కలెక్టర్ చొరవతో మహిళకు విముక్తి | West Godavari women rescued from bahrain | Sakshi
Sakshi News home page

కలెక్టర్ చొరవతో మహిళకు విముక్తి

Jun 17 2014 5:31 PM | Updated on Sep 2 2017 8:57 AM

నాగేశ్వరి, ఆమె తల్లిదండ్రులతో అధికారిణి సూర్య చక్రవేణి

నాగేశ్వరి, ఆమె తల్లిదండ్రులతో అధికారిణి సూర్య చక్రవేణి

బహ్రెయిన్ దేశంలోని ఓ ఇంట్లో పని చేయడానికి వెళ్లి అక్కడ చిత్రహింసలకు గురవుతున్న ఓ మహిళ కలెక్టర్ చొరవతో స్వగ్రామానికి తిరిగి వచ్చింది.

ఏలూరు: బహ్రెయిన్ దేశంలోని ఓ ఇంట్లో పని చేయడానికి వెళ్లి అక్కడ చిత్రహింసలకు గురవుతున్న ఓ మహిళ కలెక్టర్ చొరవతో స్వగ్రామానికి తిరిగి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన జల్లిపల్లె ధర్మారావు, సత్యవతి దంపతుల కుమార్తె నాగేశ్వరిని జంగారెడ్డిగూడేనికి చెందిన వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. మద్యానికి బానిసైన అతడు నాగేశ్వరిని పట్టించుకోకపోవడంతో ఐదేళ్ల కిందట పుట్టింటికి వచ్చేసింది.

విదేశాలలో ఉపాధి అవకాశాలు ఎక్కువని, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చెప్పిన ఏజెంట్లను నమ్మి వారి ద్వారా బహ్రెయిన్ దేశం వెళ్లింది. అక్కడ మూడు, నాలుగు ఇళ్లలో పనిచేసింది. అన్నిచోట్లా చిత్రహింసలు అనుభవించింది. రెండు నెలల కిందట ఆమె తాను అనుభవిస్తున్న ఇబ్బందులను ఫోన్‌ద్వారా తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు తమ కుమార్తెను రక్షించి తీసుకురావాలని గణపరం పోలీసులను ఆశ్రయించారు. సుమారు 50 రోజులపాటు స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో 10 రోజుల కిందట కలెక్టర్ సిద్ధార్థజైన్‌ను ఆశ్రయించారు.

స్పందించిన కలెక్టర్ ఆ మహిళను జిల్లాకు తీసుకొచ్చే బాధ్యతను జిల్లా బాలల సంరక్షణ అధికారి సీహెచ్ సూర్యచక్రవేణికి అప్పగించారు. దీంతో ఆమె నాగేశ్వరిని బహ్రెయిన్ పంపిన ఏజెంట్లను ఏలూరు పిలిపించి మాట్లాడారు. ఆమెను తక్షణమే జిల్లాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయూలని ఆదేశించారు. దీంతో ఇక్కడి ఏజెంట్లు బహ్రెయిన్‌లోని ఏజెంట్లతో సంప్రదించి ఆమెను రప్పించారు.

ముంబై వచ్చిన ఆమె అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడ భిక్షాటన చేసుకోవడం మొదలుపెట్టింది. ముంబైకి చెందిన కొందరు ఆమెను హైదరాబాద్ పంపించారు. అక్కడినుంచి ఏలూరు చేరుకున్న నాగేశ్వరిని సోమవారం జిల్లా బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఆమెను బహ్రెయిన్ పంపించిన ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement