ఒకరు బతకాలంటే మరొకరు కన్నుమూయాలా..?

Uddanam Kidney Patients Facing Difficulties For Dialysis - Sakshi

దయనీయ పరిస్థితుల్లో డయాలసిస్‌ సెంటర్లు

సేవలు అందక చనిపోతున్న కిడ్నీ బాధితులు

వ్యాధిగ్రస్తుల దరిచేరని ఉచిత మందులు

నెఫ్రాలజిస్టు నియామకాన్ని మరిచిన ప్రభుత్వం  

ఒకరు బతకాలంటే మరొకరు కన్నుమూయాలా..? ఒకరి ఊపిరి నిలపాలంటే మరొకరి ఉసురు ఆగిపోవాలా..? జిల్లాలోని కిడ్నీవ్యాధిగ్రస్తులు ఇలా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఒకరి స్థానం ఖాళీ అయితే గానీ మరొకరికి డయాలసిస్‌ అందని కఠిన స్థితిలో ఉన్నారు. చాలా మంది ఇక్కడ కొన ఊపిరితో డయాలసిస్‌ సేవల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రమాణాలు చేయడం, ప్రకటనలు ఇవ్వడం తప్ప సేవలు మర్చిపోయిన సర్కారు తీరుతో వీరు విసిగిపోయారు. జనం ప్రాణాలు కాపాడలేని అసమర్థ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

కాశీబుగ్గ : ఇటీవల పలాస మండలంలో ఉద్దానం ప్రాంతానికి చెందిన ఒక కిడ్నీవ్యాధిగ్రస్తుడు మరణించాడు. ఆ విషయం తెలుసుకున్న సుమారు ఆరుగురు రోగులు ఆస్పత్రి వారిని సంప్రదించారు. తాము విశాఖ, శ్రీకాకుళం వెళ్లలేమని, పలాసలో డయాలసిస్‌ అయ్యేలా అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఇలా డయాలసిస్‌ సేవల కోసం ఎదురుచూస్తున్న వారు ఇంకా వందలాదిగా ఉన్నారు. ఉద్దానం కిడ్నీవ్యాధిగ్రస్తులు విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కిడ్నీవ్యాధి సోకిన వారిలో అధికంగా డయాలసిస్‌ చివరి దశలో ఉన్న వారు ఇక బతుకుపై ఆశలు వదిలేసుకుంటారు. కానీ వీరి వెనుక డయాలసిస్‌ సేవల కోసం ఎదురుచూస్తున్న వారు మాత్రం అంతకంటే నరకం అనుభవిస్తున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒకరు చనిపోతే గానీ తమకు సేవలు అందని దౌర్భాగ్య పరిస్థితిని తలచుకుని కుమిలిపోతున్నారు.

ప్రభుత్వం కపట ప్రేమ 
రెండున్నర దశాబ్దాలుగా ఉద్దానం, తీర ప్రాంతాల ప్రజలను వణికిస్తున్న కిడ్నీ భూతంతో వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికీ వీరి కోసం ప్రభుత్వం ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపలేదు. జిల్లాలో 7 ఉద్దాన తీర ప్రాంతంలో సుమారు 20 వేల మంది ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే వారిలో పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో కేవలం 80 మంది రోగులు మాత్రమే డయాలసిస్‌ చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఏ స్థాయిలో విఫలమైందో ఊహించుకోవచ్చు. 

కొందరికే అవకాశం..
ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన డయాలసిస్‌ కేంద్రాల్లో సదుపాయాలు లేక, ఉచిత మందులు అందక, సిబ్బంది కొరత వేధిస్తుండడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలాస డయాలసిస్‌ కేంద్రంలో కేవలం డయాలసిస్‌ మిషన్లు (హెచ్‌డి) 9 ఉండగా వీటిలో 7 పాజిటివ్, 2 నెగిటివ్‌ మిషన్లు ఉన్నాయి. దీనిలో 80 మంది రోగులకు రోజుకు 3 షిఫ్ట్‌లలో 27 మందికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 8 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. మరో ఇద్దరు రావాల్సి ఉంది. మిగిలిన రోగులు డయాలసిస్‌ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇక్కడ సదుపాయాలు లేకపోవడంతో చాలా మంది రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సుదూర ప్రాంతాల్లో గల ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. 

ప్రకటనలకే పరిమితమా..? 
జిల్లాకు వచ్చిన ప్రతిసారీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అది చేస్తాం. ఇది చేస్తాం అని గొప్పలు చెబుతున్న ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు వాటిని నెరవేర్చడంలో మాత్రం విఫలం అవుతున్నారు. రోగులకు ఉచిత మందులు అందిస్తానని, డయాలసిస్‌ కేంద్రాలను పెంచుతానని, వారికి పింఛన్లు అందిస్తానని అనేక హామీలిచ్చి వెళ్లిపోయారే తప్ప వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం నెఫ్రాలజిస్టు నియామకం చేపట్టకపోవడంతో డయాలసిస్‌ చేసుకుంటున్న కిడ్నీ రోగులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది.

జిల్లాలో ఇదీ పరిస్థితి.. 
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 38 మండలాల పరిధిలో 20వేలమందికిపైగా అన్నిరకాల కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలో కవిటి, వజ్రపుకొత్తూరు, పలాస, మందస, ఇచ్ఛాపురం, సొంపేట, కంచిలితో మొత్తం ఏడు మండలాలు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో డయాలసిస్‌ కేంద్రాల్లో పాలకొండలో 50 మంది రోగులు, శ్రీకాకుళం రిమ్స్‌లో 125 మంది, టెక్కలి 72 మంది, పలాసలో 80మంది, సొంపేటలో 100 మంది, కవిటి, 50 మంది రోగులు డయాలసిస్‌ పొందుతున్నారు. ప్రతి సెంటర్‌ వద్ద సుమారు ఐదు నుంచి పదికిపైగా కిడ్నీ రోగులు వెయిటింగ్‌లో ఉన్నారు. ఇందులో ఎవరైనా చనిపోతే మిగిలిన వెయింట్‌లో ఉన్నవారికి అవకాశం కలుగుతుంది.

పలాసలో డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ రోగులు

తిత్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి
కీడ్నీ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ముఖ్యమంత్రి మందస మండలం హరిపురం, వజ్రపుకొత్తూరు మండలాల పరిధి అక్కుపల్లిలో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. వజ్రపుకొత్తూరు మండలంలో అధికంగా కిడ్నీరోగులు గుణుపల్లి, బాతుపురం, బైపల్లి, యుఆర్‌కే పురం, అక్కుపల్లి గ్రామాల ప్రజలు అక్కుపల్లిలో ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతవరకు జరగలేదు. ముఖ్యమంత్రి ప్రకటించిన పింఛన్లు కేవలం 225 మందికి మాత్రమే అందుతున్నాయి. మిగిలిన వారంతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

పలాసలో నామమాత్రపు సేవలు 
పలాస సామాజిక ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ కేంద్రంలో అరకొర సేవలు అందుతున్నాయి. నాలుగు షిఫ్టులలో జరుగుతున్న డయాలసిస్‌ సేవలు కొందరికే పరిమితమయ్యాయి. 8 మంచాలపై జరుగుతున్న డయాలసిస్‌ కోసం మూడు షిఫ్టుల్లో రోజుకు 24 మందికి మాత్రమే జరుగుతుంది. పలాస నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉద్దాన కిడ్నీ రోగులు 700 మందికిపైగా డయాలసిస్‌ జరుపుకుంటున్నారు. అత్యవసరమైన వారు విశాఖ, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్లి రూ.వేలల్లో ఖర్చు పెడుతున్నారు. మా సొంతగ్రామం గొల్లమాకన్నపల్లిలో ఇప్పటివరకు 50 మందికిపైగా చనిపోయారు. ఇంకా చాలామంది రోగులకు సేవలు అందడంలేదు.
– రాపాక అప్పలస్వామి, కిడ్నీ రోగి, గొల్ల మాకన్నపల్లి, పలాస మండలం

అత్యవసర పరిస్థితి ప్రకటించాలి..
ప్రస్తుతం ఉద్దాన ప్రాంతంలో ఉన్న కిడ్నీరోగుల మరణాలను నమోదు చేసి తక్షణమే అత్యవస మెడికల్‌ ప్రకటించి అందరిని ఆదుకోవాలి. ఉచిత మందులు, డయాలసిస్‌ పూర్తి సేవలు, రవాణా ఖర్చులు అందించాలి. ఆర్టీసీ బస్సుపాసులు ఇస్తున్నప్పటికీ అనేక ప్రాంతాలకు ఆర్టీసీ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
– పత్తిరి దశరథ,కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, బొడ్డపాడు

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..
ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేస్తోంది గానీ పనులు చేయడం లేదు. చివరి దశలో మరణానికి సిద్ధంగా ఉన్నవారికి పింఛన్లు ప్రకటించారు. మేమంతా వారి తరఫున అడుగుతున్నాం. సీరం క్రియాటిన్‌ తగ్గుదల ప్రారంభం నుంచి పింఛన్‌ అందిస్తే కాస్త అయినా మేలు జరుగుతుంది. ప్రస్తుతం సౌకర్యాలు లేకుండా డయాలసిస్‌ నడుపుతున్నారు. ప్రత్యేకమైన గ్రూపుల వారు విశాఖ వెళ్లాల్సి వస్తోంది. ఇకనైనా వారిపై శ్రద్ధ చూపాలి.
– సీదిరి అప్పలరాజు, వైఎస్సార్‌ సీపీ పలాస ఎమ్మెల్యే అభ్యర్థి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top