
దిమ్మ తిరిగింది!
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నిధుల మళ్లింపు భాగోతం రోజుకో మలుపు తిరుగుతోంది. వర్సిటీ ఉద్యోగుల జీతాలకు అవసరమైన....
యూనివర్సిటీ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నిధుల మళ్లింపు భాగోతం రోజుకో మలుపు తిరుగుతోంది. వర్సిటీ ఉద్యోగుల జీతాలకు అవసరమైన మొత్తం కంటే ప్రతి నెలా అధికంగా డ్రా చేసినా ఏళ్లతరబడి పట్టించుకున్న నాథుడేలేడు. తొలుత రూ.50 లక్షల అవినీతి చోటుచేసుకుందని భావించినా, ఆ మొత్తం ఇపుడు పదింతలైంది. మరింత పెరిగే అవకాశం ఉందని విచారణలో వెలుగుచూస్తోంది. ఈ కుంభకోణంపై విచారిస్తున్న ప్రొఫెసర్ల కమిటీ నిర్ఘాంతపోతోంది.
వర్సిటీలోని ఫైనాన్స్ విభాగంలో విధులు నిర్వహించిన సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించే ఉదయభాస్కర్‌రెడ్డి, శేషయ్యలు స్వాహా చేసిన అవినీతి సొమ్ము ఎంత అనేది అంతుచిక్కడం లేదు. శనివారం విచారణ చేపట్టిన సీనియర్ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ బినామీ ఖాతాలన్ని పరిశీలించి రూ.5.50 కోట్లు దాకా స్వాహా చేసినట్లు నిర్ధారించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మెత్తం ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉదయభాస్కర్‌రెడ్డి పేరుతో 10 నుంచి 15 బినామీ ఖాతాల్లో రూ.1.30 కోట్లు మళ్లించారు. తన భార్య రమాదేవి పేరుతో ఏకంగా నెలకు రూ.2.4 లక్షల జీతాన్ని చెల్లించేశాడు.
ఈ నెల 7న చెల్లించిన భోదన సిబ్బంది జీతాల అరియర్స్ నుంచే తన భార్య ఖాతాలోకి రూ.15 లక్షలు బదిలీ చేశాడు. శేషయ్యకు బినామీ ఖాతాలు 10 వరకు ఉన్నట్లు ఇప్పటి వరకు ఉన్న సమాచారం. తన భార్య భాగ్యలక్ష్మి పేరుతో రూ.12 లక్షలు బదిలీ చేశాడు. ఇది కేవలం కొన్ని నెలల నుండి అక్రమంగా బదిలీ చేసిన మొత్తాలే. ఆన్‌లైన్ ద్వారా 2011 నుంచి జీతాలను జమ చేస్తుండడంతో అప్పటి నుంచి ఎంత మొత్తంలో అవినీతి జరిగిందనేది విచారించాల్సి ఉంది.
గవర్నర్ సీరియస్!
ఎస్కేయూలో జీతాల చెల్లింపుల్లో జరిగిన అతి పెద్ద కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, ఛాన్సలర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగిందో సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఉన్న త విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహాని వెంటనే ఎస్కేయూకు ఉత్తర్వులు జారీ చేశారు. జీతాల చెల్లింపు కుంభకోణం ఎలా జరిగింది.. జరగడానికి గల కారణాలు, నిగ్గు తేల్చడానికి చేపట్టిన చర్యలను సూచిస్తూ నివేదిక అందజేయాలని ఆదేశించారు.
సొమ్మును డ్రా చేసేందుకు విఫలయత్నం
అక్రమంగా స్వాహా చేసిన సొమ్మును ఉదయభాస్కర్‌రెడ్డి భార్య రమాదేవి ఖాతాలోని సొమ్ము రూ.26 లక్షలను డ్రా చేసేందుకు విఫలయత్నం చేసింది. అనంతపురంలోని నీలిమ థియేటర్‌కు ఎదురుగా ఉన్న ఆంధ్రా బ్యాంకులో శనివారం ఆమె తన పిక్స్‌డ్ డిపాజిట్‌ను వెనక్కి తీసుకుంటున్నానని బ్యాంకు అధికారులకు తెలపగా వారు ఎస్కేయూ రిజిస్ట్రార్‌కు సమాచారం అందించారు.
ఈ విషయంపై పోలీసులకు పిర్యాదు చేయగా అ ప్రయత్నాలను అడ్డుకొన్నారు. అధికారికంగా క్రిమినల్ కేసులు పెడితేనే వర్సిటీయేతర ఉద్యోగుల ఖాతాలను ఫ్రీజ్ చేసే అవకాశం ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాల్సి వచ్చింది. బినామీ పేర్లతో ఉన్న అన్ని లాకర్లపై పోలీసులు నిఘా ఉంచారు.
ఆడిటింగ్‌లో పారదర్శకత లేమి
జీతాల చెల్లింపుల్లో ఆడిటింగ్ నిర్వహించలేదు. వర్సిటీ జనరల్ ఖాతా నుండి ఎంత మొత్తంలో జీతాలను ప్రతి నెలా జమ చేసింది ఆడిటింగ్ లోపాలను ఎత్తి చూపుతోంది. సంవత్సరానికి నాలుగు సార్లు ఆడిటింగ్ నిర్వహిస్తున్నప్పటికీ కోట్ల రూపాయల స్కాం వ్యవహారంపై ఎందుకు మౌనం వహించారనే సందేహాలు ఉన్నాయి.
వర్సిటీలోని ఉద్యోగులందరికీ జీతాలు కచ్చితంగా వస్తున్నప్పటికీ వర్సిటీ జనరల్ ఖాతాకు కన్నం వేసినప్పటికీ ఎందుకు ఎత్తి చూపలేదనే అనుమానాలు బహిర్గతమవుతున్నాయి. వర్సిటీలోని వసతి గ ృ హాల మెస్ బిల్లులు చెల్లింపుల విషయంలో ఇంత వరకు ఆడిటింగ్ నిర్వహించిన దాఖలాలు లేవన్నది స్పష్టమైంది.
అయ్యవార్లతో కమిటీనా?
ఇదివరకు వర్సిటీలో జరిగిన తంతుకు, ప్రస్తుతం జరిగిన అసాధారణమైన విషయానికి పొంతన పెట్టి ప్రొఫెసర్లతో కూడిన కమిటీని నియమించడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఎక్కడా లేని విధంగా ఎస్కేయూలో ఖాతాల నిర్వహణ దారితప్పింది. ఇలాంటి అంశాలు నిగ్గు తేలాలంటే కేసును అనుభవం గల ఛార్టెర్డ్ అకౌంటెంట్‌లతో కూడిన కమిటీని నియమించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో కుంభకోణాల విషయంలో ప్రొఫెసర్లు బెదిరింపులకు భయపడి సరైన విధంగా స్పందించలేదనే విమర్శలు ఉన్నారుు. ఈ నేపథ్యంలో అక్రమార్కుల గుట్టు రట్టు చేయడానికి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలని సర్వత్రా కోరుతున్నారు.
తెరవెనుక ఉన్న వారి సంగతేంటో?
అవినీతిలో ప్రత్యక్ష పాత్ర పోషించిన పాత్రధారుల సంగతి మరి కొద్ది రోజుల్లో తేలనుంది. ఇంత ఘనకార్యానికి ఒడిగట్టడానికి సహకరించిన సూత్రధారులు ఎవరు.. ఆర్థిక పరమైన విషయాల్లో ఈ ఇద్దరే కీలకంగా ఎందుకు వ్యవహరించారు.. ఇంకా ఉద్యోగుల పేర్లతో ఉన్న బినామీ ఖాతాలెన్నీ.. అనే అంశాలను కూలంకషంగా విచారణ చేపట్టాల్సి ఉంది. గతంలో దూర విద్య కేంద్రానికి ప్రత్యేకంగా ఖాతా ఉండేది.
అక్కడ కూడా ఈ విధంగా జరిగిందనే ఆరోపణలు వినపడుతున్నాయి. దూరవిద్య ఉద్యోగుల ఖాతాల్లోకి అధ్యయన కేంద్రాల వారు మామూళ్లను జమ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం కుంభకోణంలో బయటపడిన ఉదయభాస్కర్‌రెడ్డి గతంలో దూరవిద్య విభాగంలో విధులు నిర్వహించాడు. అక్కడ నుండే ఈ దందా మొదలైనట్లు తెలుస్తోంది.
బదిలీ వద్దు.. ఇక్కడే ముద్దు..
వర్సిటీలో ఏ ఉద్యోగి మూడేళ్లకు మించి అదే విభాగంలో విధులు నిర్వహించకూడదు. ఇందుకు తద్భిన్నంగా ఏళ్ల తరబడి బదిలీలు లేకుండా పైరవీలు చేయించుకోవడం సర్వసాధారణం. యూజీ పరీక్షలు(అండర్ గ్రాడ్యుయేట్),పీజీ (పోస్ట్‌గ్రాడ్యుయేట్), దూరవిద్య విభాగాల్లో ఏళ్ల తరబడి అక్కడే తిష్ట వేస్తున్నారు. యూజీలో సీనియర్ అసిస్టెంట్లు 9 మంది, జూనియర్ అసిస్టెంట్లు 14 మంది, దూరవిద్య విభాగంలో ముగ్గురు మూడేళ్లకు మించి ఏళ్లు గడిచినప్పటికి బదిలీ కాలేదు.
ఒకే చోట ఎక్కువ కాలం విధులు నిర్వహించడం చేత అక్కడి లొసుగులు తెలుసుకొని భారీ అవినీతికి తెరలేపుతున్నారు. ఫైనాన్స్ విభాగంలోని ఉదయ భాస్కర్‌రెడ్డి ,శేషయ్యలు ఎనిమిదేళ్ల నుండి అక్కడే విధులు నిర్వహించడం ఈ పరిస్థితులకు అద్దం పడుతోంది. కాగా, ఈ వ్యవహారాలకు కారణమైన ఇద్దరు ఉద్యోగులపై కేసులు పెట్టాలని పోలీసు విభాగాన్ని ఎస్కేయూ రిజిస్ట్రార్ ఆచార్య కే.దశరథరామయ్య కోరారు. క్రిమినల్ కేసులు కట్టాలా? లేక కేసును ఏసీబీకి బదలాయించాలా అనే అంశంపై ఆదివారం డీఎస్పీ ధ్రువీకరిస్తారని ఇటుకలపల్లి ఎస్‌ఐ .ఎస్ శివగంగాధర్ రెడ్డి స్పష్టం చేశారు.