కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు.
తిప్పర్తి, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఖాజీరామారంలో మంగళవారం జరిగిన తెలంగాణ ప్రజాగళం రెండోవార్షికోత్సవ ధూంధాం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు ముల్కీ అమరుల వారోత్సవాన్ని పాటించాలని, అందులో భాగంగానే 1నుంచి 6వరకు తెలంగాణ 10 జిల్లా ల్లో ర్యాలీలు, దీక్షలు కొనసాగించాలన్నారు. 1952 సెప్టెంబరు 3,4తేదీల్లో జరిగిన ముల్కీ ఉద్యమం లో నాన్ ముల్కీలను బయటకు పంపించి ముల్కీలకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, ఆ ఉద్యమం సందర్భంగా జరిగిన కాల్పుల్లో అమరులైన వారి సృ్మతితో వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కోదండరాం తెలిపారు.
తెలంగాణ ప్రజల తరపున మూడు డిమాండ్లు, ఒక విజ్ఞప్తి ఈ కార్యాచరణ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ దీక్ష చేయడం అప్రజాస్వామికమన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం ఎన్నికల్లో వాగ్దానాలను అమలు చేయాలన్నారు. తెలంగాణ ప్రజల పోరాటం... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం న్యాయం జరుగుతున్న పోరాటమన్నారు. ఈ పోరాటాలకు అన్ని పార్టీలు లొంగాల్సిందేనని, అలా లొంగని విధానాన్ని పాసిజం. నాజిజం లాంటివన్నారు. సెప్టెంబరు 7న హైదరాబాద్‌లో జరిగే ర్యాలీకి తెలంగాణ ప్రజలు తరలిరావాలన్నారు. ఈ ర్యాలీ సిటీ కాలేజీ నుంచి ప్రారంభమై బేగంబజార్, నాంపల్లి, సెక్రటేరి యట్, గన్‌పార్కు మీదుగా ఇందిరాపార్కుకు చేరుకుంటుందన్నారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన లాగా ఈ ప్రకటన యూటర్న్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రపొలిటికల్ జేఏసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారని, సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదని ఎద్దేవా చేశారు. ధూంధాంకు తెలంగాణ ప్రజాగళం నల్లగొండ జిల్లా కన్వీనర్ నకిరేకంటి సైదులు అధ్యక్షతన వహించగా, జిల్లా జేఏసీ చైర్మ న్ వెంకటేశ్వర్లు, మట్టిమనుషుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ వేనేపల్లి పాండురంగారావు, విద్యుత్ జేఏసీ జిల్లాకన్వీనర్ కరెంట్‌రావు, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, సర్పంచ్ మంగమ్మ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సైదులు,లక్ష్మీమనోహర్, శ్రీను, రవికుమార్, నాగయ్య, సైదులు, వేణు, నరేష్‌రెడ్డి, కొండల్‌రావు, నాగేందర్, ఇంద్రసేనారెడ్డి, ఆనంద్, సైదులు, రాములు, వెంకన్న, రవి పాల్గొన్నారు.