నేనున్నానని భరోసానిచ్చిన జగన్‌..

YS Jagan Election Campaign In Srikakulam District - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, శ్రీకాకుళం: ‘నెలన్నర రోజుల పాటు ప్రజాసంకల్పయాత్రలో మీ కష్టాలు కళ్లారా చూశాను. మీరు చెప్పుకున్న బాధలు విన్నాను. కిడ్నీ బాధితులు వేల సంఖ్యలో ఉంటే కేవలం 370 మందికే పెన్షన్లు ఇస్తున్నారని.. ముష్టి వేసినట్టు రూ.2,500లే చెల్లిస్తున్నారని.. 1400 మందికి మాత్రమే డయాలసిస్‌ చేస్తున్నారని, తామెలా బతకాలన్న ఆవేదన విన్నాను. అన్నా.. రాష్ట్రంలోనూ, దేశంలోనూ జీఎస్టీ ఉంటుందని విన్నాం.. పలాసలో జీడిపప్పు ప్యాకెట్టుపై టీఎస్‌టీ (తెలుగుదేశం సర్వీస్‌ టాక్స్‌) వేస్తున్నారని చెప్పి బాధపడ్డారు. భావనపాడు పోర్టు వల్ల మాకేమి మేలు జరుగుతుందన్న స్వరం విన్నాను. పోర్టుతో పాటు మత్స్యకారులకు హార్బ ర్‌ కట్టాలని, స్థానికులకు ఉద్యోగాలు రావాలని, భూములు కోల్పోతున్న వారికిచ్చే పరిహారం తక్కువని చెప్పారు.

తిత్లీ పరిహారం రైతులకు ఇంకా సక్రమంగా అందలేదని, ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాలేదని విన్నాను. జీడితోటలకిచ్చే రూ. 30 వేల పరిహారం తక్కువని, కొబ్బరిచెట్టుకు రూ.1,500లే ఇస్తున్నారని మీరు చెప్పిన ఆవేదనను ఓపిగ్గా విన్నాను... మీరేమీ అధైర్య పడకండి.. మీ అందరికీ నేనున్నాను. మీకు అండగా ఉంటాను.’ అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిక్కోలు వాసులకు, ముఖ్యంగా కిడ్నీ, తిత్లీ తుపాను బాధితులకు భరోసా ఇచ్చారు. శనివారం జిల్లాలోని పలాసలో తొలి ఎన్నికల సభలో ఆయన కిక్కిరిసిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేవుని దయ, మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన మూడు నెలలు తిరక్కముందే ఉద్దానానికి 200 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూ రు చేస్తానని ప్రకటించారు. అంతేకాదు.. మంచి డాక్టర్లు, నెఫ్రాలజిస్టులను నియమించి కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలోనే ట్రీట్‌మెంట్‌ చేయించి ఉచిత మందులు అందజేస్తానని చెప్పారు.

జగన్‌ హామీలకు హర్షధ్వానాలు
‘మీకు అన్నిరకాలుగా తోడుగా ఉంటా. కిడ్నీ బాధితుల పెన్షను రూ.10 వేలకు పెంచుతానని చెబు తున్నా. ఈ రోగాలెందుకు వస్తున్నాయంటే తాగే నీరు బాగులేక అంటున్నారు. అందుకని కాలువ ద్వారా మంచి నీటిని రప్పించి అందిస్తా.. జీడితోటలకు ఎకరానికి రూ.30 వేలకు బదులు 50 వేలు, కొబ్బరిచెట్టుకు రూ.3 వేల చొప్పున పరిహారాన్ని పెంచుతా’ అని జగన్‌ ఇచ్చిన హామీకి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు పలికారు. శనివారం ఇటీవల ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో భానుడు భగభగలాడాడు. ఉదయం 9 గంటల నుంచే పలాస జంక్షన్‌ జనంతో నిండిపోయింది. హెలికాప్టర్‌లో పలాస చేరుకున్న జగన్‌ మధ్యాహ్నం 12 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. 39 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. అంతసేపూ జనం కదలకుండా ఎండలోనే నిల్చుని జననేత ప్రసంగాన్ని ఎంతో ఆసక్తితో విన్నారు. ఆయన హామీలిస్తుంటే కరతాళధ్వనులు  చేశారు. వైఎస్సార్‌సీపీ పలాస అసెంబ్లీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానం అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన జగన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవల జననేత జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా బ్రహ్మరథం పట్టిన సిక్కోలు వాసులు ఎన్నికల సభలోనూ అంతే స్థాయిలో ఆదరించి మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు.  

చేరికల జోరు
వజ్రపుకొత్తూరు/ కాశీబుగ్గ/ వజ్రపుకొత్తూరు రూరల్‌: పలాస బహిరంగ సభలో టీడీపీ, బీజేపీల నుంచి పలువురు ముఖ్య నేతలు వైఎస్సార్‌సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరిలో వజ్రపుకొత్తూరు రిటైర్డ్‌ న్యాయమూర్తి, జెడ్పీటీసీ సభ్యురాలు, వైశ్య సంఘం నాయకులు ఉన్నారు. వజ్రపుకొత్తూరు జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పరపల్లి నీలవేణి (టీడీపీ), మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్, పలాస వైశ్యసంఘం అధ్యక్షుడు, చార్టెడ్‌ అకౌంటెంట్‌ పి.వి.సతీష్, శైలజారెడ్డి, పలాస నియోజకవర్గ యాదవ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాపాక చిన్నారావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దువ్వాడ ఉమామమేశ్వరరావు, సీనియర్‌ ఓబీసీ మోర్చా స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌  తమ్మినేని మాధవరావు, పలాస మండల బీజేపీ అధ్యక్షుడు కంచరాన భాస్కరరావు,  కంచరాన బుజ్జి, పలాస–కాశీబుగ్గ టీడీపీ 13వ వార్డు కైన్సిలర్‌ సైన కవిత వల్లభరావు, మాజీ సర్పంచ్‌ సాన కృష్ణ, గేదెల నీలకంఠంతోపాటు 50మంది వరకు పార్టీలో చేరారు. 

పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జయమణి..
పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే సరవరపు జయమణి వైఎస్సార్‌సీపీలో చేరారు. విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చిన్న శ్రీను ఆధ్వర్యంలో చేరిన ఆమెకు వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు.

విశ్రాంత న్యాయమూర్తి చేరిక
టెక్కలి: టెక్కలికి చెందిన విశ్రాంత న్యాయమూర్తి గౌడ గోవింద కేశవరావు శనివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. పలాసలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ కిల్లి కృపారాణి, ఆమె భర్త కె.రామ్మోహన్‌రావు  ఆధ్వర్యంలో విశ్రాంత జడ్జి కేశవరావు వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. గోవింద కేశవరావు ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

టీడీపీ సీనియర్‌ నాయకుడు శ్యామ్‌సుందరరావు..
పాతపట్నం:వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పలాసలో రెడ్డిశాంతి ఆధ్వర్యంలో పాతపట్నం టీడీపీ సినియర్‌ నాయకుడు, మాజీ ఎంపీపీ, జిల్లా సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్, పాతపట్నం పీఏసీఎస్‌ అధ్యక్షుడు మిరియబెల్లి శ్యామ్‌సుందరరావు శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. గుంటూరుకు చెందిన  హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ బాబూ ఖాన్‌ పార్టీలో చేరారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top