
వైఎస్ జగన్ మాట్లాడుతుండగా అడ్డుకున్న అధికారపక్షం
ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్ట్ అంశంపై గురువారం గందరగోళం నెలకొంది.
అమరావతి : ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్ట్ అంశంపై గురువారం గందరగోళం నెలకొంది. ప్రధాన సమస్యలపై, ప్రజల గొంతు వినిపిస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతుండగా రెండుసార్లు మైక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. అంతకు ముందు పోలవరం ప్రాజెక్ట్ చట్టప్రకారం రావాల్సిన హక్కు అని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌పై ఆయన మాట్లాడుతూ...’పోలవరం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. రాష్ట్ర విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్ట్ ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఆ ప్రాజెక్ట్ ఏదో ఇప్పుడే వచ్చినట్లు గొప్పలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికి కాదు. మేమే చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. విభజన సమయంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించారు. ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ చట్టంలో పొందుపర్చారు.
మూడేళ్లలో రూ.3వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు’ అని అన్నారు. ఈ అంశంపై వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే...అధికార పక్షం అడ్డుకుంది. దీంతో వైఎస్ జగన్ తన నిరసన తెలిపారు. అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ మాట్లాడిన తర్వాత మరోసారి వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే మైక్ కట్ అయింది. దీనిపై నిరసన తెలుపుతూ వైఎస్‌ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.