క్రూరత్వం బుస కొట్టిన చోటే.. కేరింతల కెరటాల హోరు

Visakhapatam People Grand Welcomes To YS Jagan - Sakshi

ఉద్విగ్న క్షణాల నడుమ జననేత ఆగమనం

విమానాశ్రయంలో జగన్‌కు బ్రహ్మరథం

హత్యాయత్నం అనంతరం తొలిసారిగా విశాఖ రాక

మూడు గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకున్న శ్రేణులు

జై జగన్‌ అంటూ మిన్నంటిన నినాదాలు

కిక్కిరిసిన అభిమానులతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

భారీ బందోబస్తు నడుమ సంకల్పయాత్రకు పయనం

దీపావళి వెళ్లి నాలుగు రోజులైందో లేదో.. విశాఖలో వేలాది మంది కళ్లలో మరోసారి ఆనంద దీపావళి ప్రతిఫలించింది. అందరి హృదయాల్లో సంతోషాల రవళి ప్రతిధ్వనించింది. ఎన్ని పెనుగాలులు వీచినా రవంతైనా చలించని ఆశాదీపం అదే ప్రకాశంతో ప్రజ్వలిస్తూ తమ కనుల ఎదుట నిలిచిన శుభసాయంత్ర వేళ అందరి మదిలో అభిమాన దీప్తి దేదీప్యమానమై ప్రకాశించింది. పగబట్టిన వికృత వ్యక్తిత్వాల రాక్షస రాజకీయ కేళి కత్తి దూసినా.. దిశ తప్పిన ఆయుధం శరీరాన్ని క్షోభింపజేసినా.. చెక్కుచెదరని సంకల్పబలంతో మళ్లీ జనం చెంతకు చేరేందుకు మెరుపై.. మునుపటి దరహాసపు మైమరపై తరలివచ్చిన జనహృదయాధినేత విశాఖ విమానాశ్రయం నుంచి వెలుపలికి వచ్చి ప్రజాసంకల్ప యాత్ర కోసం విజయనగరం జిల్లాకు బయలుదేరిన తరుణాన.. ఆ ఆత్మీయ హాసాన్ని.. ఆ శోభాయమాన రూపాన్ని.. ఆ వినమ్రపూర్వక నమస్సును చూసి పరవశించిపోయిన ప్రతి ఒక్కరి అంతరంగం ‘జననేతా... జయీభవ’ అని ఎలుగెత్తి నినదించింది. రేపటి సూరీడి పునరాగమనాన్ని తిలకించిన సాగర నగరం శుభాభినందనలు తెలిపి సెలవంది.

సాక్షి, విశాఖపట్నం: పునర్జన్మ పొందిన చోటే పుట్టెడు అభిమానం వెల్లువెత్తింది. తమ అభిమాన నేతపై అవధుల్లేని ప్రేమ పెల్లుబికింది. అశేష జనాదరణ కలిగిన జననేతను హతమార్చేందుకు కుట్ర జరిగిన ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. నీ వెంటే మేముంటామంటూ నినదించింది. ప్రియతమ నేతకు అండగా నిలుస్తామని చాటి చెప్పింది. సరిగ్గా 18 రోజుల క్రితం అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. హైదరాబాద్‌లో చికిత్స అనంతరం ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఉద్విగ్న క్షణాల మధ్య విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తనపై హత్యాయత్నం జరిగాక ఆయన విశాఖ రావడం ఇదే తొలిసారి. జగన్‌ను హత్య చేసేందుకు ఎయిర్‌పోర్టులో కుట్ర జరిగిన నేపథ్యంలో ఆయనను ఎప్పుడు చూస్తామా? అంటూ అభిమానులు, పార్టీ శ్రేణులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఆదివారం సాయంత్రం జగన్‌ వస్తున్నారని తెలుసుకున్న వీరు మధ్యాహ్నం మూడు గంటల నుంచే విమానాశ్రయానికి చేరుకోవడం మొదలు పెట్టారు. అలా ప్రవాహంలా వచ్చి చేరుతున్న జనతరంగాన్ని చూసి పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఎయిర్‌పోర్టు ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. విమానాశ్రయంలోకి రాకుండా వారిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు.

ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేశారు. అయినా వెనక్కి తగ్గకుండా ఏదోలా ఎయిర్‌పోర్టుకు చేరుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల అడ్డంకులను అధిగమించిన వారు విమానాశ్రయానికి రాగలిగినా, ఇంకా అనేక మంది రోడ్డుపైనే ఉండిపోయారు. అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎయిర్‌పోర్టు కిక్కిరిసిపోయింది. జగన్‌ రాకకు ముందే జై జగన్‌.. జైజై జగన్‌ అంటూ నినాదాలతో హోరెత్తింది. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణీత సమయం సాయంత్రం 6.30 గంటలకే విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. లోపలి నుంచి బయటకు 6.40 గంటలకు వచ్చారు. అప్పటికే కిక్కిరిసిపోయి ఉన్న జనసందోహాన్ని చూసి జగన్‌.. జననేతను చూసి జనం ఉద్వేగానికి గురయ్యారు. వారందరికీ జగన్‌మోహన్‌రెడ్డి రెండు చేతులూ పైకెత్తి అభివాదం చేశారు. జై జగన్‌ అంటూ నినదిస్తుం డగా, జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లాలో సోమవారం నుంచి ప్రజాసంకల్పయాత్రను తిరిగి కొనసాగించడానికి పయనమయ్యారు.

స్తంభించిన ట్రాఫిక్‌..జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు వచ్చిన జనం, వాహనాలతో జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం చాలాసేపు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. జగన్‌ విమానాశ్రయం నుంచి విజయనగరం జిల్లాకు పయనమయ్యాక కూడా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడానికి పోలీసులకు చాలా సమయం పట్టింది.

ఎంట్రీ టిక్కెట్ల విక్రయం నిలిపివేత
జగన్‌మోహన్‌రెడ్డి రాక సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టులో ఎంట్రీ టిక్కెట్ల విక్రయాన్ని నిలిపివేశారు. విమానాశ్రయం ప్రాంగణంలో ఈ టిక్కెట్ల కౌంటర్‌ ఉంది. ప్రయాణికులను సాగనంపడానికి వారి బంధుమిత్రులు రూ.75ల టిక్కెట్టుతో విమానాశ్రయంలోకి వెళ్లడానికి అనుమతిస్తారు. కానీ ఆదివారం ఈ కౌంటర్‌లో ఎంట్రీ టిక్కెట్ల కౌంటర్‌ను బంద్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top