ఇవి నిషేధితమా..!

Survey Numbers In Prohibited list PSR Nellore - Sakshi

నగరంలోని పలు సర్వే నంబర్‌లు నిషేధిత జాబితాలోకి

రెవెన్యూ తప్పిదాలతో ఆందోళన చెందుతున్న ప్రజలు

రిజిస్ట్రేషన్‌కు ససేమిరా అంటున్న సబ్‌రిజిస్ట్రార్‌లు

గత తప్పిదాలే తిరిగి చేసిన రెవెన్యూ అధికారులు

నెల్లూరు(సెంట్రల్‌): అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కొన్నైతే, అన్ని పత్రాలతో కొనుగోలు చేసినవి మరికొన్ని, ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నారు. కానీ ఉన్న పలంగా ప్రభుత్వం మాత్రం ఆ సర్వేనంబర్లు నిషేధిత జాబితాలో చేర్చి ఆయా ప్రాంతాల ప్రజలను ఆందోళనలోకి నెట్టేశాయి. అవసరాలకు ఆ స్థలాలను క్రయవిక్రయాలు చేసుకుందామంటే రిజిస్ట్రేషన్‌ అధికారులు ససేమిరా అనే పరిస్థితి నెలకొంది. గతేడాది ఇదే తీరుతో జాబితాను పంపగా, తిరిగి ఈ ఏడాది మూడు రోజుల క్రితం అదే విధంగా తప్పుల తడకులుగా జాబితాలను రిజిస్ట్రేషన్‌ శాఖకు పంపడం గమనార్హం.

నిషేధిత జాబితాలో పలు సర్వేనంబర్‌లు
జిల్లాలోని నిషేధిత భూముల, స్థలాల సర్వేనంబర్లతో కూడిన జాబితాను జిల్లాలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌లకు రెవెన్యూ అధికారులు ప్రతి ఏడాది పంపుతారు. అదే విధంగా ఈ ఏడాది మూడు రోజుల కిత్రం కొత్త నిషేధిత సర్వేనంబర్‌ల జాబితాను పంపారు. కాగా ఈ నిషేధిత సర్వేనంబర్లలో నగర నడిబొడ్డున ఉన్న 1934, 35, 2022–ఏ, 2022–బి, 2010 నుంచి 2060 వరకు కొన్ని వందల సర్వేనంబర్లను నిషేధిత జాబితాలో పొందు పరచడం గమనార్హం. అధికారికంగా అన్ని ఉన్నా రెవెన్యూ పొరపాట్ల వల్ల ఆయా ప్రాంతాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

ఆందోళనలో ప్రజలు
జిల్లాలో రిజిస్ట్రేషన్‌ పరంగా నెల్లూరు, గూడూరు ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి. వీటిలో నెల్లూరు కింద 9 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, గూడూరు కింద మరో 10 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రతి ఏడాది పంపినట్లుగానే ఈ ఏడాది కూడా నిషేధిత సర్వేనంబర్‌ల జాబితాలను పంపారు. మొత్తం మీద ఒక్కో సబ్‌రిజిస్ట్రార్‌ పరిధిలో దాదాపుగా 1000 నుంచి 2000 వేల వరకు సర్వేనంబర్‌లు ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వేల సంఖ్యలో నిషేధిత సర్వేనంబర్‌లు ఉన్నాయి. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందనే విషయం తెలుస్తోంది. వీటిని డాట్‌ల్యాండ్‌గా చూపిస్తూ నిషేధిత జాబితాలో చేర్చడంపైనా సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top