పాపం పసివాళ్లు

Suspicion Murders Hikes In Guntur - Sakshi

పచ్చని కుటుంబాల్లో అనుమానపు చిచ్చు

మద్యం మత్తులో భార్యలను హతమారుస్తున్న భర్తలు

తల్లిదండ్రుల తప్పులకు  బలవుతున్న పిల్లలు

‘మా అమ్మకు మేమంటే చాలా ఇష్టం.. రోజూ మమ్మల్ని ఆడించేది. ఇప్పుడు ఆస్పత్రిలో ఉంది. జ్వరం తగ్గగానే మా కోసం వస్తుంది’.. ఈ నెల ఏడో తేదీన చేబ్రోలులో భర్త చేతిలో హత్యకు గురైన రమ్యకృష్ణ కుమారులు చెబుతున్న మాటలివి. నాన్న ఎప్పుడు జైలు నుంచి వస్తాడో తెలియదు. అమ్మ తిరిగి రాదన్న నిజాన్ని ఎవ్వరూ చెప్పలేరు.  ఆరేళ్ల వసంత్, మూడేళ్ల మనీష్‌ అమ్మానాన్నకు దూరమై ఇలా ఒంటరిగా మిగిలిపోయారు. ప్రస్తుతం మేనమామ దగ్గర నిజాంపట్నంలో ఉంటున్నారు.

మంగళగిరి మండలం ఆత్మకూరులో ఈ నెల మూడో తేదీన రమేశ్‌ తన భార్యని రోకలి బండతో మోది హతమార్చాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు సుధాకర్‌ చికెన్‌ షాపులో పని చేస్తున్నాడు. రెండో కుమారుడు ఏసురత్నబాబు తొమ్మిదో తరగతి పూర్తి చేశాడు. రమేశ్‌ క్షణికావేశంలో చేసిన తప్పిదానికి కుటుంబం చిన్నాభిన్నమైంది. ప్రస్తుతం పిల్లలిద్దరూ బంధువులను ఆశ్రయించారు. ‘మా జీవితాలే అంతంతమాత్రం.. ఈ బిడ్డలు మాకు భారమేన’ని బంధువులు అంటున్నారు.  

సాక్షి, గుంటూరు:  అగ్ని సాక్షిగా వివాహం చేసుకుని.. నిండు నూరేళ్లు తోడుగా ఉంటామని ప్రమాణం చేసిన భర్తలే భార్యల పాలిట కాలయముళ్లుగా మారుతున్నారు. అనుమానం పెనుభూతమై విచక్షణ కోల్పోయి నమ్మివచ్చిన భాగస్వామిని బలి తీసుకుంటున్నారు. పచ్చని కాపురాన్ని రక్తపు మడుగులోకి నెట్టేస్తూ.. కన్నబిడ్డలను అనాథలుగా మిగులుస్తున్నారు. జీవితాన్ని నాశనం చేసుకుని జైళ్లలో ఊచలు లెక్కిస్తున్నారు.తల్లిదండ్రులు తొందరపాటులో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అభం శుభం ఎరుగని పిల్లలు అభాగ్యులుగా మారుతున్నారు. తల్లిదండ్రులు దూరం కావడంతో బంధువుల ఆదరణ కరువై అడ్డా కూలీలుగా, హోటళ్లలో సర్వర్లుగా మారుతున్నారు. కారణాలు ఏవైనా బడి బాట పట్టాల్సిన పిల్లలను పని బాట పడుతున్నారు.

భార్యాభర్తల మధ్య స్మార్ట్‌ చిచ్చు..
టెక్నాలజీ నేడు మనిషికి, మనిషికి మధ్య చిచ్చుపెట్టి అనుమానం అనే పెనుభూతాన్ని తట్టి లేపుతోంది. భర్త తన మెసేజ్‌కు సమాధానం ఇవ్వకపోతే భార్యకు అనుమానం. ఫోన్‌ చేసినప్పుడు భార్య లిఫ్ట్‌ చెయ్యకపోతే భర్తకు అనుమానం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతున్న సమయంలో స్మార్ట్‌ టెక్నాలజీ కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. కుటుంబానికి ఓ పెద్ద దిక్కు అంటూ లేకపోవడంతో భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకు సైతం గొడవలకు దిగి సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. చివరకు పిల్లల జీవితాలను అగాథాల్లోకి నెట్టేస్తున్నారు.

మద్యానికి బానిసలై..
పచ్చని కుటుంబాల్లో మద్యం చిచ్చురేపుతోంది. జిల్లాలో భార్యలను హతమార్చిన వరుస ఘటనలు పరిశీలిస్తే మద్యం మత్తులో జరిగినవే అధికం. భార్య మద్యానికి డబ్బులు ఇవ్వలేదని నిత్యం గొడవకు దిగుతూ తాగిన మైకంలో హతమారుస్తున్నారు. ఈ నెలలో జరిగిన మంగళగిరి, చేబ్రోలు ఘటనలు తాగిన మైకంలో భార్యలను రోకలి బండతో మోది హత్య చేసినవే.. భర్త మద్యానికి బానిసై వేధింపులకు గురి చేస్తున్నారని మహిళలు ఆత్మహత్యలు, హత్యలు చేసిన ఘటనలు సైతం ఉన్నాయి. గత నెల 29న మారుతీనగర్‌కు చెందిన హిమబిందు భర్త నిత్యం తాగివచ్చి వేధింపులకు గురి చేస్తున్నాడని ఇంట్లో ఫ్యాన్‌ ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడింది.

విచక్షణ కోల్పోవద్దు
సమస్యలు అందరికి ఉంటాయి. వాటిని సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి చేసే చర్యల వల్ల పిల్లలు అనాథలుగా మారతారు. ఇప్పటి వరకు చోటు చేసుకున్న ఘటనలను గుణపాఠం తీసుకుని అందరు లౌక్యంగా వ్యవహరించాలి. మద్యానికి బానిసలై పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకోవద్దు.– సీహెచ్‌ వెంకటప్పలనాయుడు, రూరల్‌ ఎస్పీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top