జాబితాలు సిద్ధం | transfer of employees Prepare lists | Sakshi
Sakshi News home page

జాబితాలు సిద్ధం

May 26 2015 1:10 AM | Updated on Sep 3 2017 2:40 AM

జిల్లాలో ఉద్యోగుల బదిలీల కోలాహలం ప్రారంభమైంది. కలెక్టర్ శనివారం ఆదేశించిన మీదట వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు

బదిలీలపై ఆందోళన చెందుతున్న ఉద్యోగులు
 పశుసంవర్థక శాఖలో కౌన్సెలింగ్ ప్రారంభం
 
 విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో ఉద్యోగుల బదిలీల కోలాహలం ప్రారంభమైంది.  కలెక్టర్  శనివారం ఆదేశించిన మీదట వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు జాబితాలు సిద్ధం చేసే పనిలో తలమునకలయ్యారు. ఆయా శాఖల్లో  మూడేళ్లు పైబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్న  ఉద్యోగులతో పాటు మూడేళ్ల లోపు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారి వివరాలతో కూడిన జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా, ఎక్కడి నుంచి ఇక్కడకు రావాలన్నా ఇన్‌చార్జి మంత్రి,కలెక్టర్, జిల్లా అధికారి నేతృత్వంలోని డీఎల్‌సీ కమిటీదే తుది నిర్ణయం కావడంతో ఉద్యోగులు భయపడుతున్నారు. తమను ఏ ప్రాంతానికి బదిలీ చేస్తారోనన్న ఆందోళనవారిలో నెలకొంది. ముఖ్యంగా పైరవీలు చేయించుకోలేని వారు, గతంలో పైరవీలకు అనుగుణంగా పనిచే యలేని కొందరు ఉద్యోగులు ఇప్పుడు ఇబ్బందులు పడే ప్రమాదముంది. దీంతో వారు బితుకుబితుకుమంటున్నారు.
 
 పశుసంవర్ధకశాఖలో కౌన్సెలింగ్ ప్రారంభం
  మరో పక్క జిల్లాలోని పశు సంవర్థక శాఖ పరిధిలో ఎన్‌జీఓల బదిలీలకు కౌన్సెలింగ్ ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన  పశుసంవర్ధక శాఖ అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ సోమశేఖర్ కలెక్టర్ ఆఫీసులోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఎన్‌జీఓలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒక్క జిల్లాకు సంబంధించిన వారినే కాకుండా మూడు జిల్లాలకు చెందిన రీజినల్ స్థాయిలోని ఉద్యోగులందరికీ బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇతర ప్రాంతాలనుంచి ఇక్కడకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. స్థలాల ఎంపిక, ఉద్యోగులు పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు.   కలెక్టరేట్ పరిపాలనాధికారి రమణమూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ముందుగా జిల్లాలో ఉన్న వీఆర్వోల జాబితాలను సిద్ధం చేస్తున్నారు.
 
 ప్రస్తుతం జిల్లాలో మూడేళ్లు దాటినా ఇంకా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నవారు 3వందల నుంచి 350 మంది వరకూ ఉన్నారని ఏఓ రమణ మూర్తి చెబుతున్నారు. వీరికి స్థానచలనం తప్పనట్టే! అదేవిధంగా రెవెన్యూలో ప్రస్తుతం అదనపు జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న యూసీజీ నాగేశ్వరరావు కూడా తప్పనిసరి బదిలీల్లో ఉంటారు. ఆయన కూడా చాలా సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన బదిలీల్లో ఈయనకు ఇతర ప్రాంతానికి బదిలీ కాగా నిలుపుకొన్నారు. ఆర్డీఓ కూడా మూడేళ్లు పైబడి విధులు నిర్వహిస్తున్నారు. సివిల్ సప్లైస్‌లో మూడేళ్లు దాటి ఒకే చోట పనిచేస్తున్నవారు సుమారు 24 మంది ఉన్నట్టు భోగట్టా! కేఆర్సీ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ శాఖల్లోనూ మూడేళ్లు దాటి విధులు నిర్వహిస్తున్న వారు ఉన్నారు. అయితే ఖజానా, విద్యాశాఖ, వాణిజ్య పన్నులు,కోర్టు,  ఎక్సైజ్ వంటి శాఖలకు ప్రత్యేక జీఓ ఇచ్చి బదిలీ చేస్తారని రావడంతో వారు ప్రస్తుతానికి ఆందోళన చెందడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement