న్యాయం కోసం యువతి దీక్ష

Young Woman Protest For her Boy Friend In Chittoor - Sakshi

మదనపల్లె : ప్రేమించానని వెంట పడ్డాడు. నువ్వు లేకపోతే చచ్చిపోతానన్నాడు. పెళ్లి చేసుకుంటా నని నమ్మించి కొన్నాళ్లు సహజీవనం చేశాడు. ఇప్పుడు కులం తక్కువని పేర్కొంటూ మరో పెళ్లికి సిద్ధపడ్డాడు. న్యాయం చేయండి’ అని ములకలచెరువు మండలం నాయునిచెరువు మండలం దాసిరెడ్డిగారిపల్లెకు చెందిన గూడుపల్లె నారాయణ కుమార్తె విజయ వేడుకుంది. ఆమె శుక్రవారం మాలమహానాడు ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఆమె మాట్లాడుతూ ఎస్సీ(మాల) కులానికి చెందిన తాను మదనపల్లెలో చంద్రాకాలనీ గురుకుల కళాశాలలో ఇంటర్‌ చదువుతుండగా దేవప్పకోట కు చెందిన సుబ్బయ్య కుమారుడు పురుషోత్తం ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడని తెలిపింది. అతని మాటలు నమ్మి తాను కూడా ప్రేమించినట్టు పేర్కొంది.

తనకు ఇంటిలో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో పురుషోత్తం పెళ్లి చేసుకుంటానని చెప్పి తిరుపతి తీసుకెళ్లాడని తెలిపింది. తన తల్లి దండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేస్తే పురుషోత్తం బాబాయి ఆదినారాయణ ఇద్దరినీ తీసుకువచ్చి పీటీఎం పోలీస్‌స్టేషన్‌లో హాజరుపరిచారని పేర్కొంది. ఆ సమయంలో పోలీసులు మైనారిటీ తీరిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పి పంపించేశారని తెలిపింది. తర్వాత ఇద్దరమూ 2017 నవంబర్‌ వరకు మదనపల్లెలో సహజీవనం చేస్తూ పీజీ చదువు పూర్తిచేశామని వివరించింది. ఎప్పుడూ పెళ్లి ప్రస్తావన తేకపోవడంతో తాను ఇంటికి వెళ్లిపోతానని చెప్పడంతో గదిలో తాడుతో బంధించి ఉరి వేసుకుని చనిపోయేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. 

పరువు పోతుందని..
తక్కువ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని పురుషోత్తం బాబాయి ఆదినారాయణ బలవంతంగా పురుషోత్తంను ఇంటికి తీసుకెళ్లిపోయాడని తెలిపింది. ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా కులం తక్కువ దాన్ని పెళ్లి చేసుకునేది లేదని, ఈ విషయాన్ని మరచిపోకపోతే చంపేస్తామని బెదిరించారని వాపోయింది. ప్రస్తుతం అతడికి వేరే పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైంది. మాలమహానాడు జాతీయ కార్యదర్శి యమలా సుదర్శనం, జిల్లా ఉపాధ్యక్షుడు యమలా సుదర్శనం, గుండా మనోహర్‌ మాట్లాడుతూ ఎస్సీ కులానికి చెందిన యువతిని మోసగించడంపై ఈ నెల 12వ తేదీన డీఎస్పీ చిదానంద రెడ్డికి ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసులు పట్టించుకోలేదన్నారు. పురుషోత్తంకు కౌన్సెలింగ్‌ ఇప్పించి పెళ్లికి ఒప్పించాలని, లేని పక్షంలో పురుషోత్తం, అతని బాబాయి ఆదినారాయణపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదుచేయాలని డిమాండ్‌ చేశారు. నిరాహారదీక్షలో పాల్గొన్న వారిలో యమలా చంద్రయ్య, కోన భాస్కర్, చింతపర్తి ప్రదీప్, పతి, జిల్లా శివ, నరేష్, సునీల్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top