కొరత లేకుండా కూరగాయలు

Vegetables without shortage - Sakshi

ఉద్యాన శాఖ వేసవి ప్రణాళిక

మొత్తం సాగు విస్తీర్ణం దాదాపు 2.51లక్షల హెక్టార్లు

మొత్తం ఉత్పత్తి 77.71 లక్షల టన్నులు

సాక్షి, అమరావతి: కూరగాయల కొరత రాకుండా ఉద్యాన శాఖ.. వేసవి సాగు (ముందస్తు ఖరీఫ్‌) ప్రణాళికను ఖరారు చేసింది. ఇప్పటి నుంచే కూరగాయల సాగును చేపడితే ఆగస్టు నుంచి ఎటువంటి కొరత ఉండబోదని రైతులకు సూచించింది. ఇదే సమయంలో రైతులకు ఏయే రాయితీలు ఇవ్వచ్చో ప్రణాళిక సిద్ధం చేసింది. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం.. రాష్ట్రంలో 2,50,689 హెక్టార్లలో ఏడాది పొడవునా ఆకు కూరలు కాకుండా సుమారు 22 రకాల కూరగాయలు సాగవుతాయి. 77,71,620 టన్నుల ఉత్పత్తి వస్తుంది. ఈ సీజన్‌ (మార్చి నుంచి జూలై వరకు)లో 8,21,650 టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా కాగా అందులో ఇప్పటికే 3,75,461 టన్నులు అమ్ముడ య్యాయి. జూలై చివరిలోగా మిగతా 4,46,189 టన్నులు వస్తాయి. ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి సహజంగానే జూలై నుంచి కూరగాయల ధరలు పెరుగు తాయి. ఆగస్టు నుంచి కూరగాయల కొరత లేకుండా చూ డాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టాలి.

రైతులకు ఉద్యాన శాఖ సూచనలు
► నీటి వసతి, సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ ఉన్న రైతులు తీగజాతి కూరగా యల సాగును తక్షణమే చేపట్టాలి.
► ప్రస్తుత అంచనా ప్రకారం.. సుమారు 36 వేల హెక్టార్లలో సూక్ష్మ నీటిపా రుదల వ్యవస్థ ఉంది. మల్చింగ్‌ (మొక్కల చుట్టూ ప్లాస్టిక్‌ లేదా పాలిథీన్‌ కవర్లతో కప్పిఉంచడాన్ని మల్చింగ్‌ అంటారు) పద్ధతిన కూరల సాగును చేపడితే మంచి లాభాలూ పొందొచ్చు. 
► నీటి వసతి ఉన్న రైతులు తమ పొలాల్లో బెండ, వంగ, దోస జాతి కూరలు, బీర, సొర, చిక్కుడు, కాకర, ఆకుకూరల్ని ప్రణాళికా బద్ధంగా సాగు చేయాలి.
► తాత్కాలిక పందిళ్లతో కూరగాయల్ని సాగు చేసే రైతులు ప్రస్తుతం చిక్కుడు, పొట్ల వేయాలి.
► పర్మినెంట్‌ పందిళ్లు ఉండే రైతులు దొండ, బీర, కాకర, సొర, ఇతర తీగ జాతి కూరగాయల్ని సాగు చేయాలి.
► కాగా, ఇప్పటికే ఉత్తరాంధ్ర, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో  కొన్ని వేల హెక్టార్లలో కూరగాయల సాగు చేపట్టారు. 
► హైబ్రీడ్‌ కూరగాయల్ని సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ రాయితీ ఇస్తుంది. 
► రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై) కింద 50 శాతం సబ్సిడీతో కూరగాయల విత్తనాలను పంపిణీ చేస్తారు. 
► పాలీ హౌసులు, షేడ్‌ నెట్స్‌ ఉన్న రైతులకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేస్తారు. కరోనాతో విపత్కర పరిస్థితులు ఉండటం వల్ల ఉచితంగా మొక్కలు ఇవ్వాలని డిమాండ్‌ వస్తోంది. దీనిపై ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
► పర్మినెంట్‌ పందిళ్లు ఉన్న రైతులకు 50 శాతం సబ్సిడీపై కాకర, బీర, సొర లాంటి కూర జాతి విత్తనాలను సరఫరా చేయాల్సి ఉంది. 
► రైతు భరోసా కేంద్రాల వద్ద కూరగాయల విత్తనాలను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
► ఆర్‌కేవీవై కింద ప్రత్యేక గ్రాంట్‌ ఇవ్వాల్సిందిగా ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌధురి ప్రభుత్వానికి నివేదించారు. 
► రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రైతులకు అవగాహన కల్పిస్తూ అధిక ఆదా యం వచ్చే పంటల్ని సాగు చేయించాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top