
రాజకీయంగానూ పోరాడాలి
కృష్ణా జలాల పంపకంపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై రాజకీయ పోరాటం చేయాలని రాష్ర్టంలోని వివిధ రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి.
సాక్షి, హైదరాబాద్:కృష్ణా జలాల పంపకంపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై రాజకీయ పోరాటం చేయాలని రాష్ర్టంలోని వివిధ రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఒకపక్క న్యాయపరమైన పోరాటం చేస్తూనే మరోవైపు రాజకీయంగా కూడా ఒత్తిడి తీసుకురావాలని సూచించారుు. అం దులో భాగంగా ప్రధానమంత్రి వద్దకు అఖిల పక్ష బృందం వెళ్లి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారుు. ట్రిబ్యునల్ తీర్పు రాష్ర్టంపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నందున ఇది అమల్లోకి రాకుండా సుప్రీం కోర్టు ద్వారా ప్రభుత్వంతో పాటు వివిధ పార్టీలు, రైతు సం ఘాల ప్రతినిధులు కూడా న్యాయపరమైన పోరాటానికి సిద్ధం కావాలని పార్టీల నేతలు నిర్ణయించారు. పార్టీలు, రైతుసంఘాల పోరాటానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.
అలాగే ప్రధాన మంత్రి వద్దకు అఖిల పక్ష బృం దాన్ని తీసుకెళ్లే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయాలపై మరింత స్పష్టతకు వచ్చేందుకు త్వరలోనే మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న ట్రిబ్యునల్ తీర్పుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీ సుదీర్ఘంగా సుమారు నాలు గు గంటల పాటు కొనసాగింది. ప్రభుత్వంతో పాటు ఆయా పార్టీల ప్రతినిధులు తమ ఆందోళనను, అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
టిబ్యునల్‌లో రాష్ట్రం తరఫున విన్పించిన వాదనలు, తీర్పులోని ప్రధాన అంశాలను సీనియర్ న్యాయవాది సుదర్శన్‌రెడ్డి వివరించారు. మంత్రులు సుదర్శన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కె పార్థసారథిలతో పాటు కోదండరెడ్డి, మండలి బుద్ధప్రసాద్ (కాంగ్రెస్), కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖరరెడ్డి ( టీడీపీ), కొణతాల రామకృష్ణ, శోభా నాగిరెడ్డి ( వైఎస్సార్ కాంగ్రెస్), విద్యాసాగర్‌రావు, వినోద్‌కుమార్ (టీఆర్‌ఎస్), కె.నారాయణ, గుండా మల్లేశ్, రామకృష్ణ (సీపీఐ), బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, మల్లారెడ్డి (సీపీఎం), నాగం జనార్దన్‌రెడ్డి, శేషగిరిరావు (బీజేపీ), జయప్రకాశ్ నారాయణ (లోక్‌సత్తా), ఎస్‌ఏహెచ్ జాఫ్రీ (ఎంఐఎం), నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శులు ఆదిత్యనాథ్‌దాస్, అరవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అఫిడవిట్ ఇవ్వకపోతే ప్రాజెక్టులు నిలిచిపోయేవి
ప్రభుత్వం తరఫున సరైన వాదనలు వినిపించకపోవడం వల్ల నే ఈ తీర్పు వచ్చిందనే అభిప్రాయం సమావేశంలో పాల్గొన్న పలువురు సభ్యులు వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో ట్రిబ్యునల్‌కు ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ వల్లనే నష్టం జరిగిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై న్యాయవాది సుదర్శన్‌రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చినట్టు సమాచారం. వరద జలాల ఆధారంగా మనం చేపడుతున్న ప్రాజెక్టులపై 1997లోనే కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, దాంతో 2000వ సంవత్సరంలోనే కోర్టు మనకు వ్యతిరేకంగా ఉత్తర్వులను జారీ చేసిందని తెలిపారు. ఈ ఉత్తర్వుల కారణంగానే ట్రిబ్యునల్‌కు అఫిడవిట్‌ను ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు. సీఎం, మంత్రులు సైతం అప్పుడు అఫిడవిట్ ఇవ్వకపోతే ప్రా జెక్టులను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి వచ్చేదని స్పష్టం చేశారు. తీర్పుపై భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సీనియర్ న్యాయవాదులతో సమగ్రంగా చర్చిం చిన తర్వాత నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారు.
అందుకోసం త్వరలోనే మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అరుుతే ప్రధాని వద్దకు అఖి లపక్షాన్ని తీసుకెళ్లాలనే డివూండ్‌ను టీఆర్‌ఎస్ వ్యతిరేకిం చింది. కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాక వేర్వేరుగా తవు వాదనలను వినిపించుకోవచ్చునని అభిప్రాయుపడింది, సుప్రీంకోర్టులో పార్టీల తరఫున, రైతు సంఘాల ప్రతినిధుల తరఫున కూడా పోరాడాలనే అభిప్రాయం వ్యక్తం అయింది. రాష్ర్ట ప్రభుత్వం 2011 మార్చి 28వ తేదీన సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన విషయాన్ని సీఎం వివరించారు. ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండా ఉండటం కోసం దాన్ని గెజిట్‌లో ప్రచురించకూడదంటూ 2011 సెప్టెంబర్ 16న స్టే ఇచ్చిన విషయం తెలియజేశారు. అందువల్ల ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యే వారికి న్యాయపరమైన మద్దతును ఇస్తామని ప్రకటించారు. సమావేశంలో ప్రధానంగా ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు, నీటి లభ్యత కోసం ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబిలిటీని పరిగణనలోకి తీసుకోవడం, నీటి ప్రవాహాన్ని అంచనా వేయడానికి కేవలం 47 ఏళ్ల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, వరద నీటిపై రాష్ర్టం చేపట్టిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించకపోవడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. సమావేశానంతరం పార్టీల ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు.
సుప్రీంలో సవాల్ చేస్తే మేం ఇంప్లీడ్ అవుతాం: శోభానాగిరెడ్డి
కృష్ణానది మిగులు జలాలకు సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పువల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేయాల్సిందిగా సీఎంకు సూచించినట్లు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని కోరామన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఆ విధంగా తీర్పు ఇచ్చిందని శోభానాగిరెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులు చూపించి మిగులు జలాల్లో వాటా తీసుకుంటే, మన రాష్ట్రం మాత్రం పూర్తిగా విఫలమైందన్నారు. ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబులిటీ ఆధారంగా నీటి కేటాయింపులు చేసినందున రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లిందని, సంప్రదాయం ప్రకారం 75 శాతం ఆధారంగా కేటారుుంపుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిందిగా సీఎంను కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం వేసే కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంప్లీడ్ అవుతుందని చెప్పామన్నారు.
రాజకీయ ప్రయోజనాలపైనే టీడీపీకి ఆసక్తి
ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలపైనే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లుందని ఆమె వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ సందర్భంలో లేఖ ఇవ్వాల్సి వచ్చిందో తెలిసి కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. అఖిలపక్ష సమావేశంలో కూడా టీడీపీ ఆ లేఖ విషయం ప్రస్తావించిందని, ఆ పార్టీకి అధికార ప్రతినిధిలా మారిన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అందుకు వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు.
‘వాస్తవానికి 1997లో కృష్ణా మిగులు జలాలపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై వాదోపవాదాలు జరిగాక 2000లో మిగులు జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు హక్కు లేదంటూ తీర్పు వచ్చింది. అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పిన అంశాలనే రాజశేఖరరెడ్డి లేఖలో పొందుపరిచారు తప్ప అదనంగా మరేమీ చేర్చలేదు. అప్పుడు వైఎస్ ఆ విధంగా చేయకపోతే మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయేవి. జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినప్పుడు, తప్పనిసరి పరిస్థితిల్లోనే లేఖ ఇవ్వాల్సి వచ్చింది..’ అని శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో వైఎస్ తప్పుగా వ్యవహరించ లేదని ప్రస్తుత ప్రభుత్వ న్యాయవాది కూడా అఖిలపక్షంలో స్వయంగా వివరించినట్లు తెలిపారు.