దిశ వంటి ఘటనలు పునరావృతం కాకుండా..

Vasireddy Padma Comments In Be Safe App Launch Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: దిశకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కోరారు. దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాల దశను మార్చాలని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అనే అవగాహన కార్యక్రమంలో మహిళా మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, నగర సీపీ ద్వారకా తిరుమలరావు, కలెక్టర్‌ ఇంతియాజ్ అహ్మద్‌తో పాటు వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళల రక్షణకు ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. ‘పురుషులతో పాటు సమానంగా మహిళలు పోటీ పడుతున్నారు. మహిళలపై దాడులకు నివారణ చర్యలు తీసుకోవాలి. మీ కోసమే మేము ఉన్నామని అందరూ మహిళల కోసం నిలవాలి’అని సూచించారు. అదే విధంగా మహిళలు కూడా ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో మద్యపానం నిషేధం అమలుతో మహిళలకు ఉపశమనం చేకూరుతోందని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల కోసం 50 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు.

అది ఉద్యమంలా విస్తరించింది: సీపీ
కొత్త నేరాల పట్ల ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని సీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. మహిళల రక్షణకై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. తమ ప్రాధాన్యత అంశాలలో ముందుగా మహిళ భద్రతే ఉంటుందన్నారు. ‘గౌతమ్ సవాంగ్ సీపీగా ఉన్న సమయంలో మహిళా మిత్ర ప్రారంభించారు. అది ఉద్యమంలా విస్తరించింది. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్  మిత్రకు శ్రీకారం చుట్టాము. 47 సైబర్ మిత్ర గ్రూపులు ఏర్పాటు చేశాం. ఇందులో 1520 మంది వాలంటీర్స్‌ను ఎంపిక చేశాం. 734 కాలేజీల నుంచి విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. వారంతా సైబర్ వారియర్స్‌గా పని చేస్తారు. బీ సేఫ్ ... అనే యాప్‌ను సైతం  మహిళలు రక్షణ కోసం ఏర్పాటు చేశాం. దిశా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top