
‘సాక్షి’పై విషం కక్కిన ఎమ్మెల్యే
వెంకటగిరి ఎమ్మెల్యే కె.రామకృష్ణ, ఆయన మద్దతుదారులు ‘సాక్షి’ పత్రికపై విషం కక్కారు.
‘రూ.5 కోట్లు లంచం’ వార్త అన్ని పత్రికల్లో ప్రచురితమైనా సాక్షి పత్రికల దహనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే కె.రామకృష్ణ, ఆయన మద్దతుదారులు ‘సాక్షి’ పత్రికపై విషం కక్కారు. ఎమ్మెల్యే తమ నుంచి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారనీ, ఇవ్వకపోవడంతో పనులు ఆపివేయించారని మాంటెకార్లా కంపెనీ సెక్రటరీ కల్పేష్ దేశాయ్ సోమవారం నెల్లూరులో విలేకరుల సమావేశం పెట్టి చెప్పారు. ఈ వార్తను అన్ని పత్రికలు ప్రచురించాయి. అయితే ఎమ్మెల్యే ఆదేశంతో వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు మంగళవారం సాక్షి దినపత్రికలను దహనం చేశారు.
ర్యాలీ తీసి మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని భావించారు. పర్సెంటేజీల విషయం కేంద్రం దృష్టికి వెళ్లడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయొద్దని ఆదేశించారని తెలిసింది. తర్వాత నగరంలోని ఒక హోటల్లోకి ఎమ్మెల్యే విలేకరుల సమావేశం మార్చారని సందేశం పంపారు. నాటకీయంగా మాంటెకార్లా కంపెనీ మాజీ మేనేజర్ రాము వచ్చారు. ఎమ్మెల్యేకు బదులు మీరెందుకు వచ్చారని ప్రశ్నించగా... ఎమ్మెల్యే పంపితేనే వాస్తవాలు చెప్పడానికి వచ్చానని బదులిచ్చారు.
రూ.28 కోట్లు రాయల్టీ ఎగ్గొట్టడానికే ఎమ్మెల్యే మీద బురద
ఓబులవారిపల్లి - కృష్ణపట్నం మధ్య నిర్మిస్తున్న రైల్వే లైన్ నిర్మాణం పనులను సబ్ కాంట్రాక్టు కింద చేస్తున్న మేడికొండ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.28 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టడానికే ఎమ్మెల్యే రామకృష్ణ మీద బురద చల్లుతోందని మాజీ మేనేజర్ రాము చెప్పారు. మాంటెకార్లో కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్న తాను ఈ ఏడాది జూన్ 6వ తేదీ ఉద్యోగానికి రాజీనామా చేశానని తెలిపారు. తాను ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎమ్మెల్యే రామకృష్ణతో జరిగిన ఫోన్ సంభాషణ తనకు చెప్పకుండా మీడియాకు విడుదల చేశారన్నారు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాకే పనులు చేయాలని ఎమ్మెల్యే పనులను అడ్డుకున్నారు తప్ప పర్సెంటేజీ కోసం కాదని చెప్పారు.ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడిన స్వరం తనదేనని అంగీకరించారు.