పడింది. చంద్రబాబు హాయాంలో ప్రతిపాదనలకు మాత్రమే పరిమితం కాగా, వైఎస్సార్‌ జలయజ్ఞంలో సుమారు రూ.600 కోట్లతో పూర్తిచేయించారు. ఎన్నికల ముందు 2008లో యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీతో ప్రారంభింప చేశారు. దీని వల్ల సాగుకు యోగ్యంకాని 1.87 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది. 

ఏజెన్సీలో కీలకమైన భూపతిపాలెం ప్రాజెక్టు దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో జలయజ్ఞంలో భాగంగా 2007లో ఆరంభమైంది. దీని తొలి అంచనా వ్యయం రూ.47.23 కోట్లు కాగా, పూర్తయ్యేనాటికి రూ.160.63 కోట్లకు చేరింది. అదే విధంగా ముసురుమిల్లి ప్రాజెక్టుకు సైతం 2007లో దివంగత నేత వైఎస్సార్‌ నిధులు కేటాయించారు. దీని తొలి అంచనా రూ.207 కోట్లు. ఇప్పటివరకు రూ.54 కోట్లు ఖర్చుపెట్టారు. దీనిలో 50 కోట్లు వైఎస్సార్‌ హాయాంలోనే ఖర్చుపెట్టారు. నాలుగేళ్లలో చంద్రబాబు రూ.4 కోట్లు మంజూరు చేశారు. ఇంకా 15 శాతం పనులు చేయాల్సి ఉంది. 

ఇప్పటికే పోలవరం పూర్తయ్యేది
దివంగత మహానేత ఉండి ఉంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తయ్యేది. ఆయన హయాంలో జలయజ్ఞం పేరుతో జిల్లాలో కొత్త ఆయకట్టుకు నీరిచ్చారు. ఉన్న ఆయకట్టును స్థిరీకరించారు. ఆయన తరువాత ఎవరి హయాంలోను కొత్తగా ప్రాజెక్టు అనేది లేకుండా పోయింది. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తను తలపిస్తుంటే.. ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. వైఎస్సార్‌ లాంటి నాయకుడు మళ్లీ రావాలని రైతులు కోరుకుంటున్నారు.
– జున్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, నంగవరం, ఉప్పలగుప్తం మండలం.

ఉచిత విద్యుత్‌తో ఉపశమనం
రైతు పక్షపాత సీఎంగా వైఎస్సార్‌ తొలి సంతకం 
 జిల్లాలోని మొట్ట ప్రాంత రైతులకు వరం 
 39,801 వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌

సాక్షి, రాజమహేంద్రవరం:  అప్పటి వరకు తీవ్రమైన కరువు, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు, పంటలు లేవు, అప్పులు.. మరో వైపు విద్యుత్‌ బిల్లులు కట్టాలంటూ అధికారుల ఒత్తిళ్లు, బకాయిల వసూళ్లకు వాహనాలపై గ్రామాల్లో తిరుగుతూ హల్‌చల్‌. విద్యుత్‌ బకాయిలు కట్టే ఆర్థిక స్థోమతలేక, అందరి ముందు తలదించుకునే రైతన్నకు ఆశాదీపంలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ పథకం నిలిచింది.

 2003లో ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో మండుటెండలో తాను చేసిన పాదయాత్రలో కళ్లకు కట్టిన రైతన్నల కష్టాలు, నష్టాలను దృష్టిలో పెట్టుకుని దేశానికి అన్నం పెట్టే రైతన్నకు చేయూతగా వైఎస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే వ్యవసాయానికి ‘ఉచిత విద్యుత్‌’ ఇస్తూ ‘తొలి సంతకం’ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచిత్‌ విద్యుత్‌ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ప్రస్తుత సర్కారు జిల్లాలోని నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నా.. రైతుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో ఆ  నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. గోదావరి డెల్టా మినహా మెట్ట ప్రాంతంలో బోర్ల ద్వారానే వ్యవసాయం సాగుతోంది.

 జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, పెద్దాపురం, పిఠాపురం, అనపర్తి, రాజానగరం తదితర నియోజకవర్గాల్లోని దాదాపు 18 మండలాల్లో బోర్ల ఆధారంగానే వ్యవసాయం సాగవుతోంది. ఉచిత విద్యుత్‌ వల్ల ఆయా మండలాల్లోని రైతులు లబ్ధి పొందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 39,801 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి నెలకు 41.8 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉపయోగిస్తున్నారు. ఫలితంగా నెలకు దాదాపు రూ.21 కోట్లు బిల్లు వస్తోంది. ఉచిత విద్యుత్‌ వల్ల ఈ మొత్తం భారం రైతులపై పడకపోవడంతో వారికి ఎంతగానో మేలు జరుగుతోంది. పంట పండినా, ఎండినా 2003కు ముందు విద్యుత్‌ బిల్లు కట్టాల్సిందే. ఉచిత విద్యుత్‌ పథకం వచ్చిన తర్వాత రైతులకు ఆ ఆందోళన నుంచి విముక్తి కలిగింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top