వైకల్యం శరీరానికే.. ప్రేమకు కాదు..

Valentine Day Special Story - Sakshi

ప్రేమ.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు పలకరిస్తుందో ఎవరికి తెలుసు? వస్తూనే ఓ గిలి.. మది లోగిలి అదిరిపడేలా.. ఆ ప్రత్యేకమైన వ్యక్తి స్ఫురణకు వస్తే చాలు.. అప్పటి వరకు దగ్గరున్న వారంతా దూరమైపోతే బాగుణ్ణు అనే భావన. ఆమె లేదా అతడి ధ్యాస తప్ప మరేదీ అవసరం లేదన్న తాదాత్మ్యత. ఇదీ.. అని ప్రత్యేకంగా ఏదీ చెప్పలేని ఓ మధురానుభూతి మనసును ఆవరిస్తుంది. నూత్న యవ్వనం తొలి రోజుల్లోనే కాదు.. మలి వయసులోనూ.. ఆ మాటకొస్తే ఏ వయసులోనైనా.. కారణమేదైనా స్పందించే  మనసుండాలే కానీ వలపుశరాల బారిన పడనివారుండరు అనడం అతిశయోక్తి కాదేమో.. అలాంటి ప్రేమజీవుల అనుభూతులు.. ప్రేమైక జీవనం గడుపుతున్న కొన్ని జంటల విజయాలు ప్రేమికుల రోజున మీ కోసం..

ఆత్రేయపురం (కొత్తపేట):  మండలంలోని వివిధ గ్రామాల్లో పలువురు యువతీ, యువకులు వారి ప్రేమ యుద్ధంలో విజయం సాధించి సుఖమయ జీవనం సాగిస్తున్నారు. ఆత్రేయపురం గ్రామానికి చెందిన ప్రముఖ చిత్ర దర్శకుడు వేగేశ్న అజయ్‌ భూపతి, శిరి వారిలో ఒక జంట. వీరి ఇరువురు ప్రేమికుల రోజు సాక్షిగా ‘ఆర్‌ఎక్స్‌–100’ వాహనంపై యమస్పీడుగా దూసుకుపోతున్నారు. ఆయన సతీమణి శిరి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి తను ప్రేమించిన వ్యక్తిని ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకుని పెళ్లి చేసుకుని జీవితాన్ని పూలబాటగా మార్చుకున్నారు. అలాగే ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన కప్పల శ్రీధర్, స్వరూప పరస్పరం అవగాహనతో ప్రేమికుల రోజు సాక్షిగా జీవితాన్ని సుఖమయం చేసుకుని పిల్లా పాపలతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అలాగే ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యులు మద్దూరి సుబ్బలక్ష్మి , మద్దూరి బంగారం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ ప్రేమికులందరికీ ఆదర్శంగానిలుస్తున్నారు.

ప్రేమకు పెద్దల అంగీకారం ఉంటేనే మంచిది
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌):ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటేనే జీవితమంతా ఆనందంగా ఉంటుందంటారు ఎల్‌ఐసీ రాజమహేంద్రవరం రూరల్‌ బ్రాంచి ఉద్యోగి గురుమహేష్, అంజలి దంపతులు. మూడున్నరేళ్ల క్రితం దగ్గర బంధువైన అంజలిని ప్రేమించారు. ఇద్దరి మనసులు ఒక్కటవడంతో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకోవడం వలన సంతోషంగా జీవించవచ్చంటారు. అందుకే ప్రేమికులు ఎవరైనా పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంటే ఆ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుందన్నారు.

మా దాంపత్యం ఎంతో అన్యోన్యం
మామిడికుదురు (పి.గన్నవరం): ‘చదువుకునే సమయంలో ఇద్దరం ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నాం. రెండు దశాబ్దాలు అయ్యింది. ఇంత వరకు మా ఇద్దరి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా అన్యోన్యంగా జీవిస్తున్నాం’ అంటున్నారు మామిడికుదురుకు చెందిన ఉండ్రు శ్రీనుబాబు, బళ్ల జ్యోతి. 1999లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. బీఎస్సీ., బీఈడీ., పూర్తి చేసిన శ్రీనుబాబు ప్రస్తుతం తాటిపాక భాష్యం స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నారు. జ్యోతి కూడా బీఎస్సీ., బీఈడీ., పూర్తి చేసి సర్వశిక్షాభియాన్‌లో సీఆర్పీగా పని చేస్తున్నారు. వీరి కుమారుడు వినయ్‌రామ్‌ కృష్ణా జిల్లా నూజివీడులో ట్రిపుల్‌ ఐటీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె అంబిక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బీఎన్‌ఎం కళాశాలలో అగ్రికల్చర్‌ డిప్లొమా చదువుతోంది. ‘మాకు కుటుంబ సభ్యుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి’. ‘మా పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నాం. మేము కోరుకున్న జీవితం ఇదే. మా పిల్లలు ప్రయోజకులు కావాలనే మేము కోరుకున్నాం. మా అభిలాష నెరవేరింది. మాకు ఈ జీవితం చాలా ఆనందంగా ఉంది. మా 20 ఏళ్ల దాంపత్య జీవితంలో ఎన్నడూ ఎటువంటి సమస్యా ఎదురుకాలేదు’ అంటున్నారు శ్రీనుబాబు, జ్యోతి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తే ఎటువంటి సమస్యలు ఉండవంటారు వారు. పంతాలు, పట్టింపులకు పోకుండా ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకుని నడుచుకుంటే ఏ విధమైన సమస్యలు ఉండన్నది వారి సిద్ధాంతం.                             

ధనిక–పేద వ్యత్యాసంచెరిపేసిన ప్రేమ..
అమలాపురం టౌన్‌: పెద్దలను ఎదిరించి ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం తిరుగుబాటు అవుతుంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం సర్దుబాటు అవుతుంది. ఈ రెండు మార్గాల్లో ప్రేమికులు ఏ మార్గంలో పెళ్లి చేసుకున్నా భార్యాభర్తలు అరమరికలు లేకుండా అన్యోన్యంగా జీవించగలిగితేనే వారి ప్రేమకు అర్థం.. పరమార్థం. ప్రేమపెళ్లితో ఒక్కటైన జంట వాసంశెట్టి సుభాష్, లక్ష్మీ సునీత. అమలాపురం పట్టణం మద్దాలవారిపేటకు చెందిన సుభాష్‌ది ధనిక కుటుంబమైనప్పటికీ తన మనసుకు నచ్చిన పేదింటి యువతిని నిజాయతీగా ప్రేమించి.. అంతే నిజాయతీగా తన ఇంట్లో వారికి చెప్పి.. ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎదురెదురు ఇళ్లలోని కుటుంబాలైన వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ సుభాష్‌కు తాను మెచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్న లక్ష్మీ సునీత అంటే నాడూ.. ఈనాడూ అదే మక్కువ. పదేళ్ల వారి ప్రేమకు గుర్తుగా ముద్దులొలికే కవల ఆడపిల్లలు సత్య దీవిత, సత్య దీక్షిత. వారిరువురికీ వీరిరువురే ప్రపంచం. కాకతాళీయమే అయినా సుభాష్‌ తన పెద్దలను, ఆమె ఇంటి పెద్దలనూ ఒప్పించిన రోజు ఫిబ్రవరి 14 కావడం గమనార్హం.

ప్రేమలో మాస్టార్లు
సామర్లకోట (పెద్దాపురం): వారు ఇరువురు వేర్వేరు పాఠశాలల్లో ఉపాధ్యాయులు. తరువాత ఒకే హైస్కూల్‌లో పనిచేశారు. ఆ కాలంలో ప్రేమజీవులై పట్టణ ప్రముఖులు సహకరించడంతో 1991లో వివాహం చేసుకున్నారు తాళ్లూరి వైకుంఠం, ఏఎల్‌వీ కుమారి. ప్రస్తుతం వైకుంఠం పీడీగాను, కుమారి సైన్సు టీచరుగా బచ్చు ఫౌండేషన్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లోనే పని చేస్తున్నారు. వైకుంఠం యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్‌ హైస్కూల్,  బచ్చు ఫౌండేషన్‌ మున్సిపల్‌ హైస్కూల్స్‌లో పని చేసి అనేక మంది క్రీడాకారులను తయారు చేశారు. కబడ్డీ, ఖోఖోలలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. దాంతో అనేక మంది విద్యార్థులు కబడ్డీ కోటాలో ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. కుమారి సైన్సు టీచరుగా 8 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు బోధించడంలో ఆరితేరిన ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందారు. ఎప్పుడు నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారని సహోపాధ్యాయులతో పాటు, పాఠశాల హెచ్‌ఎం తోటకూర సాయిరామకృష్ణ కూడా ఆమెను అభినందిస్తుంటారు. వైకుంఠం వ్యాయామ ఉపాధ్యాయుడు కావడంతో పిల్లలకు ఆటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం కుమారుడి ఎస్సై సెలక్షన్‌కు ఎంతగానో దోహదం చేసింది.
రెండో కుమారుడు పుష్పకల్యాణ్‌ ఐఏఎస్‌ లక్ష్యంతో హైదరాబాద్‌లో గ్రూప్స్‌కు శిక్షణ పొందుతున్నట్లు వైకుంఠం తెలిపారు. తమది ప్రేమ వివాహం అయినా పెద్దలు కూడా అంగీకరించడంతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్టు ఏఎల్‌వీ కుమారి, వైకుంఠం తెలిపారు. తమ పిల్లల వివాహం వారి ఇష్టం ప్రకారమే జరుగుతుందని చెప్పారు. ప్రేమ వివాహం చేసుకునే ముందు వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకొవడం వలన సమస్యలు ఏర్పడే అవకాశం ఉండదని తెలిపారు. ఏది ఏమైనా సమస్యలు వచ్చిన సమయంలో సర్దుకుపోవడం వల్ల ప్రశాంతంగా జీవించడానికి వీలు కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.  

వైకల్యం శరీరానికే.. ప్రేమకు కాదు..

రామచంద్రపురం రూరల్‌: రామచంద్రపురం మండలం నరసాపురపుపేటకు చెందిన పంపన శివయ్య పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించాడు. శారీరకంగా మరుగుజ్జుతనం ఉన్నా.. మానసికంగా దృఢ చిత్తంతో ఎదిగాడు. అంగవైకల్యం వల్ల అతని చదువు 8వ తరగతిని మించి సాగలేదు. అయినప్పటికీ తనను కంటికి రెప్పలా కాపాడుకున్న తన కన్నతల్లిని వృద్ధాప్యంలో కంటి పాపలా కాపాడుకున్నాడు. రామచంద్రపురం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పలు సమస్యలతో వచ్చే వారికి సహాయకారిగా ఉంటూ వారికి దరఖాస్తులు నింపడం, అర్జీలు రాయడం చేస్తూ తల్లిని పోషించుకునేవాడు. దూరపు బంధువైన ధనలక్ష్మిని శివయ్యను పెళ్లి చేసుకోమని బంధువులు అడిగారు. కన్నతల్లిని కన్నబిడ్డలా చూసుకుంటున్న శివయ్య వ్యక్తిత్వం తెలిసిన ఆమె వెంటనే వివాహానికి ఒప్పుకుంది. కానీ శివయ్య వివాహం చేసుకుంటే తన తల్లిని పోషించుకోలేమోనని  భావించి పెళ్లికి నిరాకరించాడు. అయితే శివయ్యను ఇష్టపడిన ధనలక్ష్మి అతనినే పెళ్లి చేసుకోవాలని భావించి, నిరీక్షించింది. రెండేళ్ల తరువాత వృద్ధాప్యంతో తల్లి మరణించిన తరువాత ధనలక్ష్మి తన కోసం పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తోందని తెలిసి ఆమెను 2006 పిబ్రవరి పదిన వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తుగా కుమార్తె కల్యాణి జన్మించింది. శివయ్యకు 2013లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం రామచంద్రపురం మండల పరిషత్‌ కార్యాలయంలో సబ్‌స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. రామచంద్రపురం వైఎస్సార్‌ నగర్‌లో సొంత ఇల్లు ఉంది. కుమార్తె కల్యాణి ఏడో తరగతి చదువుతోంది. ఈ ప్రేమజంట తమ ప్రేమకు ప్రతిరూపమైన కుమార్తెను అల్లారుముద్దుగా చూసుకుంటూ ఆనందంగా
జీవిస్తున్నారు.

ప్రేమకు కోవెల ఆ ఇల్లు
కాకినాడ రూరల్‌: 1984లో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆ దంపతులు ఆనాటి ప్రేమను వ్యతిరేకించిన పెద్దలను ప్రేమతోనే ఒప్పించారు. ఎవరేంటో, వారి మనసేంటో తెలియకుండా పెళ్లి చేసుకునే వారికంటే ఒకరి మనస్సు ఒకరు అర్ధంచేసుకున్న దంపతులు అన్యోన్యంగా ఉంటారనే విషయాన్ని పెద్దలకు వివరించిన దంపతులు మణమ్మ, శర్మ. కాకినాడ వాజపేయాజుల వారి వీధిలో 1983లో కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి నాగమణిని సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సీతారామ శర్మ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా వారి సంతానమైన ఇద్దరబ్బాయిలకు ప్రేమ పెళ్లిళ్లే చేశారు. జమ్మలమడక నాగమణి, రామశర్మ దంపతుల కుమారులు రామ్‌లాల్‌ భరత్, రవితేజలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటానంటే సరే అని పెళ్లిళ్లు చేసిన ఘనత వారికే దక్కింది. ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ ఎంతో ఆనందంగా కాపురాలు చేసుకుంటూ ఆదర్శ కుటుంబాలుగా పేరు పొందుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top