రాఘవేంద్రుడి డైరెక్షన్‌

SVBC Chairman Raghavendra Rao Selected - Sakshi

ఎస్వీబీసీ చైర్మన్‌గా రాఘవేంద్రరావు

ప్రకటన విడుదల చేసిన టీటీడీ

చైర్మన్‌ నియామకం ఇదే మొదటిసారి

సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు నియమితులయ్యారు. శనివారం సాయంత్రం టీటీడీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు టీటీడీ ట్రస్ట్‌బోర్డులో సభ్యుడిగా కొనసాగిన రాఘవేంద్రరావును ఈసారి ఎస్వీబీసీకి చైర్మన్‌గా నియమించినట్లు టీటీడీ తన ప్రకటనలో పేర్కొంది. ఎస్వీబీసీకి చైర్మన్‌ను నియమించడం ఇదే మొదటిసారి.

తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తి తత్వాన్ని, క్షేత్ర ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటేందుకు, హిందూ ధార్మికతను పెంచేందుకు 2008లో టీటీడీ ఎస్వీబీసీ చానల్‌ను ప్రారంభించింది. ఏడాదికి రూ.25 కోట్ల బడ్జెట్‌ను కేటాయించి ఎస్వీబీసీని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ సీఈఓలుగా కేఎస్‌ శర్మ, జయదేవరెడ్డి, ఎస్‌.రామానుజం, మధుసూదనరావు, నరసింహారావులు పనిచేశారు. ప్రస్తుతం టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారిముక్తేశ్వరరావు ఎస్వీబీసీకి ఇన్‌చార్జి సీఈఓగా కొనసాగుతున్నారు.
ఆరోపణలు ఉన్నప్పటికీ
ఇటీవల ఎస్వీబీసీ ఉద్యోగులు, సీఈఓ నరసింహా రావుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. ఎస్వీబీసీ నిధులను కొల్లగొట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు సీఈఓపై ఈఓకు  ఫిర్యాదు చేశారు. సీఈఓ నరసింహారావు నిధుల వాడకంపై విజిలెన్సు విచారణ కూడా జరిగింది. ఇందులో రూ.2 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అప్ప టి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న రాఘవేంద్రరావు ఎస్వీబీసీలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమం కోసం కోట్లలో నిధులు ఖర్చు పెట్టారని, యాంకర్‌ పార్టులు మార్చి పాత వాటినే కొత్త ఎపిసోడ్లుగా చూ పారన్న ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ పరిస్థితి గందరగోళంగా మారింది. చానల్‌ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలన్న నిర్ణయంలో ఉన్న టీటీడీ తాజాగా ఎస్వీబీసీ చైర్మన్‌ నియామకాన్ని జరి పింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవేంద్రరావుకు చైర్మన్‌ పదవిని ఎలా ఇస్తారన్నది కొందరు ఉద్యోగుల ప్రశ్న. మొదటి నుంచీ ఎస్వీబీసీ వ్యవహారంలో పోరాటం చేస్తున్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి కూడా చైర్మన్‌గా రాఘవేంద్రరావు నియామకాన్ని తప్పుబడుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top