వర్మను నిర్బంధించడాన్ని ఖండిస్తున్నాం: వైఎస్‌ జగన్‌

YS Jagan Condemns AP Govt Denying Press meet Of Ram Gopal Varma - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మను పోలీసులు  అక్రమంగా నిర్బంధించడాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు సిద్ధమైన రాంగోపాల్‌ వర్మను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. వర్మను ప్రెస్‌మీట్‌ పెట్టకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడం  ప్రజాస్వామ్య వ్యతిరేకమన్నారు. పౌరుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. 

శాంతిభద్రతల పేరుతో వర్మ, రాకేశ్‌రెడ్డిలను బలవంతంగా గన్నవరం విమానాశ్రయానికి తరలించి లాంజ్‌లో నిర్బంధించిన విషయం తెలిసిందే. కాగా తనను అక్రమంగా అడ్డుకోవడంపై రామ్‌గోపాల్‌ వర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత పౌరుడిగా ప్రెస్‌మీట్‌ పెట్టుకునే హక్కు తనకు ఉందని.. దీనిపై లీగల్‌గా పోరాడుతానని వర్మ అన్నారు. రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రాన్ని మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top