కొలిక్కిరాని కమిటీలు


జాబితా తగ్గించి పంపాలన్న అధిష్టానం

నేతల మధ్య సమన్వయం లేక వాయిదా

ఎమ్మెల్సీలతో తృప్తి చెందుతున్న నేతలు

కార్యకర్తలను పట్టించుకోకపోవడంపై అసంతృప్తి

నేడు నెల్లూరులో టీడీపీ మినీ మహానాడు


 

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు : టీడీపీ జిల్లా, అనుబంధ సంఘాల కమిటీల నియామకంపై ఇంకా కొలిక్కిరాలేదు. పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు వారం రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే నేతలు మాత్రం కమిటీ నియామకాలపై నిర్ణయానికి రాలేదని తెలిసింది. జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించి వారం గడచిపోతోంది. సమావేశం రోజు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘరావు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, తదితరులు రాత్రంతా, మరుసటి రోజు ఉదయం వరకు పార్టీ కార్యాలయంలోనే తిష్టవేసి కమిటీ ఎంపిక కోసం సుదీర్ఘంగా కసరత్తు చేశారు. అయినా కుదరలేదు.మినీ మహానాడు కంటే ముందే కమిటీ ప్రకటించాల్సి ఉన్నా.. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కమిటీ ఇంత వరకు ప్రకటించలేదు. దీంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జిల్లా, అనుబంధ సంఘాల కమిటీ ఎన్నికలు జరపాల్సి ఉంది. అయితే జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిని మాత్రం ప్రకటించారు. మిగిలిన వారి నియామకంపై నేతల మధ్య సమన్వయం కుదరలేదని తెలిసింది.ఈ ఎన్నికల కోసం అధిష్టానం నలుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని నియమించింది. వారిలో మంత్రి నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర, మాజీ మంత్రి సోమిరెడ్డ్డి, ఆదాల ఉన్నారు. వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. కమిటీ ఎంపికపై ఈ నలుగురు ఏనాడూ ఓ చోట కూర్చొని చర్చించుకున్న దాఖలాలు లేవు. ఎవరికి వారు వారి అనుచరుల పేర్లతో జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. జిల్లా, అనుబంధ సంఘాల కమిటీల జాబితా మొత్తం 280 మందికిపైగా ఉండడంతో అధిష్టానం తిప్పి పంపినట్లు సమాచారం. జాబితా మొత్తం 75 మందికి మించి ఉండకూడదని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. అందులో ఎవరిని తొలగించాలి.. ఎవరి పేర్లు ఉంచాలో అర్థం కాక నేతలు తలలుపట్టుకుంటున్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top