చెప్పుకోలేని బాధ

toilets shortage in private college hostels - Sakshi

ప్రైవేటు కళాశాలల్లో టాయ్‌లెట్లు కరవు

విద్యార్థులకు సరిపడా లేక క్యూ కడుతున్న వైనం

వేధింపుల భయంతో మిన్నకుంటున్న తల్లిదండ్రులు

ఆటవిడుపు లేక ఒత్తిడిలో హాస్టల్‌ విద్యార్థులు

ప్రైవేటు కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లలో టాయిలెట్ల సమస్య తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని ఎవరూ సీరియస్‌గా పరిగణించకపోవడంతో విద్యార్థినులు సతమతమవుతున్నారు. తరగతుల విరామ సమయంలో చాంతాడంత క్యూలో ఇబ్బందులు పడలేక నీరు తాగడం తగ్గించుకుని అనారోగ్యానికి 
గురవుతున్నారు. 

సాక్షి, రాజమండ్రి: ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో జూనియర్‌ కళాశాలల్లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు అక్కడి వాతావరణం నివ్వెరపోయేలా చేస్తోంది. ఇరుకైన గదులు, కనిపించని పరిశుభ్రత, ప్రతి నిమిషం చదువుకే అంకితం కావాల్సిన పరిస్థితిలో విద్యార్థులు యాంత్రికంగా తయారవుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. రోజులో కాసేపైనా ఆటవిడుపునకు నోచుకోక పోవడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. చాలా కళాశాలలు, హాస్టళ్లల్లో టాయ్‌లెట్లు సరిపడా లేక విద్యార్థినులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాలకు అనుమతి ఇవ్వాలంటే విశాలమైన తరగతి గదులు, సైన్స్‌ ల్యాబ్, లైబ్రరీ, స్టాఫ్‌రూమ్, ప్రిన్సిపాల్‌ రూమ్, ఆఫీసురూమ్, ఆటస్థలం, టాయ్‌లెట్స్‌ తప్పనిసరి. ప్రైవేటు కళాశాలలు మాత్రం ఈ నిబంధనలు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. గాలి, వెలుతురు లేని ఇరుకుగదులు, నాలుగు ట్యూబ్‌లు, ఐదు ఖాళీ బాటిళ్లతో మమ అన్పించే ల్యాబ్‌లతో నెట్టుకొస్తున్నారు. ఎంత మంది విద్యార్థులున్నా రెండే బాత్‌రూమ్‌లు. ఇక ఆట స్థలం అంటారా.. ఆ ఊసే లేదు. 

హాస్టల్‌ విద్యార్థుల పరిస్థితి ఘోరం..
హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఒక్కో గదికి పది నుంచి 20 మందిని కేటాయిస్తున్నారు. గదిలో నడవడానికి సైతం దారి ఉండదు. ఒక్కోసారి మంచాలపైకి ఎక్కి నడవాల్సి ఉంటుంది. ఉదయం పూట బాత్‌రూమ్‌ కోసం బకెట్‌ పట్టుకుని క్యూలో నిల్చోవాలి. ఎవరికైనా అత్యవసరమైతే రిక్వెస్ట్‌ చేసుకుని ముందు వెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో విద్యార్థుల మధ్య గొడవలవుతున్నట్టు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వేలకు వేలు ఫీజుల రూపంలో దండుకుంటున్న యాజమాన్యాలు.. విద్యార్థుల సంఖ్యకు సరిపడా బాత్‌రూమ్‌లు నిర్మించాలన్న ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నాయని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అవన్నీ చిన్న విషయాలు.. చదువు ముఖ్యం.. అలా కాదంటే టీసీ ఇచ్చేస్తాం వేరే చోట చదివించుకోండంటూ ఎదురుదాడికి దిగుతున్న సందర్భాలున్నాయి. ఇటువంటి పరిస్థితి చక్కదిద్దాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. 

మంచినీరు తాగడం తగ్గిస్తున్నారు
కొంతమంది విద్యార్థులు చెబుతున్న దాని ప్రకారం ఇంటర్వెల్‌ సమయంలో మూత్రశాల వద్ద క్యూ కట్టే పరిస్థితి నెలకొంటుంది. అక్కడి పరిస్థితికి జడిసి పలువురు విద్యార్థులు మంచినీరు తాగడం బాగా తగ్గించేస్తున్నట్టు సమాచారం. మరికొందరు మూత్రం ఆపుకుంటూ ఇన్‌ఫెక్షన్లకు గురవుతున్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయాన్ని చెబుతున్నా యాజమాన్యాలను అడిగే సాహసం చేయలేక పోతున్నారు. ప్రశ్నిస్తే యాజమాన్యం తమ పిల్లలను వేధిస్తుందన్న కారణంతో ఏ ఒక్కరూ సమస్య తెలిసినా మిన్నకుండిపోతున్నారు. 

అందరికీ అవస్థలే..
జిల్లాలో 43 ప్రభుత్వ, 18 ఎయిడెడ్, ఒకేషనల్‌ 1, సాంఘిక సంక్షేమం 12, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆరు, రెసిడెన్షియల్, మోడల్‌ రెండు వంతున, 219 ప్రైవేటు కళాశాలలున్నాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం 50,332, ద్వితీయ సంవత్సరం 45,944 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 

తనిఖీలు ముమ్మరం చేస్తాం
ప్రైవేటు కళాశాలల్లో కొన్నిసమస్యలు మా దృష్టికి వచ్చాయి. వరుసగా కళాశాలలను తనిఖీ చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటాం. తనిఖీలు ముమ్మరం చేస్తాం.       
- ఎం.వెంకటేష్, ఆర్‌ఐవో, రాజమహేంద్రవరం   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top