
సాక్షి, నెల్లూరు : కాశీలో చిక్కుకున్న నెల్లూరు యాత్రికులను వెనక్కు తీసుకు వస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి అధికారులతో ఎస్‌పీ భాస్కర్ మాట్లాడుతున్నారని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్యల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడిలో అధికార యంత్రాగం అద్భుతంగా పని చేస్తోందన్నారు. అందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరోనా కట్టడికి తన మూడు నెలల జీతాన్ని సాయంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
కాగా, నెల్లూరు నుంచి తీర్థయాత్రల కోసం కాశీ వెళ్లిన నెల్లూరీయులు.. లాక్‌డౌన్‌లో చిక్కుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని చిన్న బజార్‌కు చెందిన వారు 15 రోజుల క్రితం ఉత్తరాది పర్యటనకు వెళ్లారు. కాశీలో శ్రీ విశ్వనాథుని దర్శనం తర్వాత నెల్లూరుకు తిరిగి రావాల్సి ఉంది. తిరుగు ప్రయాణం కోసం రైల్ టికెట్స్ రిజర్వ్ చేయించుకున్నారు. లాక్ డౌన్ వల్ల రైళ్లు రద్దు కావడంతో అక్కడే చిక్కుకు పోయారు. ప్రస్తుతం మరో 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో తమను ఆడుకోవాలని కోరుతున్నారు.