చిరుద్యోగులే బలి..!

TTD Employees Doing Irregularities - Sakshi

అక్రమార్కులను వదిలి కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు

టీటీడీలో వింత పోకడ 

టీటీడీలో కొంతమంది అక్రమార్కుల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలన్నట్లుగా సాగుతోంది. తప్పు చేసి అడ్డంగా దొరికినా.. తమకున్న పరపతితో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి తిరిగి అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. వీరి పాపానికికింది స్థాయి ఉద్యోగులు బలైపోతున్నారు. ఇలా.. ఎప్పుడు ఏ ఘటన జరిగినా.. చిరుద్యోగులు ఇది తమ మెడకు ఎక్కడ తగులుకుంటుందోనని హడలైతిపోతున్నారు.

బదిలీ చేసినా తిరిగి అదేస్ధానంలో దఫేదార్‌
పై ఘటనకు బాధ్యులను చేస్తూ ముగ్గురు సిబ్బందిపై అధికారులు బదిలీ వేటు వేసిన సెక్టార్‌ –1 కార్యాలయంలో పనిచేసే ఇద్దరు సిబ్బంది అక్కడి నుంచి రిలీవ్‌ అవ్వగా. దఫేదార్‌ మాత్రం విధుల్లోనే కొనసాగుతున్నాడు. బదిలీ వేటు పడిందని తెలుసుకున్న దఫేదార్‌ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి తిరిగి అదే స్ధానంలో కొనసాగుతూ శనివారం రాత్రి విధుల్లో పాల్గొన్నారు.

సాక్షి, తిరుమల : గత కొంతకాలంగా టీటీడీలో వింతపోకడ కొనసాగుతోంది. ఏవైనా అక్రమాలు జరి గితే, అందులోని పెద్ద చేపలను వదిలి అక్కడే విధుల్లో ఉన్న చిరుద్యోగులపై బదిలీ వేటు వేసి అధి కారులు చేతులు దులుపుకుంటున్నారు. దీంతో అక్రమార్కులు ఇంకా రెచ్చిపోతూ తమ దందా లను ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం శ్రీవారి ఆలయంలో ఓ ఎన్నారై భక్తుడిని అక్రమంగా శ్రీవారి దర్శనానికి పంపిస్తూ ఓ అర్చకుడు నిఘా కళ్లకు చిక్కాడు. అప్రమత్తమైన సిబ్బంది భక్తుడిని పట్టుకుని విచారణ జరిపి, రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా తీసుకున్నారు. ఈ ఘటనను వెలుగులోకి రానీయకుండా సంబంధిత భద్రతాధికారి అణచిపెట్టగా, ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది.

స్పందించిన టీటీడీ ఉన్నతాధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్‌ అధికారులను ఆదేశించారు. విజిలెన్స్‌ అధికారులు ఒకరోజంతా శ్రీవారి ఆలయంలో ఆ సమయంలో విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు భద్రతా సిబ్బందిని విచారించారు. చివరకు బాధ్యులను వదిలేసి ఆగమేఘాలపై కిందిస్థాయి సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సిఫారసు చేశారు. వారి సూచన మేరకు ముగ్గురు సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. ఆ ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న దఫేదార్‌తో పాటు సెక్టార్‌ –1 కార్యాలయంలో విధుల్లో వున్న ఇద్దరు సిబ్బందిని తిరుపతికి బదిలీ చేశారు.

గతంలోనూ చిరుద్యోగుల పైనే చర్యలు
మూడు నెలల క్రితం శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో తిరుపతికి చెందిన టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు బ్రేక్‌ దర్శన టిక్కెట్లు లేకుండానే సర్వదర్శనం క్యూను స్కానింగ్‌ వద్దకు వదిలారు. ఇంతలో అడ్డదారిలో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన ఎల్‌–1 దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటుండగా, సదరు పాలకమండలి మాజీ సభ్యుడు తన వారితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో కులశేఖరపడిలో ఉన్న టీటీడీ ఉన్నతాధికారి టిక్కెట్టు లేకుండానే సదరు వ్యక్తి దర్శనానికి ఎలా వచ్చాడంటూ అక్కడి సిబ్బందిపై చిందులు తొక్కారు.

దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్‌ అధికారులను ఆదేశించారు. విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారులు ఉన్నతాధికారికి నివేదిక ఇచ్చారు. ఆ సమయంలో టిక్కెట్లను పరిశీలించే సూపరింటెండెంట్‌తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులను వదిలేశారు. విధుల్లో ఉన్న ముగ్గురు కిందిస్థాయి భద్రతా సిబ్బందిపై బదిలీ వేటు వేసి చేతులు దులుపుకున్నారు. ఇలా తమ తప్పు లేకపోయినా పైవారు చేసిన తప్పునకు తాము బలైపోతున్నామని కిందిస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వారిని వదిలి ఒత్తిళ్లకు తలొగ్గి కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటుండడం విమర్శలకు తావిస్తావుంది. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు మేల్కొని సమగ్ర విచారణ జరిపించి నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top