‘టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేకంగా కరోనా వైద్యం’

TTD Plans To Facility Covid Quarantine Center For Employees - Sakshi

సాక్షి, తిరుమల: కరోన నేపథ్యంలో టీటీడీ ఉద్యోగుల భద్రతపై పాలకమండలి సమావేశంలో చర్చించామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో టీటీడీ ఉద్యోగులకు కోవిడ్ క్వారంటైన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేకంగా కరోనా వైద్యం అందిస్తామని చెప్పారు. పాలకమండలి అత్యవసర సమావేశం అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం భక్తుల సంఖ్యను పెంచడం గానీ, తగ్గించడం గానీ చేయడం లేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ద్వారా కళ్యాణోత్సవం సేవను నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రైవేట్ అతిథి గృహాలను ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌ ద్వారా కేటాయిస్తామని అన్నారు. వాహన బేరర్లకు మాస్క్ తప్పనిసరి చేశామని సుబ్బారెడ్డి తెలిపారు.
(చదవండి: చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం)

ప్రసాదాలు, కళ్యాణకట్ట వద్ద పూర్తి స్థాయి నియంత్రణ చర్యలకు ఆదేశాలిచ్చామన్నారు. తిరుమలలో ఉద్యోగులకు రెండు వారాలకు ఒక షిఫ్ట్ కేటాయిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనతో తిరుమలలోని కర్ణాటక సత్రాల్లో కళ్యాణమండపం నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని ఆయన తెలిపారు. అందుకు కర్ణాటక ప్రభుత్వం టీటీడీ వద్ద రూ.200 కోట్లు డిపాజిట్ చేసిందని తెలిపారు. శ్రావణ మాసంలో కర్ణాటక సత్రాలకు సీఎం వైఎస్‌ జగన్, కర్ణాటక సీఎం యడియూరప్ప శంకుస్థాపన చేస్తారని ఆయన వెల్లడించారు. కాగా, చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో ఐదుగురు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. మిగతా సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
(తిరుమలకు అన్ని రాష్ట్రాల నుంచి భక్తుల రాక)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top