జీవన్మరణ సమస్య!

Wild Animals Deaths With Water Shortage in Forest - Sakshi

నీటి జాడ కోసం వచ్చి..మృత్యువాత పడుతున్నవన్యప్రాణులు

పట్టించుకోని అటవీ శాఖాధికారులు

జిల్లా విస్తీర్ణం: 5,837 చదరపు కిలోమీటర్లు

అటవీ విస్తీర్ణం: 616 చదరపు కిలోమీటర్లు

అటవీ ప్రాంతం: 70,350 హెక్టార్లు

జిల్లాలో అడవుల శాతం: 10.55

అటవీ రేంజ్‌లు: 5(శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి, పాతపట్నం, కాశీబుగ్గ)

శ్రీకాకుళం, వీరఘట్టం: జిల్లాలో ఏటా వేసవిలో వన్యప్రాణులకు జీవన్మరణ పోరాటం తప్పడం లేదు. ఇవే అడవుల్లో గత కొన్నేళ్లుగా సంచరిస్తున్న ఏనుగులు.. దాహార్తిని తీర్చుకునేందుకు మైదాన ప్రాంతాలకు వచ్చినప్పుడు వీటి వల్ల ప్రజలకు ముప్పు తప్పడంలేదు. ఇటువంటి వింత పరిస్థితుల మధ్య వన్యప్రాణులు మత్యువాత పడుతుంటే.. ఏనుగుల గుంపు వల్ల ప్రాణ భయంతో పాటు ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా వన్యప్రాణులకు నీటి వసతి కల్పిం చడంలో అటవీశాఖ నిర్లక్ష్యం వహించడంతో జాతీ య సంపద అంతరించిపోతోంది. ప్రస్తుతం వేస వి సమీపిస్తున్న తరుణంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా వేసవి తాపంతో దుప్పులు, జింకలు, అడవి పందులు దాహార్తిని తీర్చుకునేందుకు మైదాన ప్రాంతాలకు వచ్చి తరుచూ మత్యువాత పడుతున్నాయి. అలాగే వేటగాళ్ల తూటాలకు బలైపోయిన ఘటనలు ఉన్నాయి. వన్యప్రాణులు నిలయమైన వీరఘట్టం మండలం తూడి, వండువ కొండల్లో వీటి సంరక్షణకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడం కూడా మరో కారణంగా పేర్కొనవచ్చు.

రూ.1.62 కోట్లు వృథా
జంతువుల దాహార్తిని తీర్చేందుకని గతేడాది జిల్లా వ్యాప్తంగా రూ.1.62 కోట్లతో 55 కిలోమీటర్లు పొడవునా అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వా రు. అయితే వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ప్రజలు చెబుతున్నారు. వేసవిలో ఎండల తీవ్రతకు నదులు, గెడ్డలు, పెద్ద పెద్ద జలపాతాలే ఎండిపోతుంటే కందాకాల్లో నీరు ఎంతవరకు నిల్వ ఉంటుందనేది వారి వాదన. ఈ పరిస్థితుల్లో నీటి సౌలభ్యత లేక మైదాన ప్రాంతాలకు వస్తున్న మూగజీవాలు బలైపోతున్నాయి. మరోవైపు జిల్లా విస్తీర్ణం 5,837 చదరపు కిలోమీటర్లు కాగా.. ఇందులో అటవీ విస్తీర్ణం 616 చదరపు కిలోమీటర్లు. దీనిలో 70,350 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి భూభాగంలో 33 శాతం అడవులు ఉంటే అక్కడ ప్రకృతి సంపదతో పాటు మానవాళి మనుగడకు ఎటువంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే జిల్లాలో మాత్రం అడవులు కేవలం 10.55 శాతం మాత్రమే ఉన్నాయి. ఫలితంగా అడవుల విస్తీర్ణం తగ్గుతుండడంతో వన్యప్రాణులు మృతి చెందుతుండగా, ఏనుగుల భయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పై గణాంకాల ప్రకారం అటవీ సంపదను మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

ఇదీ పరిస్థితీ...
జిల్లాలోని పాతపట్నం–టెక్కలి అటవీ ప్రాంతంలో ఎక్కువగా దుప్పి, జింక, గొండగొర్రె, కొండ మేక ఇలా నాలుగు రకాల జింకలు ఉన్నాయి. పాతపట్నంనకు సమీపంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎక్కువగా దుమ్మలగుండు(తోడేళ్లు) సంచారం ఉంది. అలాగే ఇదే అటవీ రేంజ్‌లో రేసు కుక్కల సంచారం కూడా ఉంది. మొళియాపుట్టి మండలం జాడుపల్లి అటవీ ప్రాంతంలో కనుజులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. అలాగే వీరఘట్టం మండలంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తూడి, వండువ కొండల్లో వందలాది వన్యప్రాణులు ఉన్నాయి. దుప్పి, అడ వి పందుల గుంపులు ఎక్కువగా ఉన్నాయి. ఇవి సమీపంలో ఉన్న జీడి తోటలు, వరి చేలల్లో ఆహా రం కోసం తరుచూ వస్తుంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో కొండలపైనే ఉన్నా.. వేసవి వచ్చిం దంటే మైదాన ప్రాంతాలకు నీటి కోసం వస్తుంటాయి. ఇటువంటి సమయాల్లో కొంతమంది వేటగాళ్లు మాటు వేసి, వన్య ప్రాణులను ప్రాణాలను హరిస్తున్నారు.

గత నాలుగేళ్లలో...
2014లో వీరఘట్టం మండలం బొడ్లపాడు సమీపంలోని తోటల్లో వరి కంకులు తినడంతో దుప్పి మృతి చెందింది.
2015 నవంబర్‌లో తూడి తోటలో వరి కంకులు తిని, నీరందక మరో దుప్పి మృతి చెందింది. ఇవన్నీ స్ధానికులు గుర్తించినప్పుడు బయటపడినవి. అదే ఏడాది అడారులో మర్రి చెట్టు తొర్రలో నాటు బాంబులు కలకలం రేపాయి. ఈ నాటు బాంబులు వన్యప్రాణుల వేటకేననే అరోపణలు వ్యక్తమయ్యాయి.
2016 మార్చి 30న తలవరంలో దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చిన ఓ జింక కుక్కల బారినపడి గాయాల పాలయ్యింది. పరిస్థితిని గమనించిన గ్రామస్తులు జింకను రక్షించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
2017 ఏప్రిల్‌ 4న తూడి కొండ నుంచి దాహార్తి కోసం మైదాన ప్రాంతానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో దుప్పి మృత్యువాత పడింది.
అదే ఏడాది పాతపట్నం, మొళియాపుట్టి, సారవకోట ప్రాంతాల్లో అనేక దుప్పులు మృతిచెందాయి.
2018లో మొళియాపుట్టి వద్ద ఓ ఎలుగుబంటి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది.
పాతపట్నం మండలం జోడికొండ నుంచి దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పి మృతి చెందింది.

కందకాల వల్ల ఎద్దడి తగ్గుతుంది
గతేడాది కొండ ప్రాంతాల్లో తవ్విన కందకాలలో చాలా చోట్ల నీటి తడులు చేరాయి. వీటి వల్ల వన్య ప్రాణులకు వేసవిలో దాహార్తి తీరుతుంది. ఏనుగులు సంచారంపై అప్రమత్తంగా ఉన్నాం. తూడి–వండవ కొండల్లో నీటి తొట్టెల ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం.– డి.జగదీష్, అటవీశాఖ రేంజ్‌ అధికారి, పాలకొండ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top