అడ్డు తొలగించుకోవాలని..

TDP Leaders Attack on YSRCP Leader Family - Sakshi

వైఎస్సార్‌సీపీ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడి కుటుంబ సభ్యులపై టీడీపీ వర్గీయుల దాడి

తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణరెడ్డి తండ్రి  

హత్యాయత్నం బదులుగా దాడి కేసుగా నమోదు

నాటకీయంగా బాధితులపైనే ఎస్సీ ఎస్టీ కేసు

వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. టీడీపీ నేతలు కక్షగట్టి వైఎస్సార్‌సీపీ నాయకులను కడతేర్చేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే
వైఎస్సార్‌సీపీ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు డి.లక్ష్మీనారాయణరెడ్డి కుటుంబ సభ్యులపై హత్యాయత్నానికి పాల్పడ్డారు.  ప్రత్యర్థుల దాడిలో లక్ష్మీనారాయణరెడ్డి తండ్రి  నరసింహారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కర్నూలు , మంత్రాలయం: వైఎస్సార్‌సీపీ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు దరి లక్ష్మీనారాయణరెడ్డి స్వగ్రామం మంత్రాలయం మండలం బూదూరు కాగా..  కొన్నేళ్ల క్రితం ఎమ్మిగనూరు పట్టణంలో స్థిరపడ్డారు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా లక్ష్మీనారాయణరెడ్డి స్వగ్రామానికి వచ్చి ఉంటాడనే భావనతో టీడీపీ నేతలు బి.మల్లికార్జునరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఆనుచరులు బుజ్జిగ మోజెస్, పోలీస్‌ అబ్రహాం, రోగెన్న, యాకోబ్‌ తదితరులు సోమవారం రాత్రి ఆయన ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆ సమయంలో లక్ష్మీనారాయణరెడ్డి లేకపోవడంతో తండ్రి దరి నరసింహారెడ్డి, అన్న దరి మల్లికార్జునరెడ్డి, వదిన భాగ్యలక్ష్మిపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో నరసింహారెడ్డి ఎడమ కాలు, ఎడమ చేయి విరిగిపోయాయి. దరి మల్లికార్జునరెడ్డి, భాగ్యలక్ష్మికి స్వల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నరసింహారెడ్డిని ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు పెద్దాసుపత్రికి తరలించారు. పోలీసులు భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మారణాయుధాలతో దాడికి పాల్పడినా  బెయిలబుల్‌ సెక్షన్లు 154, 157 కింద ఆరుగురిపై  పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. అధికారపార్టీ ఒత్తిడితోనే కేసు నమోదు ప్రక్రియ సాగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యూత్‌ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి కర్నూలు ఆసుపత్రి చేరుకుని బాధితులను పరామర్శించారు.  న్యాయం జరిగేంత వర కు అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. ఆయనతోపాటు మండల కన్వీనర్‌ భీమిరెడ్డి ఉన్నారు. 

కౌంటర్‌ కేసు  
దాడికి పాల్పడమే కాకుండా టీడీపీ నేతలు  బాధితులపై కౌంటర్‌ కేసు కోసం ఫిర్యాదు చేయించారు. లక్ష్మీనారాయణరెడ్డి అన్న  దరి మల్లికార్జునరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఓ మహిళతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసును నీరుగార్చేందుకు టీడీపీ నేతలు అధికార దర్పంతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని   గ్రామంలో చర్చ సాగుతోంది.

తమకు వ్యతిరేకంగా ఉన్నారనే అక్కసుతో..
పాతికేళ్లకుపైగా బూదూరు గ్రామ పాలన పెత్తందార్లైన మల్లికార్జునరెడ్డి కుటుంబ సభ్యుల చేతుల్లో సాగుతోంది. వారి కనుసన్నల్లోనే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. లేదంటే అణచివేసే కుట్రలు పన్నుతారు. వారి నియంత ధోరణికి విరుద్ధంగా లక్ష్మీనారాయణరెడ్డి పోరాటం చేస్తూ వస్తున్నారు. తమకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడన్న అక్కసుతో 2009లో బూదూరు గ్రామంలో లక్ష్మీనారాయణరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. అప్పట్లో మల్లికార్జునరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నర్శిరెడ్డి, విజయసింహారెడ్డిపై హత్యాయత్నం కేసు సైతం పెట్టారు. అప్పటి నుంచి వారి అరాచకాలపై పోరాడుతూనేవున్నాడు. పంచాయతీ ప్రగతి, నీరు–చెట్టు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్స్‌ గ్రాంట్, 2009 వరద నిధుల దోపిడీపై ఆర్టీఐ చట్టం ద్వారా వివరాలు కోరారు. దీనికితోడు గ్రామంలో వైఎస్సార్‌సీపీకి మద్దతు కూడబెట్టడంలోనూ లక్ష్మీనారాయణరెడ్డి సఫలీకృతుడయ్యారు. 2014 ఎన్నికల్లో గ్రామ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పెత్తందార్లకు వ్యతిరేకంగా 550 ఓట్ల మెజారిటీ సాధించారు. రాబోయే ఎన్నికల్లోనూ మెజారిటీ వస్తే తమ ప్రాభవం తగ్గిపోతుందని భావించి అంతమొందించాలన్న కుట్ర పన్నినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

నాకు, కుటుంబ సభ్యులకు ప్రాణహాని
గ్రామ టీడీపీ నాయకుల నుంచి నాకు, నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది. మమ్మల్ని హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఈ కోవలోనే సోమవారం మా ఇంటిపై దాడికి దిగారు. మా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలి. దాడులకు పాల్పడిన ప్రత్యర్థుల బండారం బయట పెట్టేందుకు వెనుకంజ వేయను. వారు చేసిన అవినీతి కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
– లక్ష్మీనారాయణరెడ్డి,వైఎస్సాసీపీ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top